కొడాలినాని, వంశీ మళ్లీ యాక్టివ్ … రెడ్ బుక్ భయం పోయిందా..?
కొడాలినాని, వంశీ మళ్లీ యాక్టివ్ ... రెడ్ బుక్ భయం పోయిందా..? ( AI Generated Image)
తెలుగుదేశం పార్టీలో ఓనమాలు నేర్చుకొని ఆ తర్వాత అదే పార్టీకి పెద్ద తలనొప్పిగా మారి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్రస్థాయిలో ఒత్తిడిని కూడా భరిస్తున్న నేతలు ఎవరైనా ఉన్నారు అంటే అది కొడాలి నాని, వల్లభనేని వంశీ అని చెప్పవచ్చు. ఇద్దరు చిరకాల మిత్రులు. అలాగే ఇద్దరి రాజకీయ లక్ష్యాలు ఒకటే. ఇద్దరి రాజకీయ ప్రస్థానం కూడా ఒకేలాగా ఉంటుంది. ఇద్దరూ తెలుగుదేశం పార్టీలో హరికృష్ణకు నమ్మిన బంటుగా ఉండేవారు. ఆ తర్వాత ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌తో సైతం ఎంతో ఆత్మీయంగా ఉంటారు. అయితే కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరూ కూడా 2019లో జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ మీద తీవ్రమైన పదజాలంతో ఎదురు దాడి చేయడం చూడవచ్చు. అసెంబ్లీ వేదికగా కొడాలి నాని, వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యల వల్ల చంద్రబాబు నాయుడు ఏకంగా అసెంబ్లీలో మళ్లీ అడుగు పెట్టనని, ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాకే తిరిగి అడుగు పెడతానని శపథం చేసే వరకు వీరిద్దరూ విసిగించారు అని చెప్పవచ్చు. అయితే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిద్దరూ టార్గెట్ అయ్యారు. వల్లభనేని వంశీ పైన కేసులు నమోదై జైలు జీవితం గడపగా, కొడాలి నాని కూడా గుడివాడలో ఓటమి తర్వాత ఆరోగ్యం దెబ్బ తినడంతో పార్టీలో యాక్టివ్‌గా ఉండటం లేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. వైసీపీ అధికారానికి దూరమై రెండేళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరు కీలక నేతలు యాక్టివ్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇద్దరూ యాక్టివ్ అయితే కార్యకర్తల్లో ఉత్సాహం వస్తుందని అటు వైసీపీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఫైర్‌బ్రాండ్ నేతలుగా గుర్తింపు ఉన్న ఇద్దరు తిరిగి జనాల్లోకి వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే వైసీపీ క్యాడర్‌కు కొత్త ఉత్సాహం లభిస్తుందని భావిస్తున్నారు.
టీడీపీ అధినేత ఇంటిపైన దాడి కేసులో వల్లభనేని వంశీ ఇప్పటికే సుమారు నాలుగు నెలల పాటు జైలు శిక్ష అనుభవించి ప్రస్తుతం బెయిల్ పైన ఉన్నారు. ఇక కొడాలి నాని కూడా వివిధ కేసుల భయంతో, అనారోగ్య కారణాలతో ఆసుపత్రిపాలై చాలాకాలంగా ఇంటిపట్టునే ఉంటున్నారు. మరోవైపు గన్నవరం నియోజకవర్గంలో ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పైన ఆయన సొంత పార్టీలోనే వ్యతిరేక స్వరం వినిపిస్తోంది. యార్లగడ్డను ఏకంగా తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రేణులు ప్రెస్‌మీట్ పెట్టి మరీ విమర్శిస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే పైన ఉన్న వ్యతిరేకతను వంశీ నెమ్మదిగా తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు అని గన్నవరంలో టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు తనను జైలుకు పంపడం ద్వారా కూటమి ప్రభుత్వం కసి పెంచిందని, ఇంతకుమించి వాళ్లు ఏమీ చేయలేరని వంశీ తన సన్నిహితులతో చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో మళ్లీ ప్రజా సమస్యలను లేవనెత్తుతూ వైసీపీ పిలుపు ఇస్తున్న అన్ని పార్టీ కార్యక్రమాల్లోనూ వంశీ యాక్టివ్ అవుతున్నట్లు చూడవచ్చు.
ఇక కొడాలి నాని కూడా గుడివాడలో యాక్టివ్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పైన తెలుగుదేశం పార్టీలో అసంతృప్తితో పాటు స్థానికంగా కూడా చాలా వ్యతిరేకత ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీన్నే కొడాలి నాని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం రాగానే నాని జైలుకు వెళ్లడం ఖాయమని అంతా భావించారు. కానీ ఆయనకు కోర్టు నుంచి ముందస్తుగా ఊరట లభించింది. ఇక తాజాగా తాడేపల్లిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో కొడాలి నాని కీలక సమావేశంలో పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన కొడాలి తన పాత పద్ధతిలోనే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినట్లు చూడవచ్చు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గమనించినట్లయితే వైఎస్సార్సీపీకి చాలా నియోజకవర్గాల్లో ఇన్‌చార్జీలు కరువయ్యారు. దీంతో కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి నేతలు యాక్టివ్ అయినట్లయితే మిగతా నేతలు కూడా ధైర్యంగా యాక్టివ్ అవుతారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే నారా లోకేష్ ఎప్పటికప్పుడు రెడ్‌బుక్ ఓపెన్ చేస్తాను అంటూ బెదిరిస్తున్నారు. మరి దీనిపైన వీరిద్దరు నేతలు ఎలాంటి కౌంటర్ చేస్తారు, భవిష్యత్తు రాజకీయం ఎలా ఉండబోతుంది, గన్నవరం-గుడివాడ రాజకీయాలను ఈ ఇద్దరు నేతలు ఎలా మలుపు తిప్పనున్నారు అనేది వేచి చూడాల్సిందే.