మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి యోగం..ఈ నెలలోనే ఏపీ కేబినెట్ విస్తరణకు ఛాన్స్..?
మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి యోగం..ఈ నెలలోనే ఏపీ కేబినెట్ విస్తరణకు ఛాన్స్..?
ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే మంత్రుల పనితీరుపైన పెద్ద ఎత్తున కసరత్తు ప్రారంభించారు. ఆయా విభాగాల నుంచి పెద్ద ఎత్తున సమాచారం తెప్పించుకొని మంత్రులు ఎలా పనిచేస్తున్నారో సమీక్ష జరిపే అవకాశం కనిపిస్తోంది. కనీసం నలుగురు మంత్రులపైన ఈసారి వేటు పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఓవైపు రెండు సంవత్సరాలు పూర్తవడంతో పాటు, కూటమిలో కీలక పక్షం అయినటువంటి జనసేనకు కూడా ఈసారి క్యాబినెట్లో మంత్రి పదవులు లభించే అవకాశం ఉందని జోరుగా చర్చ నడుస్తోంది.
ఇప్పటికే జనసేన నుంచి ముగ్గురు మంత్రులు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ చంద్రబాబు క్యాబినెట్లో ఉన్నారు. అయితే ఈసారి మరో ఇద్దరికీ జనసేన నుంచి మంత్రి పదవులు లభించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి లభిస్తుందని జోరున చర్చ జరిగింది. అందుకు తగ్గట్టుగానే నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి సైతం వరించింది. కానీ చివరి నిమిషంలో నిర్ణయం హోల్డ్‌లో పడింది. ఇప్పుడు మాత్రం నాగబాబుకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని వార్త నడుస్తోంది.
అలాగే జనసేన తరఫున కొణతాల రామకృష్ణకు కూడా మంత్రి పదవి లభించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అనకాపల్లి ఎమ్మెల్యే అయినటువంటి కొణతాల రామకృష్ణ ఉత్తరాంధ్రలో బలమైన గవర సామాజిక వర్గానికి చెందిన నేపథ్యం ఉన్నవారు. వచ్చే ఎన్నికల్లో గవర సామాజిక వర్గం జనసేన వెంట నడిచేలా చేసేందుకు పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని భావిస్తున్నారు.
మరోవైపు జనసేనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం వల్ల 2029 ఎన్నికల్లో కూటమి ఐక్యంగానే ఎన్నికలకు వెళ్తుంది అనే సంకేతాలు జనాల్లోకి వెళ్లినట్లు అవుతుందని అటు సీఎం చంద్రబాబు ఆలోచనగా సైతం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే అధికారం చేపట్టి సరిగ్గా రెండున్నర సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మరో రెండు సంవత్సరాల్లో ఎన్నికల నామ సంవత్సరంలోకి రాజకీయాలు ప్రవేశిస్తాయి. అంతకుముందే ఈ మంత్రివర్గం కూర్పు విస్తరణ చేపడితే బాగుంటుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, మంత్రుల పర్ఫార్మెన్స్ విషయంలో చంద్రబాబు నాయుడు ఇప్పటికే సీరియస్‌గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా నలుగురు మంత్రుల విషయంలో చంద్రబాబు నాయుడు తీవ్రంగా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ నలుగురు ఎవరు అనేది వేటు పడిన తరువాతే తెలుస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.