Toxic Movie Review: యశ్ వన్ మ్యాన్ షో…రక్తపాతం..హాహాకారం…ప్రేక్షకుడికి శిరోభారం..
Toxic Movie Review
‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా స్టార్‌డమ్ సంపాదించుకున్న యశ్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు మామూలుగా ఉండవు. అందులోనూ ‘టాక్సిక్’ ప్రచార చిత్రాలు మరింత ఆసక్తిని పెంచాయి. భారీ తారాగణం, హాలీవుడ్ స్థాయి మేకింగ్, భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి యశ్ మరోసారి ‘కేజీఎఫ్’ మ్యాజిక్‌ను రిపీట్ చేశాడా? ‘టాక్సిక్’ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది?
కథేంటి?
గంగా (నయనతార), రాయ (యశ్) అక్కాతమ్ముళ్లు. చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరమైన వీరిని గంగే పెంచి పెద్ద చేస్తుంది. ముఖ్యంగా తమ్ముడి కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. నేర ప్రపంచంలో పెరిగిన రాయ.. గోవా మాఫియా సామ్రాజ్యంలో కీలక వ్యక్తిగా ఎదుగుతాడు.
తన తమ్ముడు గోవా మాఫియాకు తిరుగులేని అధిపతిగా ఎదగాలని గంగా కోరుకుంటుంది. ఈ క్రమంలో అప్పటికే ఆ ప్రాంతాన్ని శాసిస్తున్న మాఫియా డాన్‌తో చేతులు కలుపుతుంది. రాయ కూడా ఆ గ్యాంగ్‌లో చేరి తనదైన ముద్ర వేస్తాడు. మాఫియా డాన్ కూతురు రెబెక్కా (తారా సుతారియా) రాయకు దగ్గరవుతుంది.
ఇదిలా ఉంటే రాయకు రాయల్ సర్కస్‌లో పనిచేసే నాడియా (కియారా అద్వానీ) పరిచయం అవుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ, బంధం ఏర్పడుతుంది. నాడియా గర్భవతి కావడంతో కథ మరో మలుపు తిరుగుతుంది. విషయం తెలిసిన మాఫియా డాన్ రాయపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఈ క్రమంలో చోటుచేసుకున్న పరిణామాల్లో రాయ చేతిలో మాఫియా డాన్ హతమవుతాడు.
అసలు సమస్య అక్కడి నుంచే మొదలవుతుంది. రాయ అక్క గంగా, నాడియా శత్రువుల చేతికి చిక్కుతారు. నాడియా కడుపులో ఉన్న బిడ్డను చంపేస్తామని బెదిరించి.. ఆమె చేతులతోనే గంగను హత్య చేయిస్తారు. అక్క మరణానికి కారణమైన నాడియాను రాయ క్షమిస్తాడా? ఆమెపై ప్రతీకారం తీర్చుకుంటాడా? గంగ చివరి కోరిక అయిన గోవా మాఫియా సామ్రాజ్యాన్ని రాయ సొంతం చేసుకున్నాడా? అనేదే మిగతా కథ.
సినిమా ఎలా ఉందంటే..
‘టాక్సిక్’ కథ వింటే కొత్తగా అనిపించదు. నేర ప్రపంచంలో పెరిగిన ఓ వ్యక్తి మాఫియా సామ్రాజ్యానికి అధిపతిగా ఎదగడం.. మధ్యలో కుటుంబ సెంటిమెంట్, ప్రేమ, ప్రతీకారం.. ఇవన్నీ ప్రేక్షకులకు పెద్దగా కొత్త కాదు.
‘కేజీఎఫ్’లో తల్లి సెంటిమెంట్‌ను ప్రధానంగా తీసుకుంటే.. ‘టాక్సిక్’లో అక్కాతమ్ముళ్ల అనుబంధాన్ని ముందుకు తీసుకొచ్చారు. అయితే కథలో కొత్తదనం కంటే దాన్ని తెరపై చూపించిన విధానంపైనే దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఎక్కువగా దృష్టి పెట్టారు.
ప్రథమార్థం వరకు సినిమా ఓ సాధారణ మాఫియా కథలా సాగుతుంది. యాక్షన్ సన్నివేశాలు, ఎలివేషన్లు, గ్యాంగ్ వార్‌లతో కథ ముందుకు వెళ్తుంది. అయితే ద్వితీయార్థంలో కథ అనూహ్యమైన మలుపు తీసుకుంటుంది. ముఖ్యంగా అక్క మరణం తర్వాత రాయ ఎదుర్కొనే సంఘర్షణ సినిమాకు కాస్త బలాన్ని తీసుకొస్తుంది.
అయితే కథలో భావోద్వేగాలు బలంగా పండాల్సిన చోట కూడా యాక్షన్ ముందుకొచ్చింది. నరికేసుకోవడం, కాల్చేసుకోవడం, కొట్టుకోవడం.. మధ్యలో కాస్త ప్రేమాయణం అన్నట్టుగా సినిమా సాగుతుంది. దీంతో కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాతో కాస్త దూరంగానే ఉండటం మంచిదేమో అనిపిస్తుంది.
కథ సాధారణమైనదే అయినా.. మేకింగ్ మాత్రం చాలా రిచ్‌గా ఉంది. ప్రతి సన్నివేశంలోనూ భారీగా ఖర్చు పెట్టిన విషయం స్పష్టంగా కనిపిస్తుంది. సినిమా కథ కంటే విజువల్స్ ముందుగా గుర్తుండిపోయేలా తెరకెక్కించారు.
యశ్ ఎలా చేశాడు?
యశ్ ఈ సినిమాకు ప్రధాన బలం. రాయ పాత్రలో తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అదరగొట్టాడు. యాక్షన్ సన్నివేశాల్లో అతడి పెర్ఫార్మెన్స్ అభిమానులకు మంచి ట్రీట్.
ఈ సినిమాలో యశ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. తండ్రి రాయ పాత్రకు, కొడుకు టికెట్ పాత్రకు ఎలాంటి సంబంధం ఉండదు. ముఖ్యంగా రాయ పాత్రలో యశ్ విశ్వరూపం చూపించాడు. మరో పాత్ర కోసం బరువు తగ్గి కనిపించాడు.
ద్వితీయార్థంలో రాయ ఎదుర్కొనే సంఘర్షణలో యశ్ నటన ఆకట్టుకుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో పాత్ర కంటే యశ్ స్టార్‌డమ్‌నే ఎక్కువగా చూపించినట్లు అనిపిస్తుంది.
నయనతార గంగా పాత్రలో మెప్పించింది. కథలో ఆమెది కీలకమైన పాత్ర. యాక్షన్ సన్నివేశాల్లోనూ తనదైన ముద్ర వేసింది. యశ్, నయనతార మధ్య అక్కాతమ్ముళ్ల అనుబంధం సినిమాలో భావోద్వేగాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది.
కియారా అద్వానీకి ఈసారి కాస్త భిన్నమైన పాత్ర దక్కింది. భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. తారా సుతారియా, రుక్మిణి వసంత్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో వారి పాత్రలు ఎక్కువగా గ్లామర్‌కే పరిమితమయ్యాయి.
టెక్నికల్‌గా..
కథ విషయంలో నిరాశపరిచినా.. సాంకేతికంగా మాత్రం ‘టాక్సిక్’ చాలా బాగుంది. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ నిర్మాణ విలువలు కనిపిస్తాయి.
అయితే స్క్రీన్‌ప్లే మాత్రం సగటు ప్రేక్షకుడికి అంత సులభంగా అర్థమయ్యేలా లేదు. కథనం కొంత గందరగోళంగా అనిపిస్తుంది. ఎడిటింగ్‌పై మరింత దృష్టి పెట్టాల్సింది. కొన్ని సన్నివేశాలను కాస్త తగ్గించి ఉంటే సినిమా వేగం మరింత బాగుండేది.
రవి బస్రూర్ నేపథ్య సంగీతం సినిమాకు బలంగా నిలిచింది. యాక్షన్ సన్నివేశాలకు ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మంచి హైప్ తీసుకొస్తుంది. కెమెరా వర్క్ కూడా ఆకట్టుకుంటుంది.
ప్లస్ పాయింట్స్
యశ్ నటన, స్క్రీన్ ప్రెజెన్స్
నయనతార నటన
మైనస్ పాయింట్స్
రొటీన్ కథ
గందరగోళంగా అనిపించే కథనం
నెమ్మదించే సన్నివేశాలు
ఎడిటింగ్
కుటుంబ ప్రేక్షకులకు అంతగా అనుకూలంగా లేని కంటెంట్
చివరగా..
‘టాక్సిక్’లో యశ్ ఫుల్ ఎనర్జీ చూపించాడు.. కానీ కథ మాత్రం అంతే స్థాయిలో పరుగెత్తలేదు. భారీ యాక్షన్, స్టైలిష్ మేకింగ్, యశ్ స్టార్‌డమ్ సినిమాకు బలంగా నిలిస్తే.. కథ, కథనం, ఎడిటింగ్ మాత్రం వెనక్కి లాగాయి. యాక్షన్ సినిమాలను, యశ్‌ను అభిమానించే వారికి సినిమా నచ్చే అవకాశం ఉంది. కానీ ‘కేజీఎఫ్’ స్థాయి కథను ఆశించి వెళ్తే మాత్రం నిరాశ తప్పదు.
రేటింగ్: 1.5/5
- EPFO ఉద్యోగులకు అలర్ట్.. UANలో ‘Date of Exit’ ఎందుకంత కీలకం.. తప్పు ఉంటే ఈ సమస్యలు తప్పవు..
- Toxic Movie Review: యశ్ వన్ మ్యాన్ షో…రక్తపాతం..హాహాకారం…ప్రేక్షకుడికి శిరోభారం..
- Godavari Flood Surge at Polavaram: పోలవరం వద్ద గోదావరి ఉగ్రరూపం.. 48 గేట్లు ఎత్తి వరద నీటి విడుదల
- EPFO Rules for Dual Employment: రెండు కంపెనీల్లో పనిచేస్తే PF ఎలా జమ అవుతుంది? EPFO క్లారిటీ
- ‘ఇరుముడి’ చూస్తుంటే కళ్లు చెమర్చాయి. సక్సెస్ మీట్ లో హీరో రవితేజ