Skip to content
సంపాదకీయం వార్తలు

Editorial: కూలీల జీవితాలపై గణాంకాల ముసుగు

Prajapaksham 24 Jun 2026 0 నిమిషాల పఠనం సంపాదకీయం
Editorial: కూలీల జీవితాలపై గణాంకాల ముసుగు

AI Generated

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల పనితీరును అంచనా వేయడానికి గణాంకాలు కీలకం. ఆర్థిక వృద్ధి, ఉపాధి, వేతనాలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై విడుదలయ్యే అధికారిక గణాంకాలు దేశ పరిస్థితిని ప్రతిబింబించాల్సి ఉంటుంది. అయితే గణాంకాలు వాస్తవాన్ని ప్రతిబింబించే అద్దంలా ఉండాల్సిన చోట, అవి రాజకీయ కథనాలను బలపరిచే సాధనాలుగా మారుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థనే బలహీనపరుస్తున్నాయి. ఇటీవల గ్రామీణ వేతనాల పెరుగుదలపై వెలుగులోకి వచ్చిన వివాదమే ఇందుకు తార్కాణం.

గత దశాబ్దంలో గ్రామీణ భారతదేశం ఎన్నో సంక్షోభాల ను ఎదుర్కొంది. వ్యవసాయంలో పెరుగుతున్న వ్యయాలు, పంటలకు సరైన ధరలు లేకపోవడం, ఉపాధి అవకాశాల కొరత, కొవిడ్‌ మహమ్మారి ప్రభావం, వలసల తిరోగమనం వంటి అంశాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ పరిస్థితుల్లో గ్రామీణ వేతనాల వృద్ధి చాలా నెమ్మదిగా సాగిందని ఆర్థికవేత్తలందరిలో దాదాపు ఏకాభిప్రాయం ఉంది. అనేక అధ్యయనాలు కూడా అదే విషయాన్ని వెల్లడించాయి. ద్రవ్యోల్బణాన్ని తీసివేస్తే కూలీల వాస్తవ ఆదాయాల్లో పెద్దగా పెరుగుదల లేదనే వాస్తవం బహిరంగ రహస్యం.

అయితే, 2025 జులై తర్వాత విడుదలైన అధికారిక గణాంకాల్లో గ్రామీణ వేతనాల వృద్ధి ఒక్కసారిగా 6 శాతం స్థాయి నుంచి 17 శాతానికి చేరినట్లు కనిపించింది. దేశవ్యాప్తంగా కూలీల జీవితాల్లో ఎలాంటి గుణాత్మక మార్పు కనిపించని సమయంలో, ఈ సంఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు అసాధారణంగా పెరిగిన దాఖలాలు లేవు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత ఒక్కసారిగా పెరిగిన సందర్భం లేదు. పరిశ్రమలు గ్రామాలకు పెద్ద ఎత్తున తరలివెళ్లిన పరిస్థితి లేదు. అయినప్పటికీ గణాంకాల్లో మాత్రం అసాధారణ వృద్ధి కనిపించడం అనేక ప్రశ్నలకు దారితీసింది.

గ్రామీణ శ్రామిక శక్తిలో వాటా చాలా తక్కువగా ఉన్న పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నమూనా ఎంపికలో అసాధారణంగా అధిక ప్రాధాన్యతనిచ్చి, ఈ గణాంకాలు సిద్ధం చేశారన్న అనుమానాలు లేకపోలేదు. ఈశాన్య రాష్ట్రాలు, గోవా, ఢిల్లీ, పుదుచ్చేరి వంటి ప్రాంతాలకు కలిపి గ్రామీణ శ్రామిక శక్తిలో ఒకటిన్నర శాతానికన్నా తక్కువ వాటా ఉన్నప్పటికీ, గణాంకాల నమూనాలో వాటి డేటాను 11 శాతం వరకు పెంచినట్లు వెల్లడైంది. అదే సమయంలో మధ్యప్రదేశ్‌, ఒడిశా, జార్ఖండ్‌, రాజస్థాన్‌ వంటి పెద్ద సంఖ్యలో వ్యవసాయ కూలీలు ఉన్న రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గించారని స్పష్టమైంది.

ఈశాన్య రాష్ట్రాలు లేదా గోవా వంటి ప్రాంతాల్లో సగటు వేతనాలు దేశంలోని పేద రాష్ట్రాల కంటే చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడ వ్యవసాయేతర ఉపాధి వాటా అధికం. నైపుణ్యాధారిత పనులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల అక్కడి సగటు రోజువారీ వేతనాలు సహజంగానే ఎక్కువగా నమోదవుతాయి. ఇలాంటి ప్రాంతాల కు గణాంకాల్లో అధిక ప్రాధాన్యతనిస్తే, దేశ సగటు వేతనం పెరిగినట్లు కనిపించడం సహజం. కానీ అది దేశంలోని కోట్లాది కూలీల జీవితాల్లో జరిగిన నిజమైన మార్పును ప్రతిబింబించదు.

ఒక రాష్ట్రంలో వందమంది కూలీలు రోజుకు మూడు వందల రూపాయలు సంపాదిస్తుంటే, మరో చిన్న ప్రాంతంలో పది మంది కూలీలు రోజుకు ఐదు వందల రూపాయలు సంపాదిస్తున్నారని అనుకుందాం. గణాంకాల్లో ఆ పది మందికి అసాధారణంగా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే మొత్తం సగటు పెరిగిపోతుంది. కానీ, వాస్తవానికి వందమంది జీవితాల్లో మార్పు ఏమీ ఉండదు. ఇదే సమస్య ఇక్కడ కనిపిస్తోంది. సంఖ్యలు మెరుగుపడినట్లు కనిపిస్తున్నా, కూలీల జీవన ప్రమాణాలు యథాస్థాయిలో ఉండవచ్చు.

‘గణాంకాలంటే, ఒక చీకటి గదిలో ఒక గుడ్డివాడు అక్కడ లేని నల్ల పిల్లిని వెతకడమే’ అనే విమర్శ, కేంద్ర శ్రామిక గణాంకాలను ప్రతిబింబిస్తుంది. దేశంలోని అత్యంత బలహీన వర్గాల స్వరాన్ని ఎలా ప్రతిబింబిస్తున్నామనే ప్రశ్నకు ఇలాంటి వివరాలు సమాధానం ఇవ్వవు. ఒక గ్రామీణ కూలీకి గణాంకాల భాష అర్థం కాకపోవచ్చు. కానీ తన చేతికి వచ్చే కూలి ఎంత? తన పిల్లల చదువుకు ఖర్చు పెట్టగలుగుతున్నాడా? కుటుంబానికి మూడు పూటల భోజనం అందించగలుగుతున్నాడా? అనే విషయాలు మాత్రం స్పష్టంగా తెలుస్తాయి. స్వానుభవాలకు, ప్రభుత్వ గణాంకాలకు పొంతన లేకపోతే, ఎక్కడో పొరపాటు జరిగిందని ఎవరైనా సులభంగానే గ్రహిస్తారు.

కొవిడ్‌ అనంతర కాలంలో గ్రామీణ భారతదేశం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంది. పట్టణాల్లో ఉద్యోగాలు కోల్పోయిన లక్షలాది మంది గ్రామాలకు తిరిగి వచ్చారు. గ్రామాల్లో ఇప్పటికే పరిమితంగా ఉన్న ఉపాధి అవకాశాలపై అదనపు ఒత్తిడి పడింది. అనేక కుటుంబాలు వ్యవసాయం, ఉపాధి హామీ పథకం, అప్పులు వంటి మార్గాలపై ఆధారపడాల్సి వచ్చింది. ఈ పరిస్థితిలో కూలీల బేరసారాల శక్తి తగ్గింది. పనికోసం పోటీ పెరిగింది. ఫలితంగా వేతనాల పెరుగుదల కూడా పరిమితంగానే ఉండటం సహజం.

గ్రామీణ భారతదేశంలో నేడు ఒక ముఖ్యమైన సమస్య వాస్తవ వేతనాల క్షీణత. పేరు మీద వేతనం పెరిగినా, ద్రవ్యోల్బణం కారణంగా కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. బియ్యం, పప్పులు, కూరగాయలు, విద్య, వైద్యం, రవాణా వంటి అవసరాల ఖర్చులు పెరుగుతున్నాయి. కూలీకి రోజుకు అదనంగా ఇరవై లేదా ముప్పు రూపాయలు వచ్చినా, పెరిగిన ధరల కారణంగా అతని కోనుగోలు శక్తి మారకపోవచ్చు. జీవన ప్రమాణాల్లో పెద్ద మార్పు లేకపోవచ్చు. అందుకే కేవలం నామమాత్రపు వేతనాల పెరుగుదల కంటే వాస్తవ వేతనాల పెరుగుదల ముఖ్యం.

ఇలాంటి సమయంలో గ్రామీణ వేతనాలు అసాధారణంగా పెరిగాయని చూపించడం విధాన నిర్ణయాలపై కూడా ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం లేదా విధాన రూపకర్తలు గ్రామీణ ఆదాయాలు బాగా పెరుగుతున్నాయని భావిస్తే, ఉపాధి సృష్టి కార్యక్రమాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. సంక్షేమ కార్యక్రమాల అవసరం తగ్గిందని భావన ఏర్పడవచ్చు.

గణాంకాల్లో పారదర్శకత లేకపోవడం మరో కీలకమైన అంశం. గణాంకాల నమూనాలో ఇంత పెద్ద మార్పు జరిగితే దాన్ని బహిరంగంగా ప్రకటించాలి. పరిశోధకులు, ఆర్థికవేత్తలు, ప్రజలు ఆ మార్పుల ప్రభావాన్ని అర్థం చేసుకునే అవకాశం కల్పించాలి. కానీ మార్పు గురించి స్పష్టమైన సమాచారం లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కాగా, భారతదేశం ఇప్పటికీ 2011 జనగణన ఆధారంగా అనేక అంచనాలను రూపొందిస్తోంది. గత పదిహేనేళ్లలో దేశ జనాభా నిర్మాణం, వలసలు, ఉపాధి నమూనాలు గణనీయంగా మారాయి. కొత్త జనగణన లేకపోవడం వల్ల గణాంకాల ఖచ్చితత్వంపై ఇప్పటికే అనేక ప్రశ్నలు ఉన్నాయి.

సంఖ్యలతో అభివృద్ధిని సృష్టించడం అసాధ్యం. ప్రజల వాస్తవ జీవితాల్లో మార్పు తీసుకురావాలి. గ్రామీణ కూలీ ఆదాయం పెరగాలంటే వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెరగాలి. గ్రామీణ పరిశ్రమలు అభివృద్ధి చెందాలి. ఉపాధి అవకాశాలు విస్తరించాలి. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు బలోపేతం కావాలి. ఇవి లేకుండా కేవలం గణాంకాల్లో వృద్ధి చూపించడం రాజకీయంగా తాత్కాలిక లాభాలను ఇచ్చినా, దీర్ఘకాలంలో భర్తీ చేయలేని నష్టాలను మిగిలిస్తుంది.

గణాంకాల వెనుక మనుషులు ఉంటారు. ప్రతి శాతం వెనుక ఒక కుటుంబం ఉంటుంది. ప్రతి వేతన గణాంకం వెనుక ఒక శ్రమజీవి కథ ఉంటుంది. ఆ కథలను దాచిపెట్టి సంఖ్యలను మాత్రమే చూపించడం అన్యాయం. దేశ అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు ముందుగా కూలీల జీవితాలను చూడాలి. వారు మెరుగుపడితేనే ఆర్థికాభివృద్ధి అర్థవంతమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *