Skip to content
జాతీయం వార్తలు

అయోధ్య విరాళాల వివాదంపై సిట్ దర్యాప్తు పురోగతిపై రెండు వారాల్లో నివేదిక

Prajapaksham 28 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
అయోధ్య విరాళాల వివాదంపై సిట్ దర్యాప్తు పురోగతిపై రెండు వారాల్లో నివేదిక

అయోధ్య విరాళాల వివాదంపై సిట్ దర్యాప్తు పురోగతిపై రెండు వారాల్లో నివేదిక

యు.పి ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం – ఫోరెన్సిక్ ఆడిటర్ను సభ్యుడుగా చేర్చాలని సూచన

అయోధ్య రామాలయ విరాళాల అవినీతి వివాదం కేసులో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లో దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో ఫోరెన్సిక్ ఆడిటర్‌ను కూడా సభ్యుడుగా చేర్చాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. ఎలాంటి అరమరికలు లేకుండా, రహస్యాలకు తావు లేకుండా దర్యాప్తు కొనసాగాలని కోరింది. ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తుపై సాధించిన పురోగతి గురించి రాబోయే రెండు వారాల్లో ఒక నివేదికను కూడా తమకు సమర్పించాలని ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాప్తు బృందాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, తాము ఎప్పటికప్పుడు ఈ అంశాన్ని కనిపెట్టుకునే ఉంటామని తెలియజేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోమాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం సోమవారం కేసు విచారణ సందర్భంగా పై విషయాలను స్పష్టం చేసింది.

ఐ.జి.పి కిరణ్ ఎస్ నాయకత్వంలో యు.పి ప్రభుత్వం ఈ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని జులై 25వ తేదీన నియమించింది. తగిన పరిష్కార చర్యలు తీసుకోవాలని కూడా ధర్మాసనం తెలియజేసింది. ఈ కేసులో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో ఒక డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్, ఒక సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్, ఒక అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సభ్యులుగా ఉన్నారని చెప్పారు. ధర్మాసనం చెప్పినట్లే ఒక ఫోరెన్సిక్ ఆడిటర్‌ను కూడా సిట్ దర్యాప్తు బృందంలో సభ్యుడుగా చేరుస్తామని చెప్పారు.

అయోధ్య విరాళాల అవినీతి వివాదంపై అనేకమంది కేసులు దాఖలు చేశారు. వీరిలో ఒక పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ మాట్లాడుతూ, భక్తులు తమ విరాళాలను రూ.500, రూ.1000 నోట్ల రూపంలో చెల్లించారని చెప్పారు. అంతిమంగా ఈ ధనం ట్రస్టుకు చేరుకోలేదని, ట్రస్టుకు చేరిన విరాళాల వివరాలను బాహాటత్వ పద్ధతులలో ఆన్లైన్ ద్వారా అందరికీ తెలియజేసే అవకాశం ఉందని, తద్వారా ప్రజలకు ఎంత విరాళం వచ్చిందీ, ఎందరు విరాళాలు ఇచ్చారన్న విషయాన్ని తెలుసుకోగలుగుతారని చెప్పారు. ఈ విధమైన విజ్ఞప్తి న్యాయబద్ధమైనదని, ప్రజావ్యతిరేకమైనది, చట్టవ్యతిరేకమైనది కాదని తెలియజేశారు.

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, ప్రతి విషయంపైనా దర్యాప్తు చేసేందుకు అన్ని విషయాలు తెలుసుకునే హక్కు, అవకాశం సిట్‌కు ఉందని, ఈ విషయం ఇంతటితో ముగిసిపోలేదని, ఇప్పుడు ధర్మాసనం దృష్టి అంతా ఈ దర్యాప్తు పైనే సారించిందని, ఈ దర్యాప్తు సత్వరం, నాణ్యతా ప్రమాణాలతో కొనసాగాలని పేర్కొంది. వారిని ఒక నివేదిక సమర్పించాలని కోరామని, మిగతా విషయాలన్నీ తదుపరి విచారణ దశలో నివేదికకు అనుగుణంగా నిర్ధారిస్తామని ధర్మాసనం సీనియర్ న్యాయవాదికి తెలియజేసింది.

ఈ దర్యాప్తు అంశాలను రాజకీయం చేయవద్దని కూడా ప్రధాన న్యాయమూర్తి కోరారు. న్యాయస్థానంలో రాజకీయాలకు తావులేదని, ఇది ఒక నేరం జరిగిందని దాఖలైన కేసు కాబట్టి విచారణ సక్రమంగా జరుగుతోందా? లేదా? అనే విషయాన్ని న్యాయస్థానం పరిశీలిస్తుందని హెచ్చరించారు.