Skip to content
లైఫ్ స్టైల్ వార్తలు

Atrial Fibrillation: నిశ్శబ్దంగా ప్రాణాలు తీస్తున్న ఎట్రియల్ ఫిబ్రిలేషన్.. భారత్‌లో 80 లక్షల మందికి AFib ముప్పు.. స్ట్రోక్ ప్రమాదంపై పూర్తి వివరాలు ఇవే..

Prajapaksham 27 Jul 2026 1 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
Atrial Fibrillation: నిశ్శబ్దంగా ప్రాణాలు తీస్తున్న ఎట్రియల్ ఫిబ్రిలేషన్.. భారత్‌లో 80 లక్షల మందికి AFib ముప్పు.. స్ట్రోక్ ప్రమాదంపై పూర్తి వివరాలు ఇవే..

Atrial Fibrillation: The Silent Heart Threat Affecting Millions in India

Atrial Fibrillation: కారణం లేకుండా గుండె వేగంగా కొట్టుకోవడం, ఛాతీలో దడ లేదా ఆయాసం రావడం వంటి లక్షణాలను చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇవి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనే తీవ్రమైన గుండె జబ్బుకు సంకేతాలు కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణంగా కనిపిచే ఈ గుండె లయ రుగ్మత నివారించగలిగే పక్షవాతానికి ప్రధాన కారణంగా మారుతోంది. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అధ్యయనం ప్రకారం.. మన దేశంలో దాదాపు 80 లక్షల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. వృద్ధాప్యం, జన్యుపరమైన కారణాలతో పాటు ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు పెరగడం కూడా పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మారుస్తోంది.

గుండె పై గదులైన ఏట్రియాలో అసాధారణమైన ఎలక్ట్రికల్ సంకేతాలు ఏర్పడినప్పుడు ఏట్రియల్ ఫిబ్రిలేషన్ సంభవిస్తుంది. దీనివల్ల గుండె పై గదులు ఒక క్రమపద్ధతిలో కాకుండా అస్తవ్యస్తంగా.. వేగంగా కొట్టుకుంటాయి. కొంతమందిలో గుండె దడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, త్వరగా అలసిపోవడం వంటి లక్షణాలు బయటకు కనిపిస్తాయి. కానీ చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించని సైలెంట్ ఏఎఫ్ గా ఉంటుంది. ఇటువంటి వారిలో తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే వరకు వ్యాధి ఉన్నట్టు గుర్తించలేరు. అయితే అసాధారణ గుండె లయను పసిగట్టే ఆధునిక స్మార్ట్‌వాచ్‌ల ద్వారా ఈ పరిస్థితిని ముందే తెలుసుకునే అవకాశముంది.

ఈ వ్యాధి వల్ల ఎదురయ్యే అతిపెద్ద ప్రమాదం పక్షవాతం. గుండె గదులు సరిగా సంకోచించనప్పుడు రక్తం అక్కడే నిలిచిపోయి గడ్డకట్టే అవకాశం ఉంది. ఈ రక్తం గడ్డకట్టిన ముక్కలు మెదడుకు ప్రయాణించి రక్తనాళాలను అడ్డుకుంటే ఇస్కీమిక్ స్ట్రోక్ వస్తుంది. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉన్నవారిలో పక్షవాతం వచ్చే ప్రమాదం ఐదు రెట్లు పెరుగుతుందని.. ప్రతి ఐదు పక్షవాత కేసులలో ఒకటి దీనితోనే సంబంధం కలిగి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి స్ట్రోక్స్ తీవ్రమైన శాశ్వత అంగవైకల్యానికి దారితీస్తాయి.

ఈ వ్యాధి వల్ల వచ్చే పక్షవాతాన్ని నివారించడానికి యాంటీకాగ్యులెంట్లు అనగా రక్తాన్ని పల్చబరిచే మందులు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటి వాడకం ద్వారా పక్షవాత ప్రమాదాన్ని 70 శాతం వరకు నివారించవచ్చు. కొన్ని సందర్భాల్లో గుండె లయను నియంత్రించే మందులు లేదా కాథెటర్ అబ్లేషన్ అనే ప్రక్రియ ద్వారా కూడా చికిత్స అందిస్తారు. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా దీనిని నివారించవచ్చు. రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం, ఆరోగ్యకరమైన బరువును పాటించడం, క్రమం తప్పని వ్యాయామం, ధూమపానానికి దూరంగా ఉండటం, ఆల్కహాల్ పరిమితం చేయడం వంటివి చాలా ముఖ్యం. పక్షవాతం వచ్చిన తర్వాత అయ్యే భారీ ఖర్చుతో పోలిస్తే ఏట్రియల్ ఫిబ్రిలేషన్‌ను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవడం ఎంతో మేలు.