Skip to content
జాతీయం వార్తలు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మారుతున్న పరిణామాలు..కేంద్ర మంత్రివర్గంలోకి ఫడ్నవీస్‌..?

Prajapaksham 25 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మారుతున్న పరిణామాలు..కేంద్ర మంత్రివర్గంలోకి ఫడ్నవీస్‌..?

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మారుతున్న పరిణామాలు..కేంద్ర మంత్రివర్గంలోకి ఫడ్నవీస్‌..?

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఢిల్లీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీకి చేరుకుంటున్నారు. కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండేకు కేంద్ర ప్రభుత్వంలో చోటు దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు ఫడ్నవీస్ కు కూడా కేంద్ర కేబినేట్ లో తీసుకునే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. 

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీకి బయలుదేరారు. దేశ రాజధాని ఢిల్లీలో అమిత్ షాతో ఆయన సమావేశం కానున్నారు. ఈ భేటీ కేంద్ర మంత్రివర్గ మార్పులకు సంబంధించిన ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సమావేశంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చలు జరగవచ్చు. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే పేరు కూడా పరిశీలనలో ఉందని, ఆయనకు కేంద్ర ప్రభుత్వంలో బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే, ప్రభుత్వం దీనిని ఇంకా ధృవీకరించలేదు.

సోషల్ మీడియాలో తన రాజీనామాను ప్రకటించిన ధర్మేంద్ర ప్రధాన్, అందుకు గల కారణాలను కూడా వివరించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు. విద్యా సంస్కరణల కోసం తాను పనిచేశానని ఆయన పేర్కొన్నారు. అందరికీ అందుబాటులో ఉండే విద్యా వ్యవస్థే దేశాభివృద్ధికి నిజమైన పునాది అని ఆయన విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. 

మే 3, 2026న జరిగిన నీట్-యుజి (NEET-UG) పరీక్షలో అక్రమాలపై ఫిర్యాదులు అందగానే ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించడంతో పాటు, పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే, వచ్చే ఏడాది నుండి నీట్ పరీక్షను పూర్తిగా కంప్యూటర్-ఆధారిత విధానం (CBT)లో నిర్వహిస్తామని ప్రకటించారు.

20 లక్షల మందికి పైగా విద్యార్థులకు పరీక్షను నిర్వహించడం తన అత్యంత ముఖ్యమైన బాధ్యత అని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు, విద్యార్థులు  తల్లిదండ్రుల సహకారంతో జూన్ 21, 2026న తిరిగి పరీక్ష విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. 

అలాగే తన రాజీనామాకు సంబంధించి, గత 10 రోజుల్లో జరిగిన పరిణామాలు తనను తీవ్రంగా  కలచివేశాయని ఆయన రాశారు. ఇది వ్యక్తిగత గౌరవానికి సంబంధించిన విషయం కాదని, దేశ యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు న్యాయపరమైన వివాదాల్లో లేదా రాజకీయ ఘర్షణల్లో చిక్కుకుపోవడం తనకు ఇష్టం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆలోచనా విధానంతోనే ఆయన పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.