NEHS: ఈహెచ్‌ఎస్‌కు విశేష స్పందన. 1,816 చికిత్స ప్యాకేజీలు.. కార్డు లేకున్నా ట్రీట్మెంట్..
NEHS
919 ఆస్పత్రుల్లో నగదురహిత వైద్యం
15,395 చికిత్సలకు రూ.104.63 కోట్ల చెల్లింపు
7.56 లక్షల హెల్త్‌కార్డుల డౌన్‌లోడ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, వారి కుటుంబ సభ్యుల కోసం అమల్లోకి తెచ్చిన న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఎన్‌ఈహెచ్‌ఎస్)కు మంచి స్పందన లభిస్తోంది. జూలై 17న ప్రారంభమైన ఈ పథకం పరిధిలోకి ఇప్పటికే 919 ఆస్పత్రులు వచ్చాయి. 15,395 చికిత్సలకు రూ.104.63 కోట్ల ముందస్తు అనుమతులు ఇచ్చారు. వీటిలో 778 ప్రైవేటు, 141 ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయి. ఉద్యోగులు, పింఛనుదారులతోపాటు అర్హులైన కుటుంబ సభ్యులకు కూడా ఈ పథకం వర్తిస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి పోలీసు శాఖను కూడా పథకంలో చేర్చారు.
నెలకు రూ.88 కోట్ల నిధి
ఈ పథకం నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది. ఉద్యోగులు, పింఛనుదారుల బేసిక్ పే లేదా బేసిక్ పెన్షన్ నుంచి 1.5 శాతం చొప్పున జమ చేస్తుంది. ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని తన వాటాగా చెల్లిస్తోంది. ఉద్యోగులు, పింఛనుదారుల నుంచి నెలకు రూ.44 కోట్లు సమకూరుతుంది. ప్రభుత్వం మరో రూ.44 కోట్లు అందిస్తోంది. దీంతో ప్రతి నెలా రూ.88 కోట్ల నిధి అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే మూడు నెలలకు సంబంధించిన నిధులను ట్రస్ట్‌కు బదిలీ చేశారు. ఈ పథకానికి వార్షిక బడ్జెట్ రూ.1,056 కోట్లు అంచనా వేశారు.
ఓపీ సేవలూ నగదురహితమే
ఆస్పత్రిలో చేరి చికిత్స పొందే సేవలతోపాటు ఔట్‌పేషెంట్ సేవలనూ పథకంలో చేర్చారు. వెల్‌నెస్ కేంద్రాల్లో వైద్యుల సంప్రదింపులు, పరీక్షలు, మందులను నగదురహితంగా అందిస్తున్నారు. ప్రస్తుతం 12 జిల్లాల్లో 12 వెల్‌నెస్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. మరో 25 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిలో 21 కేంద్రాలను వివిధ జిల్లాల్లో, మరో నాలుగింటిని హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే వెల్‌నెస్ కేంద్రాల సంఖ్య 37కు చేరుతుంది.
1,816 చికిత్స ప్యాకేజీలు
ఇన్‌పేషెంట్ వైద్య సేవలకు 1,816 సీజీహెచ్‌ఎస్ చికిత్స ప్యాకేజీలను అమలు చేస్తున్నారు. చికిత్సతోపాటు మందులు, పరీక్షలు, వినియోగ వస్తువులు, ఇంప్లాంట్లు, తదుపరి వైద్య సేవలను కూడా ప్యాకేజీల్లో చేర్చారు. అత్యవసర పరిస్థితుల్లో ముందస్తు రిఫరల్ లేకుండానే సమీపంలోని ఎంప్యానెల్డ్ ఆస్పత్రిలో చేరే అవకాశం కల్పించారు. అయితే నిర్ణీత సమయంలో సంబంధిత వివరాలను ట్రస్ట్‌కు తెలియజేయాల్సి ఉంటుంది.
కార్డు లేకున్నా చికిత్స
హెల్త్‌కార్డు జారీ కాలేదన్న కారణంతో అర్హులకు వైద్య సేవలను నిరాకరించరాదని అధికారులు స్పష్టం చేశారు. ఉద్యోగులు, పింఛనుదారులు తమ గుర్తింపు సంఖ్య ఆధారంగా వైద్య సేవలు పొందవచ్చు. సెప్టెంబర్ 28 నాటికి 12,56,962 మంది లబ్ధిదారుల హెల్త్‌కార్డులు అందుబాటులోకి రాగా, 7,56,210 మంది వాటిని డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఉద్యోగులకు సంబంధించిన 3,192 కేసులకు రూ.18.75 కోట్లు, వారి కుటుంబ సభ్యుల 5,669 కేసులకు రూ.39.52 కోట్లు అనుమతించారు. పింఛనుదారుల 4,042 కేసులకు రూ.29.27 కోట్లు, వారి కుటుంబ సభ్యుల 2,492 కేసులకు రూ.17.08 కోట్ల మేర ముందస్తు అనుమతులు ఇచ్చారు.
పాత బకాయిల్లో రూ.70 కోట్ల విడుదల
కొత్త పథకం అమల్లోకి వచ్చిన తర్వాత పాత ఈహెచ్‌ఎస్‌కు సంబంధించిన బకాయిల్లో రూ.70 కోట్లు విడుదల చేశారు. ఇంకా రూ.100.52 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందులో ప్రైవేటు ఆస్పత్రులకు రూ.23.85 కోట్లు, ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.76.67 కోట్లు బకాయి ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లించేందుకు రూ.19.23 కోట్ల విలువైన చెక్కులు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
30 ఆస్పత్రుల్లో హెల్ప్‌డెస్క్‌లు
లబ్ధిదారులకు ఆస్పత్రుల్లో ఇబ్బందులు తలెత్తకుండా 30 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేషన్, అడ్మిషన్, చికిత్స సమన్వయం నుంచి ఫిర్యాదుల పరిష్కారం వరకు వీటి ద్వారా సహాయం అందిస్తున్నారు.