Shabad Six-Murder Case: షాబాద్ హత్యాకాండ.. ముగిసిన నరహంతకుడి అధ్యాయం.. పెంజర్ల వెంచర్లో నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య
Shabad Six-Murder Case: షాబాద్ హత్యాకాండలో ముగిసిన నరహంతకుడి అధ్యాయం.. పెంజర్ల వెంచర్లో నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య
Shabad Six-Murder Case: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన షాబాద్ ఆరుగురి హత్యల కేసులో ప్రధాన నిందితుడు, నరహంతకుడు పార్వతి రాజ్‌కుమార్ (29) మృతిచెందాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలోని ఒక వెంచర్లో అతడి మృతదేహం లభ్యమైంది. స్థానికులు మృతదేహాన్ని గమనించి డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి.. అది పరారీలో ఉన్న నిందితుడు రాజ్‌కుమార్‌దేనని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహం పక్కనే పురుగుల మందు (పాయిజన్) బాటిల్ లభించింది. దీంతో పోలీసుల గాలింపునకు భయపడి నిందితుడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పలువురు భావిస్తున్నారు.
మైనర్ బాలికను ప్రేమ, పెళ్లి పేరుతో వేధించినందుకు తనపై పోక్సో కేసు నమోదు చేసి జైలుకు పంపారనే కక్షతో రాజ్‌కుమార్ ఉన్మాదిగా మారాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన అతడు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కేవలం అరగంట వ్యవధిలో మూడు వేర్వేరు ప్రాంతాలలో ఆరుగురిని కిరాతకంగా నరికి చంపాడు. తొలుత బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమె తల్లి, నానమ్మల గొంతు కోసి కడతేర్చాడు. ఆపై మైనర్ బాలికను బలవంతంగా కారులో ఎత్తుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో గొంతుకోసి హతమార్చాడు. ఆ తర్వాత తన ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న కన్న భార్య, ఇద్దరు ముక్కుపచ్చలారని చిన్నారులను సైతం గొంతుకోసి కిరాతకంగా అంతమొందించాడు.
ఈ ఘోర మారణ కాండ తర్వాత నిందితుడు కారులో పరారయ్యాడు. నందిగామ సమీపంలో అతడు వాడిన కారును వదిలిపెట్టి రైల్వే స్టేషన్ వైపు వెళ్లినట్లు ఆధారాలు లభించడంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. నిందితుడిని పట్టుకోవడానికి సైబరాబాద్ పోలీసులు ఏకంగా 14 ప్రత్యేక బృందాలను (Special Teams) రంగంలోకి దించారు. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి పొడవునా ఉన్న హోటళ్లు, దాబాలు, లాడ్జీలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల సీసీటీవీ (CCTV) ఫుటేజీలను పరిశీలిస్తూ.. నిందితుడి బంధువులను విచారిస్తున్న క్రమంలోనే పెంజర్ల శివారులో రాజ్‌కుమార్ శవమై కనిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. నిందితుడి ఆత్మహత్యతో ఈ దారుణ కాండలో ప్రధాన నిందితుడి అధ్యాయం ముగిసినట్లయింది.