ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వ సబ్సిడీ.. తక్కువ ధరకే బండిని కొనేయవచ్చు… PM E-DRIVE స్కీమ్ పూర్తి వివరాలు తెలుసుకోండి..
ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వ సబ్సిడీ.. తక్కువ ధరకే బండిని కొనేయవచ్చు... PM E-DRIVE స్కీమ్ పూర్తి వివరాలు తెలుసుకోండి..
PM E-DRIVE Scheme: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పీఎం ఇ-డ్రైవ్ పథకం ప్రవేశపెట్టిన సంగతి విదితమే. ఈ సబ్సిడీ ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేసింది. గతంలో ఉన్న విధానాల కంటే భిన్నంగా.. ఇందులో ఎలాంటి జాప్యం లేకుండా పారదర్శకంగా సబ్సిడీని అందించేందుకు ఆధార్ ఆధారిత ఈ-ఓచర్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు.
మీరు గుర్తింపు పొందిన ఈవీ డీలర్ వద్ద వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలోనే ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. వాహన విక్రయం ఖరారైన వెంటనే.. పీఎం ఇ-డ్రైవ్ అధికారిక పోర్టల్ ద్వారా కొనుగోలుదారుడి పేరు మీద ఒక డిజిటల్ ఈ-ఓచర్ తయారవుతుంది. ఈ ఓచర్ జనరేట్ అయిన మరుక్షణమే.. కొనుగోలుదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక SMS లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా ఈ-ఓచర్‌ను స్మార్ట్‌ఫోన్‌లోకి సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇలా డౌన్లోడ్ చేసిన ఓచర్‌ను యాక్టివేట్ చేయడానికి కొనుగోలుదారుడు తన ఆధార్ నంబర్, దానికి లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ఆధారంగా డిజిటల్ సంతకం చేయాల్సి ఉంటుంది. కొనుగోలుదారుడి ధృవీకరణ పూర్తయిన తర్వాత.. సదరు డీలర్ కూడా ఆ ఓచర్‌పై డిజిటల్ సంతకం చేస్తారు. ఆపై వాహనానికి సంబంధించిన చాసిస్ నంబర్, వెహికల్ ఫోటోలను జతచేసి ఈ-ఓచర్‌ను పీఎం ఇ-డ్రైవ్ పోర్టల్‌లో డీలర్ అప్లోడ్ చేస్తారు.
ప్రభుత్వ అధికారులు ఈ వివరాలను ఆన్లైన్లో తనిఖీ చేసి.. అంతా సక్రమంగా ఉందని నిర్ధారించుకున్నాక సబ్సిడీ సొమ్మును నేరుగా డీలర్ ఖాతాకు బదిలీ చేస్తారు. దీనివల్ల కస్టమర్ కొనుగోలు చేసేటప్పుడే.. సబ్సిడీ మినహాయింపు తర్వాత.. తగ్గిన ధరకే వాహనాన్ని పొందే వీలుంటుంది.
ఈ పథకం ప్రధానంగా సాధారణ ప్రజలు, రవాణా రంగం వాడే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, త్రీ-వీలర్లు, ఈ-రిక్షాలు, అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులు, ట్రక్కులకు మాత్రమే సబ్సిడీ రాయితీలను అందిస్తుంది. అయితే వ్యక్తిగత ఉపయోగం కోసం కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ కార్లకు మాత్రం ఈ పథకం కింద సబ్సిడీ మినహాయింపులు వర్తించవు. ఈ రాయితీని పొందాలనుకునే కొనుగోలుదారులు తాము ఎంచుకునే వాహనం పీఎం ఇ-డ్రైవ్ పథకం పరిధిలో రిజిస్టర్ అయి ఉందో లేదో ముందే చూసుకోవాలి.
అలాగే సబ్సిడీ ప్రక్రియ సజావుగా సాగడానికి కస్టమర్ వద్ద ఖచ్చితంగా యాక్టివ్‌గా ఉన్న ఆధార్ కార్డ్, దానికి లింక్ అయిన మొబైల్ నంబర్ అందుబాటులో ఉండటం తప్పనిసరి. ఈ ఆధార్ ఓటీపీ ఆధారిత డిజిటల్ విధానం ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా కస్టమర్లు సబ్సిడీ ప్రయోజనాన్ని నేరుగా, పారదర్శకంగా పొందేందుకు కేంద్ర ప్రభుత్వం చక్కటి అవకాశం కల్పించింది.