Skip to content
ఎడిట్ పేజి వార్తలు

Arudra Birthday August 31: పరిచయం అవసరం లేని సాహితీ మూర్తి … ఆరుద్ర

Prajapaksham 31 Aug 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
Arudra Birthday August 31: పరిచయం అవసరం లేని సాహితీ మూర్తి … ఆరుద్ర

Arudra Birthday August 31: ఆరుద్ర.. పరిచయం అవసరం లేని సాహితీ మూర్తి. 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలో జన్మించిన భాగవతుల సదాశివశంకర శాస్త్రి, సాహితీ లోకంలో ఆరుద్రగా సుప్రసిద్ధుడు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఇతివృత్తంగా తీసుకొని రాసిన ‘త్వమేవాహం’ (1949) కావ్యం చదివి ‘ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు’ అని మహాకవి శ్రీశ్రీ ప్రశంసించాడంటే, ఆరుద్ర సత్తా ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీశ్రీ అనంతరం సమాజంపై తనదైన, బలమైన ముద్ర వేసిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటకకర్త, విమర్శకుడు. ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగు రచయిత్రి.

విశాఖపట్నం ఎవిఎన్‌ కాలేజీ ఉన్నత పాఠశాల, విజయనగరం ఎంఆర్‌ కళాశాలలో విద్యాభ్యాసం చేసిన ఆరుద్ర, క్విట్‌ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికాడు. 1943 మధ్యకాలంలో రాయల్‌ ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో గుమస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. 1947లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ‘ఆనందవాణి’కి సంపాదకుడిగా వ్యవహరించాడు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) వ్యవస్థాపకుల్లో ఒకడైన ఆరుద్ర, ఆ సంస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేశాడు.

ఆరుద్ర మహాకవి శ్రీశ్రీకి మేనల్లుడి వరుస. ప్రముఖ రచయిత చాగంటి సోమయాజులు (చాసో) నుంచి మార్కిస్టు భావాలను, శ్రీశ్రీ నుంచి అత్యాధునిక కవితా రీతులను తనలో ఇముడ్చుకున్నాడు. చెన్నై వచ్చిన కొత్తలో ఆరుద్ర కొంతకాలం పాటు చాలా కష్టాలు అనుభవించాడు. తినడానికి తిండిలేక పానగల్‌ పార్కులో నీళ్ళు తాగి కడుపు నింపుకోవల్సిన సందర్భాలున్నాయని స్వయంగా చెప్పుకున్నాడు. అయితే, ఇలాంటి సమస్యలేవీ ఆయన సాహిత్య సేవకు అడ్డం రాలేదు.

నెలకొకటి చొప్పున రాస్తానని ప్రతిజ్ఞ చేసి డిటెక్టివ్‌ నవలల నుంచి, మళ్ళీ అదే ప్రతిజ్ఞతో ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ సంపుటాల వరకు అనేక రచనలు చేశాడు. ఆయన స్పృశించని సాహిత్య ప్రక్రియగానీ, ఆయన అడుగుపెట్టని సాహితీ శాఖగానీ లేదు. వందలాదిగా గేయాలు, గేయ నాటికలు, కథలు, నవలలు, సాహిత్య పరిశోధక వ్యాసాలు, వ్యంగ్య వ్యాసాలు, పుస్తకాలకు పీఠికలు, పుస్తకాలపై విమర్శలు రాశాడు. సినీ గేయరచయితగానూ రాణించాడు. ఇంతటి వైవిధ్యంగల సాహిత్యోత్పత్తి చేసిన వారు అరుదు.

తెలుగు సాహిత్య ప్రపంచానికి ప్రాపంచిక దృష్టితోపాటు భౌతిక దృక్పథాన్ని పరిచయం చేసిన సాహితీ ఉద్యమం అభ్యుదయ సాహిత్యం. అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు. వివిధ రంగాల్లోనే కాక వివిధ ప్రక్రియల్లో ఆరితేరిన అరుదైన వ్యక్తి ఆయన.

‘త్వమేవాహం’, ‘సినీవాలి’, ‘కూనలమ్మ పదాలు’, ‘ఇంటింటి పద్యాలు’ వంటి అనేక కావ్యాలతో పాటు ‘వెన్నెల-వేసవి’, ‘దక్షిణవేదం’, ‘జైలుగీతాలు’ వంటి అనువాద రచనలు, ‘రాదారి బంగళా’, ‘శ్రీకృష్ణదేవరాయ’, ‘కాటమరాజు కథ’ వంటి అనేక రూపకాలతో పాటు కొన్ని కథలనూ, నవలలనూ కూడా రచించాడు.

‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ (14 సంపుటాలు) ఆరుద్ర పరిశోధనాదృష్టికి పరాకాష్ట. దీనికోసం తన మేధస్సును, ఆరోగ్యాన్ని పణంగా పెట్టాడు. ‘వేమన వేదం’, ‘మన వేమన’, ‘వ్యాస పీఠం’, ‘గురజాడ గురుపీఠం’, ‘ప్రజాకళలో ప్రగతివాదులు’ వంటి సాహిత్య విమర్శనా గ్రంథాలు వెలువరించాడు. ‘రాముడికి సీత ఏమవుతుంది’, ‘గుడిలో సెక్స్‌’ తదితర రచనలు ఆరుద్ర పరిశీలనా దృష్టికి తార్కాణాలు.

సంగీతం పైనా, నాట్యం మీద రచించిన అనేక వ్యాసాలు ఇతర కళల్లో ఆరుద్ర అభినివేశాన్ని పట్టి చూపిస్తాయి. చదరంగం (చెస్‌) పైన కొన్ని దశాబ్దాలకు పూర్వమే ఒక గ్రంథాన్ని ప్రకటించడం ఆరుద్రలోని మరో ప్రత్యేకత.

బహుముఖప్రజ్ఞతో తెలుగు సాహితీ వనాన్ని సుసంపన్నం చేసిన ఆరుద్ర, 1998 జూన్‌ 4వ తేదీన భౌతికంగా మన నుంచి దూరమయ్యాడు. తన రచనల ద్వారా ఆయన ఎప్పటికీ మనతోనే ఉండిపోతాడు.

ట్యాగ్‌లు: editorial