Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల క్షేత్రంలో అనిశ్చితులు

Prajapaksham 03 Oct 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల క్షేత్రంలో అనిశ్చితులు

UP Elections

భారతదేశ రాజకీయ చిత్రపటంలో భౌగోళికంగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికున్న స్థానం దేశ పాలనాధికారానికి ఎంతో కీలకమైనది. ఢిల్లీ అధికారం చేజిక్కించుకోవాలంటే అది ఉత్తరప్రదేశ్‌ గుండానే సాధ్యం అన్నారు మాజీ ప్రధాని కీ.శే.అతల్‌ బిహారీ వాజ్‌పేయి. వైశాల్యం, జనాభా రీత్యా దేశంలోకెల్లా అతిపెద్దదైన ఉత్తరప్రదేశ్‌, లోక్‌సభలో 80 స్థానాలు కలిగి ఉంది. ప్రస్తుత లోక్‌సభలో (543 సీట్లు) అవి 15 శాతం. మోదీ ప్రభుత్వ ప్రయత్నం ఫలించి లోక్‌సభ సీట్లు 50 శాతం పెరిగితే అది నాలుగైదు హిందీ భాషా రాష్ట్రాలను కలుపుకుని కేంద్రంలో అధికారాన్ని గుప్పిటపట్టగలుగు తుంది. దేశంలో ఎన్నో రాష్ట్రాలు స్థానిక ప్రజాకాంక్ష ప్రకారం చీలి కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి గాని, ఉత్తరప్రదేశ్‌ ను నాలుగు రాష్ట్రాలుగా విభజించటానికి బిఎస్‌పి అధినేత మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ప్రయత్నం నెరవేరలేదు. 5 లోక్‌సభ సీట్లు కలిగిన ఉత్తరాఖండ్‌ను మాత్రం వేరుచేసి చిన్న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. ఉత్తరప్రదేశ్‌ దేశానికి గుండెకాయ వంటిదనే బలమైన భావనే దాని ఐక్యతను పరిరక్షిస్తున్నది. అయితే రాజకీయం ఏకశిలా సదృశం కాదు. దీర్ఘకాలం కాంగ్రెస్‌ పాలన అనంతరం మండల్‌ రాజకీయం, దళిత రాజకీయం పైచేయి సాధించాయి. హిందూత్వ, అయోధ్య రామమందిరం ఆందోళనలతో భారతీయ జనతాపార్టీ ఆధిక్యంలోకి వచ్చింది. గత 10 సంవత్సరాలుగా యోగి ఆదిత్యనాధ్‌ ముఖ్యమంత్రిగా బిజెపి ప్రభుత్వం ఏలుబడి సాగిస్తోంది. బిఎస్‌పి బలహీనపడగా, సమాజ్‌వాదిపార్టీ అఖిలేశ్‌ యాదవ్‌ సారధ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా బిజెపితో తలపడుతోంది. కాంగ్రెస్‌ దాని మిత్రపక్షంగా కొనసాగుతోంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో రెండు పార్టీలూ భాగస్వాములుగా ఉండగా, రాష్ట్రంలో వాటిమధ్య ఐక్యతలోనే వైరుధ్యాలు కూడా ఉన్నాయి. రాహుల్‌గాంధి, అఖిలేశ్‌ యాదవ్‌ మంచి మిత్రులుగా కనిపిస్తున్నప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్‌ స్థానాన్ని పరిమితిలో ఉంచటమే సమాజ్‌వాది పార్టీ ధ్యేయం.
వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో జరిగే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని గద్దెదించటం రెండు పార్టీల లక్ష్యం. కాని సీట్ల సర్దుబాటు తకరారు నడుస్తోంది. 403 అసెంబ్లీ సీట్లలో 100కు తక్కువ గాకుండా పోటీ చేయా లన్నది కాంగ్రెస్‌ ఆకాంక్ష. అందుకు ప్రాతిపదిక లేదన్నది సమాజ్‌వాది వాదన. బిహార్‌లో 20-21 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లకు పోటీచేసి తక్కువ సీట్లు గెలుచుకున్న కారణంగా అధికారాన్ని అందుకోలేకపోయా మన్న ఆర్‌జెడి వాదన ఉండనే ఉంది. హిందీ బెల్టులో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌, బిహార్‌లలో ఒబిసిలకు సామాజిక న్యాయం ఎజండాగా గల మండల్‌ పార్టీలు అధికారం కోల్పోయినా ప్రధాన ప్రతిపక్ష జాగాను ఆక్రమించి ఉన్నాయి. అవి కాంగ్రెస్‌కు తగిన స్థానం ఇవ్వటం లేదు. కాంగ్రెస్‌ స్థానం కూడా క్షేత్రస్థాయిలో సన్నగిల్లింది. జాతీయస్థాయి, రాష్ట్రస్థాయి నాయకులు తప్ప పార్టీ జెండా మోసే క్యాడర్‌ పలచబడింది పార్టీ వ్యవస్థాగత నిర్మాణం నామమాత్రం.
ఉత్తరప్రదేశ్‌నే తీసుకుంటే, అఖిలేశ్‌ యాదవ్‌ తమ యాదవ ముస్లిం ఐక్యత మద్దతును విస్తరించారు. పిడిఎను (పిచడా దళితులు, అల్పసంఖ్యాక (మైనారిటీలు) బలమైన సామాజిక కూటమిగా అభివృద్ధి చేశారు. అంతేగాక రాష్ట్రంలో ఎన్నికల పోటీలు సాంప్రదా యక చతుర్ముఖ పోటీగా లేవు బిజెపి ఎస్‌పి మధ్య ముఖాముఖి పోటీగా మారాయి. ఒకనాడు బలమైన శక్తిగా ఉన్న బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఓటు బ్యాంక్‌ చీలికలు పీలికలైంది. ఈ పరిస్థితికి మాయావతియే కారణం. పార్టీలో రెండవ స్థానం విషయంలో ఆమె గందరగోళంలో ఉన్నారు. మేనల్లుడు ఆకాశ్‌ ఆనంద్‌ను కనీసం రెండు సార్లు ఆ స్థానంలో నియమించింది. అతను ఆ స్థానంలో నిలదొక్కుకుని బిజెపికి వ్యతిరేకంగా పార్టీని సన్నద్ధం చేయటానికి ప్రయత్నించినపుడల్లా అతన్ని తొలగించింది. ఈ మధ్యనే పార్టీ జాతీయ కో ఆర్డినేటర్‌గా రెండో మేనల్లుడు ఇషాన్‌ ఆనంద్‌ను నియమించారు. ఇటువంటి చర్యలు క్యాడర్‌ను గందరగోళ పరుస్తున్నాయి. సాంప్రదాయక బిఎస్‌పి ఓటర్లకు బిజెపి, సమాజ్‌వాది పార్టీ, పశ్చిమ యుపి దళిత నాయకుడు చంద్రశేఖర్‌ రావణ్‌ ఏర్పాటు చేసిన ఆజాద్‌ పార్టీ ఎరవేస్తున్నా ఆమె నిస్సహాయతలో ఉన్నారు. బిఎస్‌పికి లోక్‌సభలో సభ్యుడు లేరు, అసెంబ్లీ లో ఒక్కరే ప్రతినిధి కూడా అనారోగ్యంతో మరణించారు. మాయావతి తమ పార్టీ ఉనికికోసం పోరాడుతోంది.
ఈ పరిస్థితుల్లో ద్విముఖ పోటీ ఖరారవుతోంది. ఈ ఎన్నికల్లో ఎస్‌పికి కాంగ్రెస్‌ కన్నా, కాంగ్రెస్‌కు ఎస్‌పి తోడ్పాటు అవసరం. రెండు పార్టీల ఐక్యత బిజెపికి గట్టి పోటీ ఇచ్చేందుకు, ఓటరు మహాశయుడు కరుణిస్తే ఆ పార్టీని గద్దె దించేందుకు అత్యంత అవసరం. అందువల్ల రెండు పార్టీలు పట్టువిడుపులతో వ్యవహరించటం, ఐక్య పోరాట శక్తిగా ప్రజల ముందుకు వెళ్లటం అవసరం. రాహుల్‌ అఖిలేశ్‌ యాదవ్‌ జోడీకి ఆకర్షణ, విశ్వసనీయత ఉంది. దాన్ని ఓట్లలోకి మలుచుకోవటానికి ఉభయ పార్టీలు తమ కార్యకర్తలను ఇప్పటినుంచే కర్తవ్యోన్ముఖులను చేయగలిగితేనే ఆశిస్తున్న ఫలితం లభించే అవకాశం మెరుగవుతుంది.