Dharmendra Pradhan Resigns: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. బొద్దింకల దెబ్బకు దిగొచ్చిన కేంద్ర మంత్రి.. దేశ యువత ఆకాంక్షలు, భావోద్వేగాల పట్ల విశ్వాసం ఉందని తెలిపిన ప్రధాన్..
Dharmendra Pradhan Resigns: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. బొద్దింకల దెబ్బకు దిగొచ్చిన కేంద్రం మంత్రి.. దేశ యువత ఆకాంక్షలు, భావోద్వేగాల పట్ల విశ్వాసం ఉందని తెలిపిన ప్రధాన్..
Dharmendra Pradhan Resigns: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ పేపర్ లీక్, పరీక్షా అవకతవకల వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామాను డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నెల రోజులుగా చేపట్టిన భారీ ఆందోళనలకు లొంగి, శనివారం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపినట్లు తెలిపారు. కాగా కేంద్రంతో బొద్దింకల జనతా పార్టీ -సీజేపీ మూడో విడత చర్చలకు సరిగ్గా కొన్ని గంటల ముందు ప్రధాన్ తన సామాజిక మాధ్యమం ‘X’ (ట్విట్టర్) ద్వారా అధికారికంగా ప్రకటించారు.
గత నెల రోజులకు పైగా ఢిల్లీలో శిబిరం ఏర్పాటు చేసుకుని పోరాడుతున్న నిరసనకారుల ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే అని చెప్పవచ్చు. ఈ విషయంలో ప్రభుత్వం- సీజేపీ మధ్య చర్చలు తీవ్ర ప్రతిష్టంభనకు గురయ్యాయి. మంత్రిని తొలగించకపోతే ఇకపై ఎటువంటి చర్చలకు వచ్చేది లేదని శనివారం ఉదయం సీజేపీ స్పష్టం చేయడంతో కేంద్రంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. శుక్రవారమే ప్రభుత్వం ఆందోళనకారులపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోమని, లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చింది. తాజాగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో నిరసనకారులు పరిచిన ప్రధాన డిమాండ్లన్నీ నెరవేరినట్లయింది.
తన రాజీనామాను ప్రకటిస్తూ ప్రధాన్ భావోద్వేగంగా స్పందించారు. దేశ యువత ఆకాంక్షలు, భావోద్వేగాల పట్ల నాకు ప్రగాఢ గౌరవం ఉంది. వారి కలలను సాకారం చేయడమే మన రాజకీయ, సామాజిక జీవితానికి నైతిక సంకల్పం అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ దార్శనిక నాయకత్వంలో దేశానికి సేవ చేసే అవకాశం దక్కినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరిస్థితిని.. దేశ వ్యతిరేక శక్తులు దుర్వినియోగం చేయకూడదని, దేశ ఐక్యత దెబ్బతినకుండా ఉండేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని.. విద్యార్థులు చట్టపరమైన చిక్కుల్లో పడకుండా తమ సమయాన్ని చదువుపైనే కేటాయించాలని ఆయన ఆకాంక్షించారు.
మంత్రి రాజీనామా వార్త తెలిసిన వెంటనే జంతర్ మంతర్ వద్ద ఉన్న నిరసన ప్రాంతం తీవ్ర సంబరాలతో హోరెత్తింది. విద్యార్థులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ పరిణామంపై స్పందించిన సీజేపీ విద్యార్థి శక్తి వర్ధిల్లాలి అని పోస్ట్ చేసింది. మేము అనుకున్నది సాధించాం. ఈ ప్రభుత్వంలో ఎవరూ రాజీనామా చేయరనే నానుడిని తిరగరాశాం అని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే వ్యాఖ్యానించారు. కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా అనేక నగరాలకు వ్యాపించిన ఈ విద్యార్థి ఉద్యమానికి ప్రతిపక్షాలు మద్దతు తెలపడంతో ఇది రాజకీయంగా పెద్ద ఎత్తున ఒత్తిడి పెంచింది. చివరికి విద్యార్థుల నిరసనకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గక తప్పలేదు.