Skip to content
తెలంగాణ వార్తలు

BRS KCR Plan: ప్రశాంత్ కిషోర్ టీంకు షాక్ ఇచ్చిన కేసీఆర్… బేకార్ పనులు వద్దని పార్టీ నేతలకు చివాట్లు…

Prajapaksham 25 Jun 2026 0 నిమిషాల పఠనం తెలంగాణ
BRS KCR Plan: ప్రశాంత్ కిషోర్ టీంకు షాక్ ఇచ్చిన కేసీఆర్… బేకార్ పనులు వద్దని పార్టీ నేతలకు చివాట్లు…

ai generated image

తెలంగాణలో పూర్వ వైభవం దక్కించుకునేందుకు, తిరిగి అధికారంలోకి వచ్చేందుకు భారతీయ రాష్ట్ర సమితి కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆ పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు బలమైన నేతలను గుర్తించి, టికెట్లు ముందుగానే పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తారని కేటీఆర్, హరీశ్ రావు లాంటి కీలక నేతలు పదే పదే ప్రకటించడం చూడవచ్చు. కాంగ్రెస్‌ను గద్దె దించి తిరిగి అధికారం దక్కించుకోవాలని, ఎన్నికల స్ట్రాటజిస్టును నియమించాలని అటు కేటీఆర్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే విషయమై అధినేత కేసీఆర్ వద్ద ఎన్నికల స్ట్రాటజిస్ట్ పెట్టుకుందామనే ప్రతిపాదన తీసుకొని వెళ్లగా, ఆయన తిరస్కరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మనకెందుకు ఎలక్షన్ స్ట్రాటజిస్టులు, వాళ్లు మనల్ని మించిన నేతలా అని కేసీఆర్ నిలదీసినట్లు తెలుస్తోంది. కొందరు నాయకుల ప్రతిపాదనలను కేసీఆర్ తిరస్కరించడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మొదటి కారణం, వ్యూహకర్తను అధికారికంగా నియమిస్తే ఆ పార్టీలోని కీలక నిర్ణయాలు మన చేతిలో ఉండవని కేసీఆర్ విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకసారి వ్యూహకర్త చేతుల్లోకి వెళ్లినట్లయితే, సర్వేలు మొదలుకొని అభ్యర్థులకు టికెట్లు ఇచ్చే వ్యవహారం వరకు ప్రతిదీ వ్యూహకర్త కనుసన్నల్లో నడుస్తుంది. అప్పుడు పార్టీ నాయకుల పైన అధిష్ఠానం కంట్రోల్ తప్పే అవకాశం ఉంది. ఇక రెండో కారణం, తెలంగాణ ఉద్యమ కాలం నుంచి రాష్ట్ర సాధన వరకు అద్భుతమైన వ్యూహాలు రచించి, పదేళ్లు అధికారంలో ఉన్న తమకు కొత్తగా మరొకరు సూచనలు ఇచ్చే అవసరం లేదని కేసీఆర్ అభిప్రాయపడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక పార్టీ స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవడమే తమ ప్రథమ కర్తవ్యం అని కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారని, తిరిగి అధికారంలోకి రావడానికి అవసరమైన వ్యూహాలను సీనియర్లతో కలిసి చర్చించాలని, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తే విజయం అదే వస్తుందని కేసీఆర్ చెప్పినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు గతంలో భారతీయ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న సమయంలో ప్రముఖ జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను కొంతకాలం పార్టీ వాడుకున్నట్లు తెలుస్తోంది. అయితే అప్పట్లో పీకే సూచించిన నిర్ణయాలు, కార్యక్రమాలు కేసీఆర్‌కు నచ్చలేదు. దీంతో ఆయనను దూరం పెట్టారని తెలుస్తోంది. అలాగే ఎన్నికల వ్యూహకర్తలు ఎప్పటికప్పుడు పార్టీలను మారుస్తూ ఉంటారు. అలాంటి సమయంలో పార్టీలోని కీలకమైన నిర్ణయాలు, డేటా మొత్తం పక్కదారి పట్టే అవకాశం ఉందని కూడా కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

2028 చివరిలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం భారతీయ రాష్ట్ర సమితి మధ్య ప్రధాన పోరు ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఎలాగైనా దీన్ని త్రిముఖ పోరుగా మార్చాలని మరోవైపు బీజేపీ కూడా ప్రయత్నం గట్టిగా చేస్తోంది. ఇదిలా ఉంటే, మరోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం 2023లో సునీల్ కనుగోలు వ్యూహాలతోనే ముందుకు వెళ్లింది. భవిష్యత్తులో కూడా అధికార కాంగ్రెస్ సునీల్ టీంతోనే ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *