కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ కురుక్షేత్రం
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ కురుక్షేత్రం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం లో గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కాక రేపుతోంది. గతంలో అధికారంలో ఉండి రికార్డు సమయంలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని చెప్పుకున్న బిఆర్‌ఎస్ పార్టీకి ప్రాజెక్టు పిల్లర్లు కుంగి నిరుపయోగంగా మారడం, ఈ క్రమంలో పార్టీ అధికారం కోల్పోవ డం తీరని అప్రతిష్టను తెచ్చిపెట్టిందనే చర్చ సాగుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంపు హౌస్ నుంచి నీటిని పంపిణీ చేసి ప్రజల, రైతుల అవసరాలకు అందించాల నే డిమాండ్ సరియైనది. అయినప్పటికీ వాస్తవాలను అంచనా వేయడంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు విఫలం చెందారని విమర్శలు లేకపోలేదు. అంబటిపల్లి వద్ద ప్రధానమైన లక్ష్మి బ్యారేజ్ రెండు పిల్లర్లు కుంగిపోవడంతో ప్రాజెక్టు నిరుపయోగంగా మారిందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సాంకేతిక నిపు ణు ల సూచనల మేరకు లక్ష్మి బ్యారేజీలో ఎలాంటి నీటిని నిలువ చేయరాదని, నీటి నిలువ వలన దిగువ ప్రాంతాలకు ముప్పు పొంచి ఉందని అభిప్రాయాన్ని సాంకేతిక నిపుణులు వెల్లడించిన నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా నీటిని నిలువ చేసే సాహసం చేయలేక పోయిందని అధికార పక్షం చెబుతున్నది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటి రామారావు నాయకత్వంలో ఆదివారం కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని తరలించాలనే డిమాండ్‌తో వేలాదిమంది కార్యకర్తలతో తరలిరావడం రాష్ట్రస్థాయిలో చర్చకు దారితీసింది. నాయకుల మధ్యలో సవాళ్లు, ప్రతి సవాళ్లు తారస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం అన్నారం బ్యారేజీకి సైతం మరమ్మతులు కొనసాగుతున్నాయి. మరమ్మత్తులో ఉన్న బ్యారేజీకి నీటిని తరలించాలనే అనాలోచిత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కెటిఆర్ పర్యటనకు అడ్డంకులు సృష్టించినప్పటికీ ఛేదించుకొని కన్నెపల్లి పంప్ హౌస్‌కు చేరుకొని గోదావరి నదిలో ప్రవహిస్తున్న నీరు వృథాగా పోతుందనే సంకేతాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేసినప్పటికీ వాస్తవ విషయాలను ప్రజలకు తెలియచేయటంలో ప్రతిపక్ష పార్టీ విఫలమైందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.
బ్యారేజీలో నీటి నిలువ ఎలా సాధ్యం..?
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ప్రధానంగా కన్నెపల్లి పంపు హౌస్ నుండి గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని అన్నారం బ్యారేజీ కి పంపించాల్సి ఉంది. ప్రస్తుతం అన్నారం బ్యారేజీ కూడా లీకేజీల వలన నీటినిలువ సామర్థ్యం లేదని, ఈ బ్యారేజీలో నీటిని నిలువ చేస్తే ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఎన్టీఎస్‌ఏ నిపుణులు వెల్లడించిన నేపథ్యంలో అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సైతం ప్రస్తుతం మరమ్మతుల కోసం ప్రణాళికలు సిద్ధం చేసి పనులు కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని కెటిఆర్ దృష్టికి స్థానిక నాయకత్వం తీసుకుపోవడంలో విఫలం చెందిందని
విమర్శలు వినిపిస్తున్నాయి.
2028 వరకు మరమ్మతులు పూర్తి ః కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలను సవరించి నేషన ల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల సూచనలు మేరకు అనేక రకాల శాస్త్రీయ పద్ధతులలో సాంకేతిక నిపుణులు పునరుద్ధరణ పనులను వేగవంతం చేసినట్లు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో వెల్లడించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా లోపభూయిష్టంగా నిర్మాణాలు చేపట్టి సాంకేతిక నిపుణుల సూచనలను సలహాలను పరిగణనలోకి తీసుకోకుండా రాజకీ య నాయకులు సాంకేతిక నిపుణులుగా అవతారమెత్తి అడ్డగోలుగా వేలకోట్ల రూపాయలు నీళ్లపాలు చేసి ప్రాజెక్టు నిర్మించి రాష్ట్ర ప్రజలపై అప్పులభారం మోపారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు.
అప్పుల సవాళ్లు దృష్టి మరల్చేందుకేనా?
ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య అప్పుల అంశంపై సవాళ్లు తీవ్రస్థాయిలో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా కెటిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంపు హౌస్ నుంచి నీటిని లిఫ్ట్ చేయాలని ఎజెండా తీసుకున్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసిందని, అప్పుల సవాళ్ల నుంచి దృష్టి మరల్చేందుకే కెటిఆర్ సమాధానం చెప్పలేక కాళేశ్వరం ప్రాజెక్టు టూర్‌ను డిజైన్ చేసి సెల్ఫ్‌గోల్ చేసుకున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. లక్షల కోట్ల ప్రజాధనంతో ధన ప్రవాహం కోసం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేపట్టారని అధికార పక్షం, ప్రతిపక్ష పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నది. అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టు పేరుతో దోచుకొని ఇప్పుడు అమాయక చక్రవర్తి లాగా ప్రజలకు ఏదో మేలు చేకూరుస్తామని భ్రమలు కల్పిస్తూ త్రాగు సాగునీటి కోసం తామే పోరాడినట్లు చెప్పుకుంటూ తిరిగి పోరాటాలకు బయలుదేరి వారం రోజుల డెడ్‌లైన్ విధించడం హాస్యాస్పదమని అధికార పార్టీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. వారం రోజులలో కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని మోటార్ల ద్వారా విడుదల చేయని యెడల వేలాదిగా తరలివచ్చి తామే మోటార్లను ఆన్ చేస్తామని గడువు విధించడంపై ప్రతిపక్ష పార్టీపై అధికార పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నది.
మరమ్మతుల విషయం మరిచారా కెటిఆర్?
కాళేశ్వరం ప్రాజెక్టుతో అనుసంధానంగా ఉన్న అన్ని రిజర్వాయర్లు బ్యారేజీలు అత్యంత లోపభూయిష్టంగా నాణ్యతా లోపంగా ఉన్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ధ్రువీకరించిన విషయం కెటిఆర్ దాటవేయటంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. అన్నారం బ్యారేజ్ లీకేజీలు ఉండడం వలన నీటిని నిల్వచేయడం శ్రేయస్కరం కాదని సాంకేతిక నిపుణులు సూచించిన నేపథ్యంలో అన్నారం బ్యారేజ్‌కి సైతం కన్నెపల్లి నుంచి మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేసి నిలువ చేసే పరిస్థితి లేకపోవడంతో నీటిని ఎక్కడ నిల్వ చేయాలనే ఆలోచన బిఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాక అధ్యక్షుడికి లేకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం మరమ్మత్తులలో ఉన్న అన్నారం బ్యారేజీలో నీటిని నిలువ చేయడం ప్రమాదకరమని కేంద్ర జల సంఘం నిపుణులు సూచించిన విషయాన్ని మర్చిపోవడం విడ్డూరంగా ఉందని చర్చ సాగుతుంది. కాళేశ్వరం ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టు కాదు. ఇది రెండు పార్టీలకు ప్రతిష్టాత్మక యుద్ధం. ఒకరికి గత ఘనత, ఇంకొకరికి వర్తమాన వైఫల్యం. మధ్యలో లబ్ధి పొందాల్సిన రైతు మాత్రం అయోమయంలో ఉన్నాడు. కాళేశ్వరం నీళ్లు పొలాలకు పారకపోయి నా, రాజకీయ బురద మాత్రం రోజురోజుకు పెరుగుతోంది. లబ్ధి ఎవరికి అనేది కాలమే చెప్పాలి.
సుధాకర్- ప్రజాపక్షం విలేకరి, భూపాలపల్లి