విలువలను మింగేస్తున్న అశ్లీల ప్రవాహం
AI Generated
హరిప్రసాద్ దూపాటి
‘తల చెడినా తత్వం చెడకూడదన్నది పెద్దల మాట. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా సత్ప్రవర్తనను, సదాలోచనలను విడిచిపెట్టకూడదన్నదే దాని అంతరార్థం. మనసులో మంచితనం, ఆలోచనల్లో వివేకం, మాటల్లో సంస్కారం ఉంటే అవే మనిషి పురోగతికి సోపానాలుగా నిలుస్తాయి. కానీ నీచమైన కోరికలు, వికృత ఆలోచనలు మనసును ఆక్రమించి, వాటి ప్రభావంతో ప్రవర్తన అదుపు తప్పితే పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారతాయి. అలాంటి వ్యక్తులు ఘోర నేరాలకు పాల్పడుతూ కుటుంబానికే కాదు, సమాజానికీ ముప్పుగా పరిణమిస్తారు. దురదృష్టవశాత్తూ నేడు అలాంటి ఆందోళనకర పరిస్థితులే నెలకొన్నాయి. అసభ్య, అశ్లీల దృశ్యాలకు బానిసలవుతున్న వారి సంఖ్య పెరుగుతుండగా, వాటి ప్రభావంతో జుగుప్సాకర ఘటనలు అధికమవుతున్నాయి. ఫలితంగా మన సమాజం తీవ్రంగా గాయపడి, నైతిక విలువలు క్షీణిస్తున్నాయి.‘
భారతదేశంలో అంతర్జాల వినియోగదారుల సంఖ్య దాదాపు 90 కోట్లకు చేరుకుంది. పాఠశాల విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు నేడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ కనిపిస్తోంది. నిజానికి జ్ఞాన వికాసానికి, ప్రభుత్వ సేవల వినియోగానికి, సమాచార మార్పిడికి, వినోదం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించడానికి అంతర్జాలం ఎంతో ఉపయుక్తంగా మారింది. అయితే ఇంట్లో దీపం కింద చీకటి ఉన్నట్లే, ఈ సాంకేతిక విప్లవం వెనుక అశ్లీల కంటెంట్ విస్తరణ కూడా ఆందోళన కలిగిస్తోంది. దాని ప్రభావంతో వ్యక్తిగత జీవితాలే కాకుండా సామాజిక వ్యవస్థ కూడా సంక్షోభంలోకి జారిపోతోంది.
సోషల్ మీడియా నుంచి పోర్న్ సైట్ల వరకు
అసభ్య కంటెంట్ సోషల్ మీడియాలో నేడు కంపు కొడుతోంది. వెబ్ సిరీస్‌ల్లోకి చేరుతున్న పచ్చి బూతుమాటలు, పరిధి దాటిన శృంగార సన్నివేశాలు- ఒటిటిల ద్వారా నేరుగా నట్టింట్లోకి వచ్చిపడుతున్నాయి. ఇక పోర్న్ వెబ్ సైట్లు, యాప్‌లలో మెదళ్లను కలుషితం చేసే వికృత చిత్రాలు, దృశ్యాలు వరదలా పారుతున్నాయి. వాటిని చూస్తూ బుర్ర చెడగొట్టుకుంటున్న ఎంతోమంది నైతికంగా పతనమవుతున్నారు. కామోద్రేకంతో నేరాలకు పాల్పడుతూ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు.
నేరాలకు దారితీస్తున్న వికృత వ్యసనం
నిరుడు కోల్‌కతాలో వైద్యురాలిపై పాశవిక అత్యాచారానికి పాల్పడిన రాక్షసుడు నీలిచిత్రాలకు బానిసయ్యాడని పోలీసుల విచారణలో తేలింది. అతడి ఫోన్‌లో హింసాత్మక పోర్న్ కంటెంట్ ఉన్నట్లు వెల్లడైంది. అశ్లీల వీడియోలు చూసి మెదడు మొద్దుబారిన ఓ బాలుడు నిరుడు మధ్యప్రదేశ్‌లో సొంత సోదరిపైనే హత్యాచారానికి ఒడిగట్టాడు. హైదరాబాద్‌లో రోత వీడియోలను చూడటానికి అలవాటుపడిన మరో ప్రబుద్ధుడు కన్నకూతురితో తప్పుగా ప్రవర్తించి, ఆమె ప్రతిఘటించడంతో బండరాయితో మోది హతమార్చాడు.
పోర్న్‌సైట్లలో కంటబడే జుగుప్సాకర దృశ్యాలను అనుకరిస్తూ కట్టుకున్నవాళ్లను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు చాలామంది. దాంతో పచ్చని సంసారాలు కుప్పకూలుతున్నాయి. భర్తల పైశాచిక ప్రవృత్తికి ఎదురు చెప్పలేని ఎంతోమంది గృహిణుల ఆరోగ్యాలు దెబ్బతినిపోతున్నాయి.
అశ్లీల దృశ్యాలనే అనకొండను అడ్డుకోవాలంటే ఎంతో వ్యవస్థాగత కృషి అవసరం. ఆన్‌లైన్ ఆటలు ఆడేటప్పుడో, సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చూస్తున్నప్పుడో, ఇంకేదో సమాచారం చదువుతున్నప్పుడో ఉన్నట్టుండి అశ్లీల కంటెంట్ ప్రత్యక్షమవుతుంది. ఎవరైనా ఒక్క నిమిషం దాని వంక చూశారంటే, ఆపై అలాంటివే గుట్టలుగుట్టలుగా వచ్చిపడుతుంటాయి. ఆల్గారిథమ్‌ల మాయ మూలంగా ఫోన్ పట్టుకునే ఎంతోమంది చిన్నారులు, యువత తెలియకుండానే ఘోరమైన ఊబిలో దిగబడిపోతున్నారు. వాటి నుంచి బయటపడలేక ఉజ్వల భవితను బుగ్గిచేసుకుంటున్నారు.
అంతర్జాలంలోకి పోటెత్తుతున్న అశ్లీల కంటెంట్‌కు అలవాటుపడుతున్న చిన్నారులు, యువతలో హింసాత్మక ప్రవర్తన, దూకుడు స్వభావం పెరుగుతున్నాయి. అలాంటి వారు చిన్నపిల్లలు, మహిళలపై వేధింపులు, కిడ్నాపులు, లైంగిక దాడులకు ఒడిగడుతున్నారని మనస్తత్వ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశానికి వెన్నెముకలాంటి నవతరం ఇలా గాడితప్పుతుంటే, ఇండియా నిజమైన అభివృద్ధిని ఎప్పటికి సాధించగలుగుతుంది?
నవతరాన్ని కాపాడే బాధ్యత అందరిదీ
అశ్లీల చిత్రాలను వీక్షించే వారి సంఖ్య అధికంగా ఉన్న దేశాల్లో భారతదేశం ఉండటం ఆందోళన కలిగించే విషయం. కేవలం వీక్షణలకే పరిమితం కాకుండా, అలాంటి వీడియోలను అప్‌లోడ్ చేసే దేశాల జాబితాలో కూడా భారత్ ముందంజలో ఉండటం మరింత విచారకరం. ఈ పరిస్థితి దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తోంది.
అశ్లీల కంటెంట్ కారణంగా నాశనమవుతున్న జీవితాలను కాపాడాలంటే సంబంధిత వెబ్‌సైట్లపై కఠిన నియంత్రణలు విధించాల్సిన అవసరం ఉంది. నిషేధాల నుంచి తప్పించుకోవడానికి పేర్లు, రూపాలు మార్చుకుని తిరిగి ప్రత్యక్షమయ్యే వెబ్‌సైట్లను గుర్తించి నిరంతరం పర్యవేక్షించాలి. కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను ఒటిటి వేదికలు బాధ్యతాయుతంగా అమలు చేయాలి. నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
సామాజిక మాధ్యమాల్లో విస్తరిస్తున్న అసభ్యకర రీల్స్, వీడియోలపై కూడా సమర్థవంతమైన నియంత్రణ అవసరం. పలు అధ్యయనాల ప్రకారం, టీనేజర్లలో సగానికి పైగా పిల్లలు పదమూడేళ్ల వయస్సుకే అశ్లీల దృశ్యాలకు పరిచయం అవుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలను జాగ్రత్తగా గమనించాలి. పాఠశాల స్థాయి నుంచే వారికి నైతిక విలువలు, బాధ్యతాయుతమైన డిజిటల్ వినియోగంపై అవగాహన కల్పించాలి.
అప్పుడే అశ్లీలత అనే ప్రమాదకర వలయంలో చిక్కుకుంటున్న భావితరాన్ని రక్షించి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి బాటలు వేయగలం. ‘సాంకేతికత మనిషి అభ్యున్నతికి సాధనంగా మారాలి గానీ, విలువలను మింగేసే విషప్రవాహంగా కాదు. భావితరాన్ని కాపాడుకోవడం కోసం ఇప్పుడే సమాజం, ప్రభుత్వం, తల్లిదండ్రులు కలిసికట్టుగా చర్యలు చేపట్టాలి.’