UCC Bill Debate: ఒక్క పెళ్లి చేసుకున్న వారే మధ్యప్రదేశ్‌లో ఉంటారు.. తలాక్ మూడు సార్లు చెబితే ఇక జైలుకే.. యూసీసీ బిల్లుపై సీఎం మోహన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు..
UCC Bill Debate: ఒక్క పెళ్లి చేసుకున్న వారే మధ్యప్రదేశ్‌లో ఉంటారు.. తలాక్ మూడు సార్లు చెబితే ఇక జైలుకే.. యూసీసీ బిల్లుపై సీఎం మోహన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు..
UCC Bill Debate: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్.. ఉమ్మడి పౌర స్మృతి (UCC) బిల్లుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నివసించాలంటే కేవలం ఒక్క వివాహం మాత్రమే చేసుకుని ఉండాలనే నిబంధనను తీసుకురాబోతున్నట్లు స్పష్టం సీఎం చేశారు. రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోనే తమ ప్రభుత్వం యూసీసీ బిల్లును ప్రవేశపెట్టనుందని.. ఆ ప్రతిపాదిత చట్టం ప్రకారం ఒకే వివాహం చేసుకున్న వ్యక్తికి మాత్రమే మధ్యప్రదేశ్‌లో నివసించే చట్టపరమైన హక్కు ఉంటుందని ఆయన నొక్కి చెప్పారు.
కట్నీ జిల్లాలో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. దేశంలో అందరికీ ఒకే రకమైన చట్టం ఉండాలనే ఉద్దేశంతోనే ఈ బిల్లును తెస్తున్నట్లు ప్రకటించారు. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జెండా ఉన్నప్పుడు హిందువులకు, ముస్లింలకు వేర్వేరు చట్టాలు ఎందుకు ఉండాలని ఆయన ప్రశ్నించారు. రాముడికి ఒకే వివాహం చేసుకునే అవకాశం ఉన్నప్పుడు, రహీమ్‌కు రెండు, మూడు లేదా నాలుగు వివాహాలు ఎందుకు ఉండాలని.. ముస్లిం సోదరీమణుల హక్కులను రక్షించాల్సిన బాధ్యత ఉందంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ప్రతిపాదిత చట్టం ద్వారా రాష్ట్రంలో ఏకరీతి న్యాయ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని.. తక్షణ ట్రిపుల్ తలాక్ పద్ధతికి ఇందులో ఎలాంటి స్థానం ఉండదని సీఎం మోహన్ యాదవ్ స్పష్టం చేశారు. ఇకపై ఎవరైనా తలాక్, తలాక్, తలాక్’ అని చెబితే వారిని నేరుగా జైలుకు పంపుతామని, ట్రిపుల్ తలాక్ యుగం ఎప్పుడో ముగిసిపోయిందని ఆయన హెచ్చరించారు.
భారతదేశంలో ఉమ్మడి పౌర స్మృతిని (UCC) విజయవంతంగా చట్టబద్ధం చేసి అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఇప్పటికే ఉత్తరాఖండ్ రికార్డు సృష్టించింది. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో 2024 లోనే ఈ బిల్లు పాస్ అవ్వగా.. 2025 జనవరి 27 నుండి అక్కడ చట్టం అధికారికంగా అమలులోకి వచ్చింది. వివాహాలు, విడాకులు, ఆస్తి హక్కులు, సహజీవనం వంటి కీలక అంశాలపై అక్కడ కులమతాలతో సంబంధం లేకుండా పౌరులందరికీ ఒకే చట్టం వర్తిస్తోంది. ఇప్పుడు అదే బాటలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది.