New HIV Vaccine: హెచ్ఐవీ వ్యాక్సిన్‌లో భారీ ముందడుగు.. ప్రైమేట్ అధ్యయనాల్లో విజయవంతమైన కొత్త HIV వ్యాక్సిన్..
New HIV Vaccine: హెచ్ఐవీ వ్యాక్సిన్‌లో భారీ ముందడుగు.. ప్రైమేట్ అధ్యయనాల్లో విజయవంతమైన కొత్త HIV వ్యాక్సిన్..
New HIV Vaccine: హెచ్ఐవీ రహిత ప్రపంచం దిశగా ఓ ముందడుగు పడింది. కొత్త వ్యాక్సిన్ ప్రయోగాల్లో శాస్త్రవేత్తల ఘన విజయం సాధించారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న హెచ్ఐవీ/ఎయిడ్స్ (HIV/AIDS) మహమ్మారిని అంతమొందించేందుకు దశాబ్దాలుగా జరుగుతున్న పరిశోధనల్లో శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు. శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేసిన ఒక సరికొత్త వ్యాక్సిన్.. కోతుల వంటి ప్రైమేట్లపై (Primates) జరిపిన ప్రాథమిక పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది.
ఈ వ్యాక్సిన్ శరీరంలో ప్రవేశించిన తర్వాత హెచ్ఐవీని సమర్థవంతంగా ఎదుర్కొనగల అత్యంత శక్తివంతమైన, విస్తృత శ్రేణి యాంటీబాడీలను (Broadly Neutralizing Antibodies) ఉత్పత్తి చేసినట్లు పరిశోధకులు వెల్లడించారు. వైద్య రంగానికి సంబంధించిన ఈ సంచలన వివరాలు ప్రఖ్యాత అంతర్జాతీయ శాస్త్ర సాంకేతిక పత్రిక నేచర్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
ఈ విప్లవాత్మక వ్యాక్సిన్‌ను లా జొల్లా ఇన్స్టిట్యూట్ ఫర్ ఇమ్యునాలజీ, స్క్రిప్స్ రీసెర్చ్, ఇంటర్నేషనల్ ఎయిడ్స్ వ్యాక్సిన్ ఇనిషియేటివ్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. సాధారణ వ్యాక్సిన్లలా ఇది నేరుగా వైరస్‌పై దాడి చేయదు. దానికి బదులుగా మన శరీర రోగనిరోధక వ్యవస్థలో కీలకమైన బి కణాలకు (B-cells) దశలవారీగా ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. దీనివల్ల నిరంతరం తన రూపాన్ని మార్చుకునే భయంకరమైన హెచ్ఐవీ వైరస్ ఏ వేరియంట్‌నైనా (రూపాన్నైనా) సులభంగా గుర్తించి.. నాశనం చేయగల సామర్థ్యం మన శరీరానికే సొంతమవుతుంది.
హెచ్ఐవీ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత చాలా వేగంగా తన నిర్మాణాన్ని మార్చుకుంటూ.. రోగనిరోధక వ్యవస్థకు దొరకకుండా రక్షణ కవచాలను ఏర్పరచుకుంటుంది. ఈ విచిత్ర స్వభావం వల్లే గత నలభై ఏళ్లుగా దీనికి పటిష్టమైన వ్యాక్సిన్ కనుగొనడం శాస్త్రవేత్తలకు సాధ్యపడలేదు. అయితే ప్రస్తుతం అనుసరించిన సరికొత్త దశలవారీ శిక్షణ (Germline-targeting) వ్యూహం ఆ పాత అడ్డంకులను విజయవంతంగా అధిగమించింది. జంతువులపై జరిపిన ప్రయోగాల్లో హెచ్ఐవీకి వ్యతిరేకంగా ఇంతటి అత్యుత్తమ సానుకూల ఫలితాలు రావడం వైద్య చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం.
జంతువులపై సాధించిన ఈ అద్భుత స్ఫూర్తితో.. అదే సాంకేతికతను జోడించి మానవులపై కూడా ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ (Clinical Trials) ప్రారంభమయ్యాయి. అయితే మనుషులలో ఈ వ్యాక్సిన్ ఎంతవరకు సురక్షితం. ఇది ఎంత కాలం పాటు రక్షణ ఇస్తుందనే పూర్తిస్థాయి శాస్త్రీయ డేటా నిర్ధారణ కావడానికి మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో హెచ్ఐవీ బాధితులు ఎక్కువ కాలం జీవించడానికి సమర్థవంతమైన యాంటీరెట్రోవైరల్ థెరపీ (ART) మందులు అందుబాటులో ఉన్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా కొత్తగా వ్యాపించే ఇన్ఫెక్షన్లను శాశ్వతంగా అరికట్టాలంటే వ్యాక్సిన్ ఒక్కటే ఏకైక మార్గం. ఈ నేపథ్యంలో తాజా పరిశోధన ఫలితాలు ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనకు గట్టి సంకేతాలను అందిస్తున్నాయి.