Hyderabad Crime: జైలు నుంచి విడుదలై కిరాతకం.. ఆరుమందిని అత్యంత దారుణంగా.. దైవాలగూడలో మారణహోమం.. ఎందుకింత కిరాతకానికి పాల్పడ్డాడు..
Crime Rep Image
Hyderabad Crime: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో చోటుచేసుకున్న ఘోర సామూహిక హత్యలు తెలంగాణ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. పోక్సో (POCSO) కేసులో బెయిల్‌పై విడుదలైన రాజ్‌కుమార్ అనే వ్యక్తి తీవ్ర కక్షతో.. ప్రతీకారంతో రగిలిపోయి కేవలం గంటల వ్యవధిలోనే ఆరుగురిని అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. హత్యలు జరిగిన తీరు, దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న వివరాలు వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్నారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో నిందితుడు రాజ్‌కుమార్ కారులో 17 ఏళ్ల బాధిత బాలిక ఇంటికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు అడ్డుకుంటున్నా వినకుండా, బాలికను బలవంతంగా కారులో ఎక్కించుకుని మూడు కిలోమీటర్ల దూరంలోని గ్రామ శివారు చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసిన అనంతరం గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఆ వెంటనే మళ్లీ బాలిక ఇంటికి వచ్చి, ఇంట్లో ఉన్న మరో ఇద్దరు మహిళలపై కత్తితో దాడి చేసి హతమార్చాడు.
అక్కడితో ఆగని నిందితుడు నేరుగా తన సొంత ఇంటికి వెళ్లాడు. వెళ్లే ముందు భార్య సరితకు ఫోన్ చేసి పిల్లలను చూడాలని ఉందని చెప్పడంతో, ఆమె ఎలాంటి అనుమానం లేకుండా తలుపు తీసింది. ఇంట్లోకి ప్రవేశించగానే భార్యపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ప్రాణాలు దక్కించుకోవడానికి ఆమె బయటకు పరుగెత్తినా వెంబడించి మరీ చంపేశాడు. ఆ తర్వాత నిద్రపోతున్న తన మూడేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడిని కూడా వదలకుండా గొంతులు కోసి బెడ్‌పైనే రక్తపు మడుగులో హతమార్చాడు. పోక్సో కేసు వల్ల ఏడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను ద్వేషించడం.. పిల్లలను దగ్గరకు రానివ్వకపోవచ్చనే కోపంతోనే వారిని చంపినట్లు తెలుస్తోంది. బాధితులు ఎవరూ సహాయం కోసం అరిచే అవకాశం కూడా ఇవ్వకుండా అత్యంత వేగంగా ఈ మారణహోమానికి పాల్పడ్డాడు.
నిందితుడు రాజ్‌కుమార్ ఏడేళ్ల క్రితం సరితను ప్రేమవివాహం చేసుకున్నప్పటికీ.. దైవాలగూడకే చెందిన ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న బాలికను ప్రేమ, పెళ్లి పేరిట వేధిస్తూ వచ్చాడు. భయపడిన కుటుంబ సభ్యులు ఆమెను కాలేజీకి పంపడం మానేశారు. వేధింపులు ఎక్కువవడంతో మే 16న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రాజ్‌కుమార్‌పై పోక్సో కేసు నమోదైంది. మే 26న అతడిని రిమాండ్‌కు తరలించారు. అయితే, పోలీసులు తక్కువ శిక్ష పడే సెక్షన్లు పెట్టడం వల్ల కేవలం రూ. 20 వేల పూచీకత్తుతో నిందితుడు బెయిల్‌పై బయటకు రావడం.. రాగానే ఈ దారుణానికి ఒడిగట్టడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ ఇతనిపై ఒక భూవివాదం కేసు ఉంది.
ఈ ఘోర ఉదంతంపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి స్పందిస్తూ.. ఆరు హత్యలు చేసిన అనంతరం రాజ్‌కుమార్ తన తండ్రికి ఫోన్ చేసి.. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి మొబైల్ స్విచ్చాఫ్ చేసుకున్నాడని తెలిపారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఈ ఘాతుకానికి రాజ్‌కుమార్ ఒక్కడే పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. నిందితుడి మానసిక స్థితిపై కూడా విచారణ జరుపుతున్నామని, బాధిత బాలిక తండ్రి గతంలో మరణించిన ఘటనలో ఇతని పాత్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేసినా ఇప్పటివరకు ఆధారాలు లభించలేదన్నారు. భార్య, పిల్లలను ఎందుకు చంపాడనే దానిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదన్నారు.
పోక్సో కేసులో జైలుకు వెళ్లిన కక్షతోనే నిందితుడు ఈ మారణహోమానికి తెగబడ్డాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుడు వాడిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, సరిహద్దు ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.