Skip to content
ఎడిట్ పేజి వార్తలు

సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష కేంద్రానికి పట్టదా?

Prajapaksham 17 Jul 2026 0 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష కేంద్రానికి పట్టదా?

సోనమ్‌ వాంగ్‌చుక్‌ భారతదేశం గర్వించదగిన వ్యక్తుల్లో ఒకరు. జమ్మూ కశ్మీర్‌లోని లద్ధాఖ్‌ ప్రాంతంలో సింధు నది తీరంలోని ఆల్చి అనే మారుమూల గ్రామంలో జన్మించాడు. తొమ్మిదేళ్ల వరకు బడి ముఖం చూసి ఎరగడు. అప్పటి వరకు అమ్మే గురువై ప్రాథమిక బోధన చేసింది.

రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తండ్రి తనతో పాటు కుటుంబాన్ని శ్రీనగర్‌కు తీసుకెళ్లారు. అక్కడ తొమ్మిదవ ఏట మొదటిసారిగా పాఠశాల ముఖం చూశాడు సోనమ్‌ వాంగ్‌చుక్‌. అప్పటి వరకు అమ్మ, ప్రకృతి ఒడిలో లోకజ్ఞానం నేర్చుకున్న ఆయనకు తొమ్మిదవ ఏట కొత్త బడిలో, కొత్త భాషలో విద్యాబోధన అంతా అయోమయంగా అనిపించింది.

టీచర్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోవడంతో సోనమ్‌పై చదువురాదనే ముద్ర పడింది. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లిపోయి కేంద్రీయ విద్యాలయంలో చేరిన తరువాత జీవితంలో కొంత మార్పు వచ్చింది. తరువాత శ్రీనగర్‌లోని ఆర్‌ఈసీలో మెకానికల్‌ ఇంజనీర్‌గా పట్టభద్రుడయ్యారు.

ఎర్తెన్‌ ఆర్కిటెక్చర్‌ (మట్టితో కట్టడాలు) అంశంలో ఉన్నత విద్యాభ్యాసానికి ఫ్రాన్స్‌కు వెళ్లాడు. పాఠశాల విద్యలో తనకు కలిగిన చేదు అనుభవం దృష్టిలో పెట్టుకొని తిరిగి వచ్చాక సోనమ్‌ వాంగ్‌చుక్‌ ప్రత్యామ్నాయ విద్యా బోధనకు లేహ్‌లో శ్రీకారం చుట్టారు.

సాధారణ, తక్కువ వ్యయంతో సంప్రదాయ పద్ధతుల్లో విద్యార్థులకు ప్రకృతిలోనే బోధించే పద్ధతికి శ్రీకారం చుట్టారు. దీనికి స్టూడెంట్స్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ కల్చరల్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ లద్ధాఖ్‌ (సెక్మోల్‌) అనే పేరు పెట్టారు.

ఈ ప్రత్యామ్నాయ విద్యా విధానంతో వచ్చిన సత్ఫలితాలు అంతర్జాతీయ గుర్తింపు, ప్రశంసలు పొందాయి. అత్యంత ప్రజాదరణ పొందిన ‘త్రీ ఇడియెట్స్‌’ హిందీ సినిమాలో అందరినీ ఆకట్టుకున్న ప్రముఖ నటుడు అమీర్‌ ఖాన్‌ పాత్రకు ఆయనే స్ఫూర్తి.

అటువంటి సోనమ్‌ వాంగ్‌చుక్‌ వైద్య విద్య జాతీయ ప్రవేశ పరీక్షా పత్రం లీక్‌ అవడం, పలువురు ఆత్మహత్య చేసుకోవడంపై కలత చెంది చేపట్టిన నిరవధిక దీక్ష గురువారానికి 19వ రోజుకు చేరుకుంది.

అనేకమార్లు పేపర్లు లీకైనప్పటికీ, ఇటీవల సీబీఎస్‌ఈ పరీక్షా ఫలితాలలో గందరగోళం, ఒకరి మార్క్‌ షీటుకు బదులు మరొకరి షీటు ఆధారంగా మార్కులు వేయడం, వెంటనే నీట్‌ పరీక్షా పత్రం లీక్‌ అవడం వంటివి దేశవ్యాప్తంగా భావి తరాలను తీవ్ర నిస్పృహలోకి నెట్టేసింది.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ మిశ్రా నిరుద్యోగ యువతను కాక్రోచ్‌ (బొద్దింక)లతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరిగి, అభిజీత్‌ దిప్కే అనే యువకుడు వ్యంగ్యంగా కాక్రోచ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (సీజేపీ) అనే పేరుతో సోషల్‌ మీడియాలో అకౌంట్‌ తెరిచారు.

అంతే, కేంద్ర ప్రభుత్వ విధానాలపై లోలోన రగులుతున్న యువత ఆగ్రహం కట్టలు తెగించుకుంది. రెండు రోజుల్లోనే సీజేపీ సోషల్‌ మీడియాకు 2 కోట్ల మందికి పైగా ఫాలోయర్లు చేరారు.

కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా కోరుతూ ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద సీజేపీ మొదటి ప్రత్యర్థి ఉద్యమంగా జూన్‌ 6న చేసిన ధర్నాకు అనేక ఆంక్షలు దాటుకుని భారీగా యువత తరలి వచ్చారు. అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదు.

బాధ్యత స్వీకరించేందుకు ధర్మేంద్ర ప్రధాన్‌ ముందుకు రాకుండా, నిస్సిగ్గుగా పదవిలో కొనసాగుతున్నారు. పైగా వారు వైరస్‌ లాంటి వాళ్లని, వారి వెనుక విదేశీ శక్తులు ఉన్నాయని, తుక్డే తుక్డే గ్యాంగ్‌ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ ఉద్యమకారులపై తీవ్ర ఆరోపణలే చేశారు.

నిజానికి సీజేపీ ఉద్యమంలో మెజారిటీ నిరసనకారులకు ఉద్యమాలు కొత్తే. ముఖ్యంగా పెద్ద ఎత్తున పాల్గొంటున్న జెన్‌ జీ తరానికి ఇలాంటి ఉద్యమం జీవితంలోనే మొదటిసారి.

ఇది మింగుడు పడని కేంద్ర ప్రభుత్వం సీజేపీ ఉద్యమాన్ని అణిచివేసేందుకు అనేక కుటిల ప్రయత్నాలు చేసినా ఉద్యమం ఆగలేదు. వారు అర్బన్‌ నక్సలైట్‌లు అని, వారు ఉగ్రవాదులు అని, జాతి వ్యతిరేకులు అని, కమ్యూనిస్టులు అని సంఘ్‌ పరివారం, వారి వందిమాగధ సోషల్‌ మీడియా సేనలు ఆడిపోసుకున్నాయి.

గతంలో ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు నిరసన తెలిపిన రైతులను ఎన్ని మాటలు అన్నారో, అన్నిటినీ సీజేపీ ఉద్యమకారులను అన్నారు. అనేక నగరాలలో సైతం సీజేపీ నిరసనలు విజయవంతమయ్యాయి.

సీజేపీ ఉద్యమానికి కొనసాగింపుగా సోనమ్‌ వాంగ్‌చుక్‌ జూన్‌ 25 నుంచి తలపెట్టిన నిరవధిక దీక్ష మరో మలుపు. తాము ఏ పార్టీకి అనుబంధమో, సభ్యులమో కాదని సీజేపీ నిర్వాహకులు చేసిన ప్రకటనలను గౌరవిస్తూ విపక్ష పార్టీలు సంఘీభావాన్ని తెలియజేస్తూ వస్తున్నాయి.

ఎఐఎస్‌ఎఫ్‌, ఐసా, ఎస్‌ఎఫ్‌ఐ తదితర వామపక్ష విద్యార్థి సంఘాలు జంతర్‌ మంతర్‌ వద్ద రాత్రింబవళ్లు ఉంటున్న ఉద్యమకారులకు అండగా ఉంటున్నారే తప్ప ప్రత్యక్ష భాగస్వాములుగా లేరు.

ఉద్యమంలో పాల్గొనే వారి సౌలభ్యం కోసం ఎఐఎస్‌ఎఫ్‌ ఏర్పాటు చేసిన మినీ ‘లైబ్రరీ’ స్టాల్‌ను తొలగించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయినప్పటికీ, ఎదుర్కొని దానిని కొనసాగిస్తున్నారు.

అయితే, వాంగ్‌చుక్‌ దీక్ష చేపట్టి 20 రోజులు కావొస్తోంది. ఆయన సుమారు 10 కిలోల బరువు తగ్గి, బలహీనమయ్యారు. ఇవేమి పట్టించుకోకుండా సోనమ్‌ వాంగ్‌చుక్‌ తదేక దీక్షతో దీక్షను కొనసాగిస్తున్నారు.

క్రమక్రమంగా ఆయనను కలుస్తున్న సామాన్యులు, విపక్ష నాయకుల సంఖ్య పెరుగుతోంది. అయినా, కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. ఒక ప్రముఖ వ్యక్తి దేశ రాజధాని నడిబొడ్డున దాదాపు మూడు వారాలుగా నిరవధిక దీక్ష చేస్తుంటే, స్పందించని ప్రభుత్వాన్ని ఏమనాలి?

ప్రభుత్వ నిరంకుశ తీరుకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసం, మానవత్వం ఉన్న ప్రతి పౌరుడిలో కదలిక తీసుకువస్తోంది. వాంగ్‌చుక్‌కు అంతకంతకూ మద్దతు పుంజుకుంటోంది.

ప్రధాని మోదీని తొలినాళ్లలో రాజకీయాలలో ప్రోత్సహించిన గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌ సిన్హ్‌ వాఘేలా సైతం జంతర్‌ మంతర్‌కు వచ్చి సంఘీభావాన్ని ప్రకటించారు. వామపక్ష నేతలు డి. రాజా, ఎం.ఎ. బేబీ, దీపాంకర్‌ భట్టాచార్య, టీఎంసీ, ఆర్‌జేడీ, ఎస్‌పీ ముఖ్యనేతలు కూడా సోనమ్‌కు మద్దతు పలికారు.

తాజాగా ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం జంతర్‌ మంతర్‌కు వచ్చి సంఘీభావం ప్రకటించి, సోనమ్‌ వాంగ్‌చుక్‌ను కేంద్ర విద్యా మంత్రిని చేయాలనే డిమాండ్‌ తెరమీదకు తీసుకువచ్చారు.

వినూత్న విద్యా బోధన ద్వారా మారుమూల ప్రాంతంలో అద్భుతాలు సృష్టించిన సోనమ్‌ వాంగ్‌చుక్‌ అందుకు అర్హుడే. ఆయన పట్టుదల, చిత్తశుద్ధి చూసిన సామాన్యుల నుంచి మాన్యుల వరకు సీజేపీ పిలుపునిచ్చిన జులై 26న ‘చలో పార్లమెంట్‌’కు మద్దతు పలుకుతుండటం ప్రజాస్వామ్యంపై ప్రజల్లో సడలని విశ్వాసాన్ని సూచిస్తోంది.

ట్యాగ్‌లు: editorial Sonam Wangchuk