Skip to content
ప్రపంచం వార్తలు

న్యాయ రంగంలో సరికొత్త చరిత్ర.. న్యాయవాదిపై పోటీపడి గెలిచిన ‘ఏఐ’.. బ్రిటన్ కోర్టులో రూ. 8.79 లక్షల కేసు గెలిచిన గార్ఫీల్డ్ AI!

Prajapaksham 23 Jun 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
న్యాయ రంగంలో సరికొత్త చరిత్ర.. న్యాయవాదిపై పోటీపడి గెలిచిన ‘ఏఐ’.. బ్రిటన్ కోర్టులో రూ. 8.79 లక్షల కేసు గెలిచిన గార్ఫీల్డ్ AI!

AI-Powered Law Firm Defeats Human Attorneys in Historic Court Victory (Photo-AI Generated Image)

ప్రపంచ సాంకేతిక, న్యాయ రంగ చరిత్రలో ఒక అపూర్వమైన మైలురాయి నమోదైంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా, బ్రిటన్ (UK) కు చెందిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత న్యాయ సంస్థ, నిపుణులైన మానవ న్యాయవాదులతో నేరుగా న్యాయపోరాటంలో తలపడి ఒక చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. సంక్లిష్టమైన న్యాయ పత్రాలను అత్యంత ఖచ్చితత్వంతో రూపొందించగల అద్భుత సామర్థ్యం ఉన్న ‘గార్ఫీల్డ్ ఏఐ’ (Garfield AI) అనే లీగల్ చాట్‌బాట్, ఒక ఫ్రీలాన్స్ హ్యూమన్ రిసోర్సెస్ (HR) ఎగ్జిక్యూటివ్ అయిన తమిరెస్ కామల్ తక్విదిర్ తరఫున కేసును నడిపించి, ఏకంగా 7,000 పౌండ్ల (సుమారు రూ. 8.79 లక్షలు) విలువైన ఒక స్మాల్ క్లెయిమ్స్ కోర్టు వివాదాన్ని విజయవంతంగా గెలుచుకుంది.

సాధారణంగా కోర్టు కేసుల కోసం లాయర్లకు లక్షలాది రూపాయలు కుమ్మరించాల్సి వస్తున్న తరుణంలో.. తక్విదిర్ కేవలం 400 పౌండ్లు (సుమారు రూ. 50,252) మాత్రమే నామమాత్రపు రుసుముగా చెల్లించి ఈ గార్ఫీల్డ్ ఏఐ సేవలను పొందగలిగాడు. తనకు రావాల్సిన ఫీజులను చెల్లించకుండా వేధించిన ఒక ప్రముఖ హాస్పిటాలిటీ వ్యాపార సంస్థపై ఈ ఏఐ చాట్‌బాట్ సహాయంతో ఆయన కోర్టులో దావా వేసి విజయం సాధించారు.

గత సంవత్సరం ఏప్రిల్ నెలలోనే బ్రిటన్‌కు చెందిన సోలిసిటర్స్ రెగ్యులేషన్ అథారితీ (SRA) నుంచి అధికారిక గుర్తింపు, అనుమతులు పొందిన గార్ఫీల్డ్ ఏఐ, ఈ కేసును మొదటి నుండి ఎంతో ప్రతిష్టాత్మకంగా సిద్ధం చేసింది. విచారణకు ముందు అవసరమైన న్యాయపరమైన ముసాయిదాలు, నలుగురు ముఖ్య సాక్షుల వాంగ్మూలాల సేకరణ, కోర్టుకు సమర్పించాల్సిన కీలక పత్రాల కట్టను (డాక్యుమెంట్ బండిల్) ఈ కృత్రిమ మేధస్సే స్వయంగా రూపొందించింది.

అనంతరం, కోర్టులో క్లయింట్ తరఫున వాదించడానికి గాను వన్ ఎసెక్స్ కోర్ట్‌కు చెందిన జూనియర్ బారిస్టర్ డొమినిక్ లీని ఈ ఏఐ స్వయంగా నియమించుకుంది. మే నెలలో వాండ్స్‌వర్త్ కౌంటీ కోర్టులో దాదాపు మూడు గంటల పాటు అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఈ విచారణలో ఇరుపక్షాల తరఫున బారిస్టర్లు సుదీర్ఘంగా వాదించారు. విచారణ ముగిసిన అనంతరం, కోర్టు ప్రతివాద సంస్థ యొక్క కౌంటర్ క్లెయిమ్‌లను పూర్తిగా కొట్టివేస్తూ.. తమిరెస్ టాక్విదిర్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. అంతేకాకుండా ఆయనకు 7,000 పౌండ్ల నష్టపరిహారాన్ని మంజూరు చేస్తూ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది.

ఈ విచారణ ప్రక్రియపై జూనియర్ బారిస్టర్ డొమినిక్ లీ స్పందిస్తూ.. కేసు విచారణ ప్రయోజనాల కోసం గార్ఫీల్డ్ ఏఐ రూపొందించిన లీగల్ డాక్యుమెంట్లు, సాక్ష్యాధారాల పత్రాలు అత్యున్నత ప్రమాణాలతో, కోర్టుకు సరిపోయే విధంగా ఉన్నాయని ప్రశంసించారు. గార్ఫీల్డ్ సహ వ్యవస్థాపకుడైన ఫిలిప్ యంగ్ ఈ విజయాన్ని ఒక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణిస్తూ, ఇది ప్రపంచవ్యాప్తంగా సామాన్యులకు ‘న్యాయ ప్రాప్తి’ సులభతరం అయ్యే ఒక నూతన శకానికి నాంది పలకగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. సంప్రదాయ మానవ న్యాయవాదుల సంస్థకు వ్యతిరేకంగా, ఒక రోబోటిక్ ఏఐ లీగల్ సంస్థ తన మొదటి విచారణలోనే ఘనవిజయం సాధించడం చట్ట రంగంలో ఒక గొప్ప మైలురాయి అని ఆయన ఒక లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో గర్వంగా ప్రకటించారు.

ఇది కేవలం ఒక గంటలో ముగిసిపోయే సాధారణ చిన్న దావా కాదని, అనేక మంది సాక్షుల క్రాస్-ఎగ్జామినేషన్‌తో మూడు గంటల పాటు సాగి, తీర్పు రిజర్వ్‌లో ఉన్న అత్యంత సంక్లిష్టమైన కేసు అని ఆయన వివరించారు. ప్రపంచంలో ఎక్కడైనా ఒక మానవ న్యాయవాద బృందంపై ఏఐ న్యాయవాది గెలిచిన మొట్టమొదటి విచారణ ఇదేనని యంగ్ జోడించారు. సాంప్రదాయ లా సంస్థలలో న్యాయవాదులను నియమించుకోవడానికి అయ్యే భారీ ఖర్చుతో పోలిస్తే కేవలం కొంత భాగం మాత్రమే వసూలు చేస్తూ, సామాన్యులకు అండగా నిలుస్తున్న ఈ లీగల్ చాట్‌బాట్ ప్రస్తుతానికి 10,000 పౌండ్ల (రూ. 12.5 లక్షలు) వరకు విలువైన క్లెయిమ్‌లను విజయవంతంగా నిర్వహిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *