Bullet Train Corridors: హైదరాబాద్ నుంచి విజయవాడకు గంటలో..చెన్నైకి రెండు గంటల్లో.. మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రకటించిన కేంద్ర మంత్రి
Bullet Train Corridors: హైదరాబాద్ నుంచి విజయవాడకు గంటలో..చెన్నైకి రెండు గంటల్లో.. మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రకటించిన కేంద్ర మంత్రి
Bullet Train Corridors: దేశవ్యాప్తంగా మోదీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న ఏడు బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టులలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి మూడు కారిడార్లు దక్కాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం హైదరాబాద్ వేదికగా ఈ ప్రకటన చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధ, చొరవ వల్లే తెలంగాణ రాష్ట్రానికి ఈ భారీ హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు వచ్చాయని.. రాబోయే రోజుల్లో తెలంగాణ దేశంలోనే ఒక పెద్ద బుల్లెట్ ట్రెయిన్ హబ్ గా అవతరించబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రైల్వే రవాణా రంగంలో ఈ ప్రాజెక్టులు ఒక విప్లవాత్మక మైలురాయిగా నిలిచిపోతాయన్నారు.
ఈ హైస్పీడ్ బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగరవాసులకు వివిధ మెట్రో నగరాలకు ప్రయాణించే సమయం భారీగా తగ్గిపోనుంది. రైల్వే మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం ప్రయాణ వేళలు ఈ క్రింది విధంగా ఉండనున్నాయి:
హైదరాబాద్ టు విజయవాడ (అమరావతి): కేవలం 1 గంట 10 నిమిషాలు (70 నిమిషాలు)
హైదరాబాద్ టు ముంబై: కేవలం 2 గంటల 20 నిమిషాలు
హైదరాబాద్ టు చెన్నై: కేవలం 2 గంటల 20 నిమిషాలు
ఇదే సమయంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టుల క్రెడిట్ కోసం కొందరు రాజకీయ నేతలు పాకులాడుతున్నారంటూ విపక్షాలపై మంత్రి అశ్వినీ వైష్ణవ్ మండిపడ్డారు. ఈ ప్రాజెక్టుల పూర్తి ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని స్పష్టం చేశారు. గత యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే బడ్జెట్లో కేవలం రూ. 800 కోట్లు మాత్రమే కేటాయిస్తే.. తమ ఎన్డీఏ ప్రభుత్వం ఒక్క తెలంగాణకే ఏకంగా రూ. 5000 కోట్ల రైల్వే నిధులను ఇచ్చిందని గుర్తుచేశారు. కేంద్రం కురిపిస్తున్న ఈ నిధుల వరద వల్లే రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయని.. బేగంపేట, హైటెక్ సిటీ, వరంగల్, కరీంనగర్ వంటి స్టేషన్ల ఆధునికీకరణ పనులు వేగంగా పూర్తవుతున్నాయని ఆయన వివరించారు.