Skip to content
జాతీయం › వార్తలు

CJP Protest: ఒకే దేశం, ఒకే ఎన్నిక’ నినాదం వెనుక పెద్ద కుట్ర ఉంది.. కేంద్రంపై విరుచుకుపడిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే

jagan 06 Oct 2026 1 నిమిషాల పఠనం జాతీయం
CJP Protest: ఒకే దేశం, ఒకే ఎన్నిక’ నినాదం వెనుక పెద్ద కుట్ర ఉంది.. కేంద్రంపై విరుచుకుపడిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే

ఆగని దీక్ష...జంతర్ మంతర్ వద్ద ఆమరణ దీక్ష ప్రారంభించిన కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ (Video)

CJP Protest: “ఒకే దేశం, ఒకే ఎన్నిక” అనేది కేవలం ఒక నినాదం మాత్రమేనని.. దేశంలో “ఒకే దేశం, ఒకే రాజకీయ పార్టీ” వ్యవస్థను స్థాపించడమే కేంద్ర ప్రభుత్వ అసలు ఉద్దేశమని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తీవ్రంగా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ రాజీనామాను డిమాండ్ చేస్తూ నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించ తలపెట్టిన ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనవద్దంటూ మహారాష్ట్రలోని చంద్రాపూర్ పోలీసులు తమ పార్టీ కార్యకర్తలకు నోటీసులు జారీ చేయడంపై దీప్కే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలకు వెళ్లకుండా కార్యకర్తలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, ఈ యాత్రకు అయ్యే ఖర్చులకు నిధుల మూలం ఎక్కడిదని పోలీసులు ప్రశ్నించడం హృదయ విదారకమని పేర్కొన్నారు. ఈ నిరసన హింసాత్మకంగా మారుతుందని పోలీసులు ఏ ప్రాతిపదికన ఊహించారో చెప్పాలని ప్రశ్నించిన ఆయన, గాంధీజీ, అంబేడ్కర్ మార్గంలో శాంతియుతంగా ఆందోళన చేయడం హింస ఎలా అవుతుందని నిలదీశారు.

మరొకవైపు, అక్టోబర్ 10న జరగబోయే జంతర్ మంతర్ ఆందోళనకు ముందు తమ ముఖ్య నాయకులను అరెస్టు చేసే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలపై సీజేపీ సహ కన్వీనర్ సౌరవ్ దాస్ స్పందించారు. పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే అక్కడే కూర్చుని నిరసన తెలుపుతామని, ఈ పోరాటం దేశ యువతకు , ‘జెన్ జీ’ (Gen Z) భవిష్యత్తుకు సంబంధించినదని స్పష్టం చేశారు. ఎఫ్‌ఐఆర్‌లు, జైలు నిర్బంధాలకు తాము భయపడేది లేదని ఉద్ఘాటించారు.

అంతేకాకుండా, ఓటర్ల నమోదుకు సంబంధించిన ‘ఫారం 6’ అంశంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఉటంకిస్తూ, ఈసీ ప్రతిపాదనలను అత్యున్నత న్యాయస్థానం సమర్థించిందంటూ పత్రికా ప్రకటన విడుదల చేయడంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిందని దాస్ గుర్తుచేశారు. అక్టోబర్ 10 ఆందోళనను ఏ ఒక్క సంస్థ నిరసనగా కాకుండా, హక్కుల కోసం యువత పిలుపునిచ్చిన ఒక విస్తృత ఉద్యమంగా చూడాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.