లేదు.. లేదంటూనే యుపిఐపై రుసుము!
UPi
కె.శ్రీనివాస్
సామాన్యుడు భయడపాల్సింది ఏమీ లేదని, డిజిటల్ చెల్లింపులపై రుసుము ఆలోచన వారిపై ఎలాంటి ప్రభావం చూపదని చెప్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం, ‘వినాయక చవితి’ పర్వదినాన (సెప్టెంబర్ 14)న వెజిట్ నోటిఫిషన్ జారీ చేయడం ఆశ్చర్యకర పరిణామం. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007లోని సవరించిన ‘సెక్షన్ 10 ఎ’ కింద ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో రూ.2,000 వరకు యుపిఐ లావాదేవీలకు, రుపే డెబిట్ కార్డు చెల్లింపులకు బ్యాంకులు, పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఎలాంటి రుసుము వసూలు చేయరాదని పేర్కొన్నారు. అయితే, అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతోంది. ఇంతకాలం యుపిఐ లావాదేవీలపై మొత్తంతో సంబంధం లేకుం డా ఎలాంటి రుసుము లేకపోతే, ఇప్పుడు చట్టపరమైన రక్షణను రూ.2,000 వరకు మాత్ర మే ఎందుకు పరిమితం చేశారు? రూ.2,000 దాటిన లావాదేవీల విషయంలో భవిష్యత్తులో మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండిఆర్) విధించే అవకాశం ఉందా? ఉంటే ఎంత? ఎవరిపై? ఏ లావాదేవీలకు? వినియోగదారుడిపై ప్రత్యక్ష ప్రభావం ఉండదని ప్రభుత్వం చెబుతున్నప్పుడు, వ్యాపారి చెల్లించే రుసుము చివరికి వస్తువు ధరలో కలిసిపోయే అవకాశాన్ని ఎలా నిరోధిస్తా రు? ఇవే ప్రజల ముందున్న వాస్తవ ప్రశ్నలు. ప్రస్తుతం రూ.2,000కు మించిన యుపిఐ చెల్లింపులపై ఎలాంటి ఎండిఆర్ అమలులోకి రాలేదు. ప్రభుత్వం కూడా రేటును ఇంకా నిర్ణయించలేదని చెబుతోంది. యుపిఐ అండ్ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకునే ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే యుపిఐకి రుసుము మొదలైంది అని చెప్పడం వాస్తవానికి మించి వెళ్లడం అవుతుంది. అదే సమయంలో యుపిఐ ఎప్పటికీ పూర్తిగా ఉచితంగానే ఉంటుంది అని చెప్పడానికి కూడా తాజా చట్టపరమైన మార్పు తర్వాత ఆధారం లేదు. ఈ రెండింటి మధ్య ఉన్న ఖాళీనే ఇప్పుడు ప్రభుత్వం స్పష్టంగా పూరించాలి. ఇదే అంశంపై కాంగ్రెస్ నాయకత్వం చేసిన విమర్శ రాజకీయ వాదనను ముందుకు తెచ్చింది. జైరాం రమేశ్ ప్రశ్నించినట్టు, రూ.2,000 వరకు మాత్రమే చార్జీల నుంచి చట్టపరమైన రక్షణ కల్పించడం భవిష్యత్తులో పెద్ద లావాదేవీలపై రుసుము విధించడానికి తలుపు తెరిచినట్టే నా అన్న సందేహం సహజమే. అమెరికన్ కంపెనీలకు మార్కె ట్ తెరవడానికి, అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్‌ను సంతృప్తిపరచడానికి ఈ మార్పు చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. యుపిఐని నిర్వహించడం ఉచితం కాదన్నది నిజం. లావాదేవీల పరిమాణం విపరీతంగా పెరిగినకొద్దీ సర్వర్లు, డేటా సెంటర్లు, సైబర్ భద్రత, మోసాల నివారణ, వ్యవస్థ నిర్వహణ, సాంకేతిక నవీకరణలపై ఖర్చు పెరుగుతుందనేది కూడా నిజమే. జులై 2026లోనే యుపిఐ 23.6 బిలియన్ లావాదేవీలను, సుమారు రూ.29.9 లక్షల కోట్ల విలువను నిర్వహించింది. ఇంత భారీ మౌలిక వ్యవస్థను నిరంతరం నిర్వహించడానికి స్థిరమైన ఆదాయ నమూనా అవసరమని చెల్లింపు పరిశ్రమ చాలాకాలంగా చెబుతోంది. అయితే ఖర్చు ఉందనే వాదనతోనే రుసుము విధానానికి సమర్థన కూడదు. యుపిఐ విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి దాని సరళత, చౌకదనం. చిన్న వ్యాపారి నుంచి సాధారణ ఉద్యోగి వరకు అందరికీ ఒకే డిజిటల్ మౌలిక సదుపాయాన్ని అందించడం దాని బలం. అందులో రుసుము ప్రవేశిస్తే, అది ఎంత చిన్నదైనా, ఆ వ్యవస్థపై ప్రజల మానసిక నమ్మకాన్ని ప్రభావితం చేయవచ్చు. ప్రత్యేకించి నగదు నుంచి డిజిటల్ చెల్లింపుల వైపు ప్రజలను మళ్లించినప్పుడు డిజిటల్ చెల్లింపు ఉచితం అనే భావన కూడా ఒక విధాన ప్రోత్సాహకంగా పనిచేసింది. ఇక్కడ ప్రభుత్వం చెప్పే మరో అంశాన్ని కూడా విస్మరించలేం. ప్రస్తుతం యుపిఐ వ్యవస్థకు ప్రభుత్వ సబ్సిడీలు, ఇతర ఆర్థిక మద్దతులు అవసరమవుతున్నాయి. లావాదేవీలు పెరి గే కొద్దీ ప్రతి లావాదేవీపై ప్రభుత్వమే వ్యయం భరించడం దీర్ఘకాలంలో ఎంతవరకు సాధ్యమనే ప్రశ్న ఉంది. మరిన్ని కంపెనీలు ఈ రంగంలోకి రావాలంటే వాటికి స్థిరమైన వ్యాపార నమూనా అవసరం. సైబర్ భద్రతపై పెట్టుబడులు పెంచాలి. మోసాల నియంత్రణకు ఆధునిక సాంకేతికత అవసరం. ఇవన్నీ వాస్తవ సమస్యలే. కానీ అదే సమయంలో, మరో ప్రమాదం కూడా ఉంది. ప్రభుత్వం వ్యాపారులపై ఎండిఆర్ విధించినా, వ్యాపారి ఆ వ్యయాన్ని వినియోగదారుడిపై మళ్లించే అవకాశం పూర్తిగా లేకపోలేదు. చట్టపరంగా చార్జీ వినియోగదారుడిపై కాదు అని చెప్పడం ఒక విషయం; వస్తువు లేదా సేవ ధరలో ఆ వ్యయం ప్రతిబింబించకుండా చూడటం మరో విషయం. ఒక రెస్టారెంట్, ఆసుపత్రి, ఆన్‌లైన్ సేవ, పెద్ద రిటైల్ సంస్థ లేదా ఇతర వ్యాపారి తన మొత్తం చెల్లింపు వ్యయాన్ని ధరల నిర్మాణంలో కలిపితే, వినియోగదారుడు పరోక్షంగా భారం మోయాల్సి వస్తుంది. అందుకే ఎండిఆర్ రూపకల్పనలో రేటు కంటే పారదర్శకత, పోటీ, వినియోగదారుడి రక్షణ ముఖ్యమైనవి. ఇంకో ముఖ్యమైన అంశం చిన్న వ్యాపారులది. యుపిఐని అత్యంత వేగంగా స్వీకరించిన వర్గాల్లో చిన్న దుకాణదారులు, వీధి వ్యాపారు లు, స్వయం ఉపాధి పొందేవారు ఉన్నారు. వారికి ప్రతి లావాదేవీపై అదనపు ఖర్చు కూడా గణనీయమే. పెద్ద సంస్థలకు అది ఖర్చుల లో ఒక చిన్న భాగం కావచ్చు. చిన్న వ్యాపారికి మాత్రం అది లాభంలో నేరుగా కోత కావచ్చు. అందుకే రూ.2,000 పరిమితి కేవలం వినియోగదారుడిని రక్షించే గీత కాదు. చిన్న వ్యాపార వ్యవస్థను కాపాడే విధాన పరికరంగా కూడా చూడాలి. వినియోగదారుల నుంచి నేరుగా యుపిఐ చార్జీ వసూలు చేయడం లక్ష్యం కాదని, భవిష్యత్తులో ఎండిఆర్ ఉంటే అది వ్యాపారులపై వర్తిస్తుందని స్పష్టం చేయడం ఇప్పటివరకు ప్రభుత్వం చెప్పిన అత్యంత ముఖ్యమైన విషయం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఎండిఆర్ వినియోగదారులపై కాకుండా వ్యాపారులపై వర్తిస్తుందని, బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు మౌలిక సదుపాయాలు, భద్రత, ఆవిష్కరణలపై పెట్టుబడులు పెట్టడానికి అది తోడ్పడుతుందని పేర్కొన్నారు. పార్లమెంటులోనూ యుపిఐపై వినియోగదారుల నుంచి పన్ను లేదా ప్రత్యక్ష చార్జీ విధించే ఉద్దేశం లేదని ప్రభుత్వం వివరించింది. అయితే మాటలకంటే చట్టంలోని స్పష్టతే ప్రజలకు ముఖ్యం. నిన్నటి వరకు చార్జీ రక్షణ విస్తృతంగా ఉండి, ఇప్పుడు రూ.2,000 వరకు మాత్రమే స్పష్టంగా పేర్కొంటే, సహజంగానే అనుమానం కలుగుతుంది. ప్రభు త్వం ఆ అనుమానాన్ని రాజకీయ ప్రతివాదంతో కాదు, స్పష్టమైన విధాన పత్రంతో తొలగించాలి. రూ.2,000 పరిమితి ఎందుకు ఎంచుకున్నారో చెప్పాలి. పెద్ద లావాదేవీలకు ఎండిఆర్ ఉంటే దాని గరిష్ఠ పరిమితి ఏమిటో వెల్లడించాలి. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే లావాదేవీలపై ఎలాంటి రుసుము ఉండదని స్పష్టమైన నిబంధన ఇవ్వాలి. వ్యాపారులు వినియోగదారుల నుంచి ఆ రుసుము ను ప్రత్యేకంగా వసూలు చేయకుండా ఏ రక్షణలు ఉంటాయో వివరించాలి.
యుపిఐ భారతదేశపు డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు చెందిన ప్రజా మౌలిక సదుపాయంగా మారింది. దాని యాజమా న్యం, నిర్వహణ, సాంకేతిక భాగస్వామ్యం గురించి చర్చలు ఉండవచ్చు. విదేశీ సంస్థలు ఈ వ్యవస్థలో పనిచేయవచ్చు. దేశీయ ఫిన్టెక్ సంస్థలు పోటీ పడవచ్చు. కానీ అంతిమంగా వ్యవస్థ ప్రజలకు ఎంత అందుబాటులో ఉంది, ఎంత సురక్షితంగా ఉంది, ఎంత పారదర్శకంగా ఉంది అన్నదే దాని విజయానికి కొలమానం. ప్రభుత్వం కూడా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. యుపిఐని ప్రపంచానికి భారత డిజిటల్ విజయగాథగా చూపించినప్పు డు, దాని ఉచితాన్ని కూడా ఆ విజయగాథలో భాగంగానే చూపించింది. ఇప్పుడు ఆ నమూనాలో మార్పు చేయాలనుకుంటే, ప్రజలకు ముందుగానే పూర్తి వివరాలు చెప్పాలి. పార్లమెంటులో చట్టం ఆమోదం పొందడం మాత్రమే ప్రజా విశ్వాసానికి సరిపోదు. చట్టం తర్వాత వచ్చే ప్రతి నోటిఫికేషన్ కూడా అదే స్థాయి పారదర్శకతను కలిగి ఉండాలి. ప్రతిపక్షం కూడా ఈ అంశాన్ని భయాందోళనల రాజకీయంగా కాకుండా విధాన చర్చగా నడిపితేనే ప్రజలకు ప్రయోజనం. రేపు అందరిపై చార్జీ పడొచ్చు అనే సందేహం లేవనెత్తడం సమంజసమే. కానీ అది వాస్తవం కావాలంటే ఆధారం కావాలి. అదే సమయంలో ప్రభుత్వం వినియోగదారుడిపై ఎలాంటి భారం లేదు అని చెప్పడమే కాకుండా, ఆ హామీకి చట్టపరమైన, నియంత్రణపరమైన భరోసా ఇవ్వాలి. యుపిఐకి ఇప్పుడు ఎదురవుతున్న అసలు సవాలు ఉచితం వర్సెస్ రుసుము అనే సరళమైన ద్వంద్వం కాదు. ప్రజలకు అందుబాటులో ఉండే, వ్యాపారులకు భరించగలిగే, బ్యాంకులు ఫిన్టెక్ సంస్థలకు పెట్టుబడి పెట్టేంత ఆదాయాన్ని అందించే, అంతర్జాతీయ స్థాయిలో సురక్షితంగా ఉండే చెల్లింపు వ్యవస్థను ఎలా నిర్మించాలన్నదే అసలు ప్రశ్న. ఆ సమతుల్యత సాధించడంలో విఫలమైతే ఉచిత యుపిఐ కూడా నిలవదు; నియంత్రణలేని రుసుములు ప్రవేశిస్తే దాని ప్రజాదరణ కూడా దెబ్బతింటుంది. అందువల్ల సెప్టెంబరు 14వ తేదీ నాటి నోటిఫికేషన్‌ను తుది నిర్ణయంగా కాకుండా ఒక కొత్త దశకు ఆరంభంగా చూడాలి. ఈ దశలో అత్యవసరమైనది రాజకీయ ఆరోపణ కాదు, విధాన స్పష్టత. యుపిఐని నిర్మించడానికి ప్రజలు తమ అలవాట్లు మార్చుకున్నారు. ఇప్పుడు ఆ వ్యవస్థ భవిష్యత్తును నిర్ణయించే వారు కూడా ప్రజల నమ్మకాన్ని కేంద్రంగా ఉంచాలి. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు నిలకడ అవసరమే. కానీ ఆ నిలకడకు తొలి పెట్టుబడి ప్రజల విశ్వాసమే. దానిపై ఎలాంటి రుసుము విధించకూడదు.