హిందూపురంలో బాలయ్య వరుస విజయాల వెనుక అసలు సీక్రెట్ ఇదే… వైసీపీ ఎక్కడ ఫెయిల్ అవుతోంది..?
హిందూపురంలో బాలయ్య వరుస విజయాల వెనుక అసలు సీక్రెట్ ఇదే ( Image Source: Wikipedia)
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అయినప్పటి నుంచి హిందూపురంలో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. అందులోనూ నందమూరి వంశం నుంచి ఎన్టీ రామారావు, హరికృష్ణ, బాలకృష్ణ ముగ్గురు ఎమ్మెల్యేలుగా గెలిచింది హిందూపూర్ నుంచి కావడం విశేషం. హిందూపూర్‌లో నిజానికి ఏ ప్రాతిపదికన తీసుకున్నా, తెలుగుదేశం పార్టీకి సామాజిక వర్గాల పరంగాను, ఇతర డైమెన్షన్స్ పరంగా గమనించినట్లయితే ఎక్కడా కూడా అనుకూలతలు కనిపించవు. కానీ వరుసగా విజయాలు ఎలా లభిస్తున్నాయి అనే దానిపైన ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే దీనికి ప్రధాన కారణం ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి పొరపాట్ల వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని హిందూపూర్ స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకప్పుడు 1983కు ముందు కాంగ్రెస్‌కు పెట్టని కోటగా ఉన్నటువంటి హిందూపూర్, ఆ తర్వాత నుంచి తెలుగుదేశం జెండా ఎగురుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీకి గడ్డు పరిస్థితిగా చెప్పుకునే 2004 ఎన్నికల ఓటమిలోనూ, 2019 ఎన్నికల ఓటమిలోనూ హిందూపూర్‌లో తెలుగుదేశం జెండానే ఎగిరింది. దీన్నిబట్టి అక్కడ ఏ స్థాయిలో పార్టీ బలంగా పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు.
ఇక నందమూరి బాలకృష్ణ వరుసగా మూడుసార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా, 2014 నుంచి అప్రతిహతంగా గెలుపు కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడే ప్రతిపక్షాల బలహీనత కనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. 2014 సంవత్సరంలో నందమూరి బాలకృష్ణ నియోజకవర్గానికి కొత్త. అప్పుడు ఆయనను ఓడించడానికి అవకాశం ఉన్నప్పటికీ, వైఎస్సార్సీపీ స్థానిక నేత అయినటువంటి నవీన్ నిశ్చల్‌ను అభ్యర్థిగా నిలబెట్టింది. ఆ ఎన్నికల్లో బాలకృష్ణ 16 వేల ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా గట్టిగా ఉన్న రోజుల్లో హిందూపూర్‌లో కూడా గాలి బలంగానే వీచింది. కానీ ఆ ఎన్నికల్లో చేసిన తప్పు వల్ల మరోసారి హిందూపూర్ చేజారిపోయింది. స్థానికంగా ముస్లిం సామాజిక వర్గం ఎక్కువగా ఉందని భావించి, రిటైర్డ్ పోలీస్ అధికారి షేక్ మహమ్మద్ ఇక్బాల్‌ను బరిలో నిలిపారు. కానీ ఆయన ఓటమిపాలవడంతో బాలకృష్ణ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
నిజానికి 2019 సంవత్సరంలో షేక్ మహమ్మద్ ఇక్బాల్ బదులుగా స్థానిక వైసీపీ లీడర్నే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి ఉంటే, హిందూపూర్ తమ కైవసం అయి ఉండేదని జిల్లా వైసీపీ వర్గాలు భావిస్తుంటాయి. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ మరోసారి పొరపాటు చేసిందని చెప్పవచ్చు. స్థానికంగా బోయ సామాజిక వర్గానికి ఓటు బ్యాంకు ఎక్కువగా ఉందని భావించి, అదే సామాజిక వర్గానికి చెందిన తిప్పే గౌడ నారాయణ దీపికను బరిలోకి నిలిపారు. బదులుగా స్థానికంగా పనిచేస్తున్నటువంటి వైసీపీ నేతను గుర్తించి బరిలో నిలిపి ఉంటే ఫలితం ఉండేదని భావించారు. కానీ ఈ పొరపాటు నుంచి తేరుకునే లోగా బాలయ్య ముచ్చటగా మూడోసారి కూడా 30 వేల మెజారిటీతో అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. ఇలా హిందూపూర్ ప్రత్యర్థి పార్టీలకు అందని ద్రాక్షగా మిగిలిపోవడం గమనించవచ్చు.