Self-Promotional Ads Bans: వైద్యుల వాణిజ్య ప్రకటనలపై ఎన్‌ఎంసీ కఠిన మార్గదర్శకాలు.. ఇన్‌స్టాగ్రామ్, ఏఐ ప్రచారాలపై నిషేధం
Doctor Health Checkup
Self-Promotional Ads Bans: వైద్యులు, దవాఖానలు రోగులను ఆకట్టుకోవడానికి సోషల్ మీడియాను ఇష్టానుసారంగా ఉపయోగించుకోవడంపై నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) తీవ్ర స్థాయిలో అంకుశం వేసింది. ఈ నెల 6వ తేదీన జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం ఇన్‌స్టాగ్రామ్, ఇన్‌ఫ్లూయెన్సర్ మార్కెటింగ్, స్పాన్సర్డ్ పోస్టులు , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా సృష్టించిన ప్రచారాలను కూడా వైద్య ప్రకటనల పరిధిలోకి తీసుకువస్తూ కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. దవాఖానలు, వైద్య సంస్థలు , రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు పాటించాల్సిన నైతిక నియమావళి, ప్రజా సమాచార ప్రసారంపై రూపొందించిన ఈ నూతన మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది.
నూతన నిబంధనల ప్రకారం వైద్య సేవలను మార్కెట్ చేయడానికి, రోగుల అభిప్రాయాలు (Testimonials), డబ్బు చెల్లించి రాయించుకున్న నకిలీ సమీక్షలు (Paid Reviews), ఆధారాలు లేని తప్పుదోవ పట్టించే వాదనలు, కచ్చితమైన హామీతో కూడిన చికిత్స ఫలితాలు , రోగుల వ్యక్తిగత కథనాలను సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై ఎన్‌ఎంసీ పూర్తి నిషేధం విధించింది. ఇటీవల కాలంలో వైద్యులు కేవలం వైద్య అవగాహన కల్పించడం దాటి, తమ వ్యక్తిగత బ్రాండింగ్‌ను నిర్మించుకోవడానికి , రోగులను ఆకర్షించడానికి ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వేదికలను వాణిజ్యపరంగా వాడుకోవడం పెరిగిన నేపథ్యంలో ఎన్‌ఎంసీ ఈ కీలక చర్యలు చేపట్టింది.
ఈ ప్రకటనతో ప్రజారోగ్య సమాచారానికి, వ్యాపార ప్రచారానికి మధ్య ఎన్‌ఎంసీ స్పష్టమైన విభజన రేఖను గీసింది. తగిన ఆధారాలు , శాస్త్రీయ నిరూపణలు ఉంటే తప్ప, తమ చికిత్సా విధానం, ఆసుపత్రి సౌకర్యాలు లేదా తమ నైపుణ్యాలు ఇతరుల కంటే శ్రేష్ఠమైనవని వైద్యులు లేదా ఆసుపత్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రచారం చేసుకోకూడదని వైద్య నియంత్రణ సంస్థ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.