Ram Mandir Donation Row: రాముడి హుండీలోని సొమ్మును కూడా వదల్లేదు.. బీజేపీ నేతలపై పొన్నం ప్రభాకర్ ఫైర్..
రాముడి హుండీ డబ్బును బీజేపీ నేతలే దోచుకున్నారు
Ayodhya Ram Mandir Donation Row: అయోధ్య రామ మందిర విరాళాల సేకరణలో కోట్లాది రూపాయల భారీ అవినీతి జరిగిందంటూ తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయ ఎదుగుదల కోసం దేవుడిని వాడుకోవడంలో బీజేపీ పరాకాష్ఠకు చేరిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు తమ స్తోమతకు తగినట్లుగా రామయ్య గుడి కోసం భక్తితో విరాళాలు ఇస్తే.. కమలం పార్టీ నేతలు ఆ పవిత్రమైన సొమ్మును కూడా వదలకుండా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
బీజేపీ నాయకులు శ్రీరాముడి పేరును, అక్షింతలను అడ్డం పెట్టుకుని ఇళ్ల వెంట తిరిగి విరాళాలు వసూలు చేశారని.. తీరా చూస్తే ఆ నిధుల్లోనే కోట్లాది రూపాయల అవినీతికి తెరలేపారని మంత్రి విమర్శించారు. దేవుడి హుండీలోని సొమ్మును సైతం లూటీ చేయడం దేశ ప్రజలందరినీ అవమానించడమేనని ఆయన అన్నారు. బీజేపీ నేతల అసలు రంగును, వారి అవినీతి అక్రమాలను అక్కడి స్థానిక ప్రజలు ముందే గుర్తించారని.. అందుకే అయోధ్య పరిధిలోని లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థిని అక్కడి ఓటర్లు ఓడించి బుద్ధి చెప్పారని పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు.
భక్తి వేరు, రాజకీయం వేరని స్పష్టం చేసిన మంత్రి.. ఈ విరాళాల కుంభకోణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లదే పూర్తి బాధ్యతని అన్నారు. దేవుడి పేరుతో సాగించిన ఈ పెద్ద స్కాంపై బీజేపీ తక్షణమే స్పందించాలని, దేశ ప్రజలందరికీ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. భక్తి ముసుగులో రాజకీయ వ్యాపారం చేసే శక్తులను ప్రజలు ఇకనైనా గుర్తించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.