తెలుగుదేశం, జనసేన మధ్యలో ముసలం… 2029లో పవన్ ముందు ఉన్న ఆప్షన్స్ ఇవే… జన సైనికుల మనసులో ఏముంది..?
తెలుగుదేశం, జనసేన మధ్యలో ముసలం...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం టిడిపి, జనసేన మధ్య గ్యాప్ పెరుగుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2029 ఎన్నికల నాటికి జనసేన బలోపేతం అవ్వాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నప్పటికీ అధినేత మాత్రం ఇంకా దిశగా చర్యలు తీసుకోకపోవడం వల్ల కింది స్థాయిలు కేడర్ నిరాశలో ఉన్నట్లు గమనించవచ్చు. అయితే ఈ నిరాశ నుంచి బయటకు తెచ్చేందుకు పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీలో పెద్ద ఎత్తున తమ పార్టీ లీడర్లు అందరికీ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తులో బిజెపి తమ వెనుక ఉండి నడిపిస్తుందని అందరికీ భరోసా ఇచ్చారు. ఏపీ రాజకీయాల్లో జనసేన బిజెపి బలంగా కలిసి పనిచేసే అవకాశం ఉందనే సంకేతాలను రాజకీయ వర్గాల్లోకి పవన్ కళ్యాణ్ పంపించినట్లు అర్థం అవుతోంది. మరోవైపు టిడిపి వర్గాలు సైతం 2029 నాటికి లోకేష్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు ఇస్తే బాగుంటుందని కింది స్థాయిలో పెద్ద ఎత్తున నేతలు చర్చిస్తున్నారు.
దీనికి ప్రధాన కారణం అటు 2029 నాటికి చంద్రబాబు నాయుడు వయసు రీత్యా మరోసారి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం తీసుకునేందుకు సిద్ధంగా ఉండకపోవచ్చు. యువనేత లోకేష్ పగ్గాలు చేపట్టడానికి 2029 సరైన ముహూర్తం అని ఆ పార్టీ వర్గాలు ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. ఒకవేళ 2029లో కూడా కూటమి రూపంలోనే ఎన్నికల పోటీలోకి వెళ్ళినట్లయితే ఈసారి మాత్రం తప్పనిసరిగా ఎక్కువ సీట్లతో పాటు ముఖ్యమంత్రి పదవిలో కూడా షేరింగ్ కోసం పట్టు పట్టాలని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు. అయితే అందుకు టిడిపి సుముఖంగా ఉంటుందా లేదా అనేది భవిష్యత్తులో తేలనుంది.
అయితే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పెర్ఫార్మన్స్ ను బట్టి జనసేన టిడిపి తో కలిసి కొనసాగాలా లేక ఎన్నికల నాటికి స్వతంత్రంగా వెళ్లాలా బిజెపితో కలిసి వెళ్లాలా ఏంటి అనే అంశం పైన తర్జనభజన పడుతున్నట్లు తెలుస్తోంది. 2029 నాటికి పవన్ కళ్యాణ్ కనుక ఎక్కువ సీట్లలో పోటీ చేయకపోతే జనసేన ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆ పార్టీ కిందిస్థాయి నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు బిజెపి సైతం బలంగా ముందు పెట్టుకుని ఏపీలో తమ రాజకీయం తిప్పాలని భావిస్తోంది. బిజెపి ఎదుగుదలకు, అలాగే జనసేన ఎదుగుదలకు కూడా టిడిపి అనేది భవిష్యత్తులో ఒక అడ్డంకిగా నిలబడే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు ఓటు బ్యాంకు పరంగా చూసినప్పుడు తెలుగుదేశం అలాగే జనసేన ఇరు పార్టీలకు చెందిన ఓటు బ్యాంకు, ఎక్కువగా ఒకేలా ఉంటుందని కానీ కాపు సామాజిక వర్గం మెజారిటీ ఓట్లు మాత్రం జనసేన వెంట వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే టిడిపి కూడా ఇప్పటికిప్పుడు జనసేనతో తెగదెంపుల గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు. ఎన్నికల్లో కూటమి గానే వెళితే లాభం అని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి. కానీ జనసేన వర్గాలు మాత్రం తెలుగుదేశంతో ఏమాత్రం వద్దని, ఒకవేళ అలా వెళ్ళినట్లయితే జనాల్లో పలుచన అయ్యే అవకాశం ఉందని కావాలంటే బిజెపితో మాత్రమే కలిసి ముందుకు వెళితే లాభదాయకమని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి ఇది చిలికి చిలికి గాలి వానగా ఎన్నికల నాటికి ఇలాంటి రూపం దాల్చుకుంటుందో అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.