కోల్‌కతాలో భారీ ప్రమాదం..గోదాం పైకప్పు కూలి ముగ్గురు మృతి.. 40 మంది చిక్కుకుపోయినట్లుగా వార్తలు..
Major Accident in Kolkata: Warehouse Roof Caves In, Rescue Underway
కోల్‌కతాలోని తారతలా ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ నిర్మాణంలో ఉన్న ఒక మూడు అంతస్తుల గిడ్డంగి (గోడౌన్) పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో గిడ్డంగి లోపల పలువురు కార్మికులు భవన నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. పైకప్పు కూలిన తీవ్రతకు కనీసం 40 మందికి పైగా కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. భవనం కూలిన శబ్దం విన్న వెంటనే స్థానికులు స్పందించి ప్రాథమిక సహాయక చర్యలు ప్రారంభించగా, సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ,విపత్తు నిర్వహణ బృందాలు అధునాతన పరికరాలతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.
ప్రస్తుతం ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ వేగంగా కొనసాగుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ఇప్పటివరకు ఆరు నుండి ఏడుగురిని రక్షక సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. రక్షించబడిన బాధితులను బురద, కాంక్రీట్ పొడితో నిండిన స్ట్రెచర్లపై అంబులెన్స్‌ల వైపు తరలిస్తున్న దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. గాయపడిన వారిని తక్షణమే సమీప ఆసుపత్రికి తరలించగా, వారిలో ముగ్గురు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి తమకు మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో మొదటి సమాచారం అందిందని, వెంటనే అగ్నిమాపక శకటాలను రంగంలోకి దించామని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
భవన శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని కాపాడటానికి రక్షక సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి శ్రమిస్తున్నారు. కాంక్రీట్ దిమ్మెల కింద నుంచి వస్తున్న బాధితుల ఆర్తనాదాలు, సహాయం కోసం చేస్తున్న అరుపుల ఆధారంగా వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రాణాలతో ఉన్న ప్రతి ఒక్కరినీ వీలైనంత త్వరగా సురక్షితంగా బయటకు తీస్తామని కోల్‌కతా పోలీసు విపత్తు నిర్వహణ బృంద సభ్యుడు ఒకరు పీటీఐ వార్తా సంస్థకు వివరించారు. మరోవైపు ఈ ప్రమాదంపై భవన నిర్మాణ నాణ్యతకు సంబంధించిన పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా, పైకప్పు సిమెంట్ నిర్మాణం కింద కేవలం రేకుల షీట్లను మాత్రమే ఆధారం (సపోర్ట్)గా ఉపయోగించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘోర నిర్లక్ష్యంపై అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.