తెలంగాణ సర్దార్.. జమలాపురం కేశవ రావు
Jamalapuram Kesava Rao
(సెప్టెంబర్ 3 న జమలాపురం కేశవ రావు జయంతి సందర్భంగా)
కామిడి సతీష్ రెడ్డి, భూపాల్ పల్లి జిల్లా
నిజాం నిరంకుశ పాలనలో బానిసలుగా బతుకుతున్న వారి స్వేచ్ఛకోసం, తమ జీవితాన్ని త్యజించిన వారిలో ‘సర్దార్ జమలాపురం కేశవరావు’ ముందు వరుసలో నిలుస్తారు.. కళ్లెదుట జరుగుతున్న అన్యాయాలకు చూస్తూ, సహిస్తూ ఉండలేక ప్రజల్లో ధైర్య సాహసాలను నూరిపోయడమే ఏకైక లక్ష్యంగా జీవితాంతం మందుకు సాగారు. హైదరాబాద్ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీకి జీవంపోసి, ప్రజా శ్రేయస్సు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిబద్దత కలిగిన నేత, త్యాగశీలి సర్దార్ జమలాపురం కేశవరావు. సత్యాగ్రహిగా, క్విట్ ఇండియా ఉద్యమ కార్యకర్తగా, ఆంధ్రమహాసభ నిర్వాహకుడిగా, గ్రంథాలయోద్యమ నిర్మాతగా, ఆదివాసీ, దళిత జనోద్ధారకుడిగా, పత్రిక స్థాపకుడిగా ఇలా ఎన్నో కార్యకలాపాలు చేపట్టి హైదరాబాద్ రాజ్య ప్రజల్లో చైతన్యాన్ని, ధైర్యాన్ని నింపిన మహోన్నతుడు కేశవరావు. అందుకే ఆయన్ను అందరూ తెలంగాణ ‘సర్దార్’గా పిలుచుకుంటారు. తెలంగాణ కేసరిగా, ‘దక్కన్ సర్దార్’గా బిరుదులందుకున్న జమలాపురం కేశవరావు తనదైన శైలిలో ఉద్యమాలు నడిపి కాంగ్రెస్‌కు, తెలుగు వారి ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ఊపిరి పోశారు.
కేశవరావు నిజాం సంస్థానంలో తూర్పు భాగాన ఉన్న ఖమ్మం (నాటి వరంగల్ జిల్లా)లోని ఎర్రుపాలెంలో 1908, సెప్టెంబర్ 3న జమలాపురం వెంకట రామారావు, వెంకట నరసమ్మలకు తొలి సంతానంగా జన్మించారు. సంపన్న జమీందారీ వంశంలో పుట్టినా, నాటి దేశ రాజకీయాలు అతనిని తీవ్రంగా కలవరపరచాయి. ఎర్రుపాలెంలో ప్రాథమిక విద్య అనంతరం, హైదరాబాదులోని నిజాం కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1923లో రాజమండ్రిలో మొదటిసారి మహాత్మా గాంధీ ఉపన్యాసాన్ని విన్న కేశవరావు, 1930లో విజయవాడలో జరిగిన సభలో గాంధీ పరిచయంతో మరింత ఉత్తేజితుడైనాడు. ఆంధ్రపితామహుడుగా మాడపాటి హనుమంతరావు ప్రారంభించిన గ్రంథాల య ఉద్యమంను తెలంగాణలోని ప్రతి పల్లెలోనూ ప్రచారం గావించారు. వయోజన విద్యకై రాత్రి పాఠశాలలు నడపడంలో కేశవరావు కృషి చేశారు. 1938లో దీపావళి సందర్భంగా ఆవిర్భవించిన ‘హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్’ స్థాపనలో కేశవరావు కీలకపాత్ర వహించి, దానికి మొదటి అధ్యక్షుడయ్యారు.
1938 సెప్టెంబర్ 24 మధ్యాహ్నం మధిరలో గోవిందరావు నానక్, జనార్దనరావు దేశాయ్, రావి నారాయణరెడ్డిలతో కలిసి సత్యాగ్రహ దీక్షకు కేశవరావు సిద్ధమయ్యాడు. ఎట్టి పరిస్థితుల్లో సర్దార్‌ను దీక్ష చేయనివ్వొద్దని నిజాం ప్రభుత్వం అనుమతి నివ్వలేదు. మధిరలో అడుగడుగునా పోలీసులను మెహరించిం ది. ఎవరూ ఉహించని విధంగా రైతు వేషంలో దీక్ష వేదిక దగ్గరకు వచ్చాడు కేశవరావు. వెంటనే మహాత్మాగాంధీకి జై, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ జై అని దిక్కులు పెక్కటిల్లేలా నినాదించారు. అరెస్టు చేసి నిషేధాన్ని ఉల్లఘించి సత్యాగ్రహ దీక్ష చేశారంటూ కేశవరావుకు 18 నెలలు జైలు శిక్ష విధించారు. వరంగల్ జైలులో ఎనిమిది నెలల శిక్షను అనుభవించిన తర్వాత కేశవరావుతో సహా రాజకీయ ఖైదీలందరినీ నిజామాబాద్ జైలుకు తరలించారు. జైలు నుంచి విడుదలయ్యాక కూడా అదే పోరాట పంథాను కేశవరావు కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ సభలు, సమావేశాలు జరిగినపుడు ఒక సామాన్య కార్యకర్త మాదిరిగా పందిళ్ళు వేయడానికి, కర్రలు కూడా నాటి నిరాడంబరతకు, పార్టీ పట్ల అంకితభావంకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచి, అంతలా పార్టీకి సేవచేసిన ఆయనకు కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల మూలంగా రావాల్సినంత పేరు, దొరకాల్సిన గౌరవం రాలేదు. జైలు జీవితం, ఉద్యమ సమయంలో భోజనం లేకపోవడం, పార్టీలో ఒత్తిళ్లు కలగలిసి తీవ్ర మానసిక ఒత్తిడికి గురి అయిన కేశవరావు1953, మార్చి 29న తన 46వ ఏట మరణించారు.