Skip to content
తెలంగాణ వార్తలు

Hyderabad Tourism: పూర్తి స్థాయి పర్యాటక కేంద్రంగా దుర్గం చెరువు.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష హైలెట్స్ ఇవే..

Prajapaksham 06 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Hyderabad Tourism: పూర్తి స్థాయి పర్యాటక కేంద్రంగా దుర్గం చెరువు.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష హైలెట్స్ ఇవే..

పర్యాటక రంగ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో కీలక సమావేశం

Hyderabad Tourism: తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో (MCRHRD) నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పర్యాటక శాఖ అధికారులకు ఆయన పలు కీలక ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన దుర్గం చెరువును అన్ని హంగులతో పూర్తిస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

నగరంలోని చారిత్రక కట్టడాల పునరుద్ధరణలో భాగంగా పురానాపూల్, హెరిటేజ్ బ్రిడ్జిలను పర్యాటక ఆకర్షణలుగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ బ్రిడ్జిలపై పర్యాటకుల కోసం ప్రత్యేక వసతులు, సౌకర్యాలు కల్పించాలని, అవసరమైతే ఆయా మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించి పర్యాటకులకు అనుకూలంగా మార్చాలని సీఎం సూచించారు. చారిత్రక కట్టడమైన తారామతి బారామతిని మరింతగా ప్రమోట్ చేయాలని.. అలాగే నగరంలోని మంజీరా, దిల్ కుషా గెస్ట్ హౌస్‌లను ఆధునిక వసతులతో పునరుద్ధరించాలని చెప్పారు.

పర్యాటక హబ్ డెవలప్మెంట్ పథకం కింద వికారాబాద్ జిల్లాను అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మార్చాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అందులో భాగంగా వికారాబాద్‌లోని ప్రసిద్ధ వీరభద్రస్వామి దేవాలయాన్ని యాదాద్రి తరహాలోనే పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని.. దీని నిర్వహణ కోసం ఒక ప్రత్యేక ఆలయ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. కోర్ అర్బన్ రీజియన్ (CURe) పరిధిలో ఉన్న అటవీ భూములను పర్యాటక శాఖతో సమన్వయం చేసుకుంటూ ఎకో టూరిజం ప్రాజెక్టులుగా మార్చాలన్నారు. నగరంలో గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలోనే మరిన్ని కొత్త ఎకో పార్కులను నిర్మించాలని స్పష్టం చేశారు.

రాబోయే రోజుల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఫ్యూచర్ సిటీలోని అటవీ భూములను అంతర్జాతీయ ప్రమాణాలతో అర్బన్ ఫారెస్ట్ తరహాలో తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయడానికి ఒక ‘స్పెషల్ ఆఫీసర్’ను నియమించాలని ఆదేశించారు. వీటితో పాటుగా ఈ ఏడాది డిసెంబరులో నిర్వహించబోయే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కు సంబంధించి ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలని, వేర్వేరు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *