Skip to content
తెలంగాణ వార్తలు

Two States, One Vote? ముందు మా రాష్ట్రం ఏదో చెప్పండి.. రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగిన 14 గ్రామాల ప్రజల ఆందోళన.. SIR ఫారాలు తిరస్కరించిన ఓటర్లు

Prajapaksham 10 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Two States, One Vote? ముందు మా రాష్ట్రం ఏదో చెప్పండి.. రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగిన 14 గ్రామాల ప్రజల ఆందోళన.. SIR ఫారాలు తిరస్కరించిన ఓటర్లు

Two States, One Vote? ముందు మా రాష్ట్రం ఏదో చెప్పండి.. రెండు రాష్ట్రాల మధ్య చిక్కుకున్న 14 గ్రామాలు.. SIR ఫారాలు తీసుకోవడంపై నిరసన

Two States, One Vote? దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ ఊపందుకుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా SIR పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథయ్యంలో సరిహద్దులో కొన్ని గ్రామాలు మా రాష్ట్రం ఏదో చెప్పాలంటూ SIR ఫారాలు తీసుకోవడంపై నిరసన వ్యక్తం చేశాయి. ఇంతకీ ఎక్కడ ఆ గ్రామాలు.. ఎందుకు నిరసన వ్యక్తం చేశాయి ఓ సారి చూద్దాం..

తెలంగాణ, మహారాష్ట్రల సరిహద్దుల్లోని పద్నాలుగు గ్రామాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (SIR) ప్రక్రియ తీవ్ర అడ్డంకులను ఎదుర్కొంటోంది. తాము ఏ రాష్ట్రానికి చెందుతామో ప్రభుత్వాలు ముందుగా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. పరాందోలి, ముకద్దంగూడ గ్రామస్థులు జనాభా గణన పత్రాలను స్వీకరించడానికి నిరాకరిస్తున్నారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి తహసీల్, మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా జీవతి తహసీల్ సరిహద్దుల్లోని ఎనభై చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ గ్రామాల ప్రాదేశిక వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.

ఈ గ్రామాల్లోని సుమారు మూడున్నర వేల మంది ఓటర్లు 1956 భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ నాటి నుండి రెండు రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఓటు వేస్తున్నారు. దశాబ్దాలుగా ఇద్దరు సర్పంచులు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను ఎన్నుకుంటున్న ఇక్కడి ప్రజలకు రెండు రాష్ట్రాలకు చెందిన ఓటరు ఐడీలు, ఆధార్, రేషన్ కార్డులు ఉన్నాయి. కొన్ని గ్రామాలకు రెండు రాష్ట్రాల లైన్ల నుండి విద్యుత్ సరఫరా అవుతుండగా, విడివిడిగా రేషన్ దుకాణాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, తెలుగు, మరాఠీ భాషల పాఠశాలలు కూడా నడుస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం చంద్రాపూర్ వైపు నుండి రోడ్ల సౌకర్యం కల్పించగా.. తెలంగాణ వైపు రహదారులు ఇప్పటికీ అధ్వాన్నంగానే ఉన్నాయి.

ఈ వివాదానికి సుదీర్ఘమైన చారిత్రక నేపథ్యం ఉంది. 1956 వరకు నిజాం పాలనలో ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ఈ గ్రామాలు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత సాంస్కృతిక సంబంధాల రీత్యా మహారాష్ట్రకు, భౌగోళికంగా ఉమ్మడి ఏపీకి దగ్గరగా మారాయి. 1960లో మహారాష్ట్ర ఏర్పడిన తర్వాత వీటిని చంద్రాపూర్ జిల్లాలో చేర్చినప్పటికీ, 1978లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సరిహద్దు కమిటీ నివేదిక ఆధారంగా వీటిపై హక్కు ప్రకటించింది. సమస్య పరిష్కారానికి 1983లో ఏర్పాటైన కేకే నాయుడు విచారణ కమిషన్ ఈ గ్రామాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కే చెందుతాయని తేల్చగా.. మహారాష్ట్ర ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 1996లో ఈ సమస్యను మూడు నెలల్లోగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు హైకోర్టును ఆదేశించినప్పటికీ.. ఇప్పటికీ తుది నిర్ణయం వెలువడలేదు.

ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఓటర్ల జాబితా సవరణ చేపట్టడంతో.. ‘ఒక వ్యక్తి, ఒక ఓటు’ నిబంధన ప్రకారం అధికారులు ఏదో ఒక రాష్ట్రంలోనే వీరిని నమోదు చేయాల్సి వచ్చింది. జూన్ 25న తెలంగాణ అధికారులు పరాందోలిలో ఫారాలు పంపిణీ చేయగా.. మరాఠీ మాట్లాడే షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) ఓటర్లు మహారాష్ట్ర వైపు మొగ్గు చూపుతూ వాటిని నిరాకరించారు. అయితే ఇక్కడి లంబాడీ (ST) సామాజిక వర్గం మాత్రం తెలంగాణ వైపే ఉండేందుకు ఇష్టపడుతోంది. ఎందుకంటే తెలంగాణలో వీరికి ఎస్టీ హోదా ఉండగా, మహారాష్ట్రలో వీరిని వెనుకబడిన తరగతి (VJNT) కింద పరిగణిస్తారు. ఒకవేళ తెలంగాణ జాబితా నుండి పేర్లు తొలగిస్తే తమ ఎస్టీ హోదాను కోల్పోతామని వారు ఆందోళన చెందుతున్నారు.

రెండు రాష్ట్రాల సమాంతర పరిపాలన వల్ల స్థానికులు ఉభయ ప్రభుత్వాల సంక్షేమ పథకాలను పొందుతూనే ఉన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అందించిన ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా పథకాలకు ఆకర్షితులై మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన కొన్ని గ్రామాలు కూడా తెలంగాణలో కలవాలని కోరడం ఇందుకు ఒక ఉదాహరణ. అయితే 2014 తర్వాత తెలంగాణ ప్రభుత్వం సాగు భూములను రిజర్వ్ ఫారెస్ట్‌గా మారుస్తోందని.. తమకు భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తున్న మహారాష్ట్రతోనే ఉంటామని కొందరు గ్రామస్థులు వాదిస్తున్నారు.

ఈ నేపథ్యంలో చంద్రాపూర్, ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు చర్చించి సమస్యను పరిష్కరించాలని స్థానిక సర్పంచులు కోరుతున్నారు. చారిత్రక రెవెన్యూ రికార్డులను మహారాష్ట్ర చూపిస్తుండగా.. కేకే నాయుడు కమిషన్ సిఫార్సులపై తెలంగాణ పట్టుబడుతోంది. ఈ రెండు రాష్ట్రాల ఘర్షణల మధ్య సరిహద్దు గ్రామాల భవితవ్యం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపైనే ఆధారపడి ఉంది.