Skip to content
తెలంగాణ వార్తలు

జులై 15 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం.. ఈ వారంలో మార్గదర్శకాలు విడుదల…

Prajapaksham 28 Jun 2026 0 నిమిషాల పఠనం తెలంగాణ
జులై 15 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం.. ఈ వారంలో మార్గదర్శకాలు విడుదల…

Telangana Govt logo

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల కొరకు ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) జులై 15వ తేదీ నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ పథకం అమలుకు సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలను వారం రోజుల్లోగా విడుదల చేయనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధ్యక్షతన సచివాలయంలో శనివారం నిర్వహించిన ఉద్యోగుల హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ (ఈహెచ్‌సీటీ) తొలి సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే ఈహెచ్‌ఎస్‌ కోసం దంపతుల్లో ఒక్కరి నుంచి మాత్రమే చందా సొమ్ము వసూలు చేయాలని స్పష్టం చేశారు. గత నెలలో దంపతులిద్దరి నుంచి చందా వసూలు చేసినందున, అదనంగా మినహాయించిన ఆ సొమ్మును తిరిగి ఉద్యోగులకు చెల్లించేలా త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నారు. రాబోయే వారం రోజుల్లో ఆసుపత్రుల యాజమాన్య ప్రతినిధులు, ఆరోగ్యశాఖ అధికారులు, ట్రస్ట్‌ సభ్యులతో మరో సమావేశం జరగనుంది. ఆ తదుపరి సమావేశంలోనే వివిధ చికిత్సల ప్యాకేజీ రేట్లు, హాస్పిటళ్ల తుది జాబితాను ఖరారు చేయనున్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నాయకులు మెరుగైన వైద్య సేవల కోసం ప్రభుత్వానికి పలు కీలక ప్రతిపాదనలు చేశారు. గతంలో చికిత్సలకు గరిష్ఠంగా రూ.2 లక్షలు మాత్రమే చెల్లించేవారని, ప్రస్తుత వైద్య ఖర్చుల దృష్ట్యా దాన్ని ఒకసారి చికిత్సకు కనీసం రూ.5 లక్షలకు పెంచాలని కోరారు. క్యాన్సర్‌లో వచ్చిన కొత్త రకాల చికిత్సలతో పాటు ఆయుర్వేద వైద్య విధానాన్ని కూడా ఈ పథకంలో చేర్చాలని పీఆర్‌టీయూ టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. గతంలో 1885 వ్యాధులకు గాను 514 ఆసుపత్రుల్లో ఈ పథకం అమలు కాగా, ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచి అన్ని ప్రముఖ కార్పొరేట్‌ ఆసుపత్రులను ఈహెచ్‌ఎస్‌ పరిధిలోకి తీసుకురావాలని నేతలు డిమాండ్ చేశారు. అలాగే రోగికి చికిత్స పూర్తయిన 15 రోజుల్లోగా ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకపోతే గతంలో మాదిరిగా పథకం నీరుగారిపోయే ప్రమాదం ఉందని వారు గుర్తుచేశారు. ఈ నెలాఖరుకు పదవీ విరమణ పొందుతున్న సీఎస్‌ రామకృష్ణారావును ఉద్యోగుల ఐకాస ఛైర్మన్‌ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు సహా పలు సంఘాల నేతలు ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు.