Skip to content
జాతీయం వార్తలు

ప్రత్యేక మత గుర్తింపును కోరుకుంటున్న ఆదివాసీలు

Prajapaksham 20 Jun 2026 1 నిమిషాల పఠనం జాతీయం
ప్రత్యేక మత గుర్తింపును కోరుకుంటున్న ఆదివాసీలు

Adivasis Seek Recognition for a Distinct Religious Identity

ఒకవైపు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గిరిజన సాధికారత గురించి మాట్లాడుతున్నప్పటికీ, మరో వైపు అడవులను మైనింగ్‌, కార్పొరేట్‌ ప్రాజెక్టుల కోసం మళ్లిస్తూనే ఉన్నారు. ఆదివాసీలను ప్రతీకాత్మకంగా కీర్తిస్తున్నప్పటికీ, వారు ప్రత్యేక మత గుర్తింపు కోసం చేస్తున్న డిమాండ్‌లను పట్టించుకోవడం లేదు. గిరిజన వ్యక్తు లు ఉన్నత రాజ్యాంగ పదవులను అధిష్టించినప్పటికీ, భూమి, జీవనోపాధి, సంస్కృతి, మతం, స్వయం పాలన వంటి లోతైన ప్రశ్నలు పరిష్కారం కాకుండానే మిగిలిఉన్నాయి.
అఖిల భారత ఆదివాసీ మహాసభ (ఆల్‌ ఇండియా ఆదివాసీ మహాసభ సహా గిరిజన ఉద్యమాల నుండి నేడు వినిపిస్తున్న అత్యంత ముఖ్యమైన ప్రజాస్వామ్య డిమాండ్లలో ఒకటి, జాతీయ జనగణనలో, అధికారిక రికార్డులలో ఆదివాసీలను ప్రత్యేక మత విభాగంగా గుర్తించటం. ఈ డిమాండ్‌ కేవలం పరిపాలనాపరమైనది కాదు, ఇది స్వదేశీ అస్థిత్వ మనుగడకు సంబంధించినది.
హిందూమతం కంటే ఆదివాసీ మతాల ప్రత్యేకత
వ్యవస్థీకృత హిందూమతానికి పూర్వమే భారతదేశంలోని గిరిజన వర్గాలు గొప్ప వైవిధ్యంతో కూడిన ఆధ్యాత్మిక సంప్రదాయాలు, విశ్వాస ఆధారిత ఆచారాలను కలిగి ఉన్నాయి. దేశవ్యాప్తంగా గిరిజన సమూహాలు ప్రకృతిని, అడవులను, కొండలను, నదులను, పూర్వీకులను, కుల చిహ్నాలను పూజిస్తాయి.
వారి విశ్వాస వ్యవస్థలు పర్యావరణ సమతుల్యత, ఉమ్మడి సామాజిక జీవితంతో లోతుగా ముడిపడి ఉన్నాయి. సంతాల్‌లు సార్నా విశ్వాస సంప్రదాయాన్ని అనుసరిస్తారు. గోండ్లు పెర్సా పెన్‌, ఇతర దేశీయ దేవతలను పూజిస్తారు. మధ్య భారతదేశం, ఈశాన్య ప్రాంతం, జార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌ఘఢ్‌, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాలలోని వివిధ గిరిజన వర్గాలు తమ సొంత పవిత్రమైన వనాలను, ఆచారాలను, పండుగల ను, విశ్వ దృక్పథాలను పాటిస్తాయి. వారి మతపరమైన ఆచారాలు కుల ఆధారంగా కాకుండా సామూహిక ఆధారంగా ఉంటాయి. ప్రకృతిని జయించాల్సిన విషయంగా కాకుండా, గౌరవప్రదమైన ఇచ్చి పుచ్చుకోవడా ల ద్వారా సహజీవనం చేయాల్సిన అంశంగా చూస్తారు.
వేదాల అధికారం, వర్ణాశ్రమ ధర్మం అనే భావన, కుల శ్రేణి, బ్రాహ్మణ పౌరోహిత్యం, పవిత్రత- అపవిత్రత సిద్ధాంతం లేదా విస్తృతమైన ఆలయ-కేంద్రీకృత హిందూమత నిర్మాణానికి భిన్నం. గిరిజన మతాలు వాటిపై ఆధారపడి ఉండవు. వాస్తవానికి, గిరిజన వర్గా లు బ్రాహ్మణ సామాజిక వ్యవస్థకు వెలుపల ఉనికిలో ఉన్నాయి. చారిత్రాత్మకంగా వర్ణాశ్రమ వ్యవస్థ స్వరూపమే గిరిజన వర్గాలను దాని పరిధికి వెలుపల ఉంచింది.

సాంప్రదాయ హిందూ గ్రంథాలు తరచుగా అటవీ ప్రజలను స్థిరపడిన కుల సమాజాని కి వెలుపలి వారుగా వర్గీకరించాయి. ఈ చారిత్రక బహిష్కరణ, అన్ని గిరిజన మతాలను విస్తృత హిందూ గుర్తింపు కింద విలీనం చేయాలనే సమకాలీన ప్రయత్నాలను అత్యంత సమస్యాత్మకంగా మారుస్తుంది. గిరిజన వర్గాలను చారిత్రకంగా కుల వ్యవస్థకు వెలుపలగా చూసినట్లయితే, ఈ రోజు వారిని హిందూమతంలో విడదీయరాని భాగంగా పేర్కొనడం చారిత్రక సత్యం కంటే రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ఉపయోగపడుతుందని చాలామంది ఆదివాసీ విద్యావంతులు వాదిస్తున్నారు.
జనగణనలో ఆదివాసీ కేటగిరి
ప్రత్యేక మత గుర్తింపు డిమాండ్‌ ఇటీవల సంవత్సరాలలో ఊపందుకుంది. జనగణనలో ‘ఆదివాసీ’ అనే ప్రత్యేక కేటగిరి లేకపోవడంతో ప్రధాన మతాల జనాభా కృత్రిమంగా పెరిగిపోతోందని, అదే సమయం లో స్థానిక విశ్వాస సంప్రదాయాలు గణాంకపరంగా కనుమరుగవుతున్నాయని అఖిల భారత ఆదివాసీ మహాసభ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల కొనసాగుతున్న జనగణన ప్రశ్నావళిలో హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన, బౌద్ధ వంటి ఇతర ఐచ్ఛికాలతో పాటు ‘ఆదివాసీ’ ఐచ్ఛికం కోసం కూడా ఒక ప్రత్యేక కాలమ్‌ను కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ భారత రాష్ట్రపతికి అఖిల భారత ఆదివాసీ మహాసభ పోస్ట్‌ కార్డ్‌ ప్రచారోద్యమాన్ని నిర్వహించింది. వేలాది పోస్ట్‌ కార్డులు స్థానిక విశ్వాస సంప్రదాయాలను గుర్తించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పాయి. అలాగే గిరిజన సాంస్కృతిక హక్కుల పరిరక్షణకు పిలుపు నిచ్చాయి.

ఈ డిమాండ్‌ ప్రాథమికంగా ప్రజాస్వామ్యబద్ధమైనది. జనగణనలో వర్గాలు కేవలం అంకెలు మాత్రమే కాదు, అవి విధానాలు, ప్రాతినిధ్యం, గుర్తింపును ప్రభావితం చేస్తాయి. అధికారిక రికార్డులలో ఒక మత గుర్తింపు లేనప్పుడు, పరిపాలనలో దాని ప్రత్యేక సమస్య లు తరచుగా విస్మరించబడతాయి. కాబట్టి ఒక ప్రత్యేక కాలమ్‌ కోసం చేసే డిమాండ్‌ అనేది గుర్తింపు, గౌరవం, రాజ్యాంగబద్ధమైన గుర్తింపు కోసం చేసే డిమాండ్‌. గడిచిన కొన్ని దశాబ్దాలుగా, గిరిజన ప్రాంతాలు సైద్ధాంతిక వివాదాలకు ముఖ్యమైన వేదికలుగా మారాయి.

సంఘ్‌ పరివార్‌కు అనుబంధంగా ఉన్న అనేక సంస్థలు, పాఠశాలలు, వసతి గృహాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మతపరమైన కార్యకలాపాలు, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా గిరిజన ప్రాంతాలలో తమ ఉనికిని విస్తరించుకున్నాయి. స్థానిక పండుగలను హిందూ కథనాల ద్వారా ఎక్కువగా పునర్‌ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అదే సమయంలో స్థానిక దేవతలను హిందూ దేవుళ్ల తో గుర్తిస్తున్నారు. ఈ ప్రక్రియ సాంస్కృతిక స్వయంప్రతిపత్తిపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. గిరిజన వర్గాలు విస్తృత భారతీయ సమాజంతో మమేకమవ్వాలా వద్దా అనేది ఇక్కడ సమస్య కాదు. వారిని వారి సొంత పద్ధతులలో నిర్వచించుకోవడానికి అనుమతించాలా వద్దా అనేది ఇక్కడ అసలు సమస్య.
ఆదివాసీలను అడవులకు దూరం చేస్తున్న విధానాలు
ఆదివాసీలకు, అడవులకు మధ్య ఉన్న సంబంధం కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు, అది నాగరికతకు సంబంధించినది. తరతరాలు గా, గిరిజన వర్గాలు తమ జీవనోపాధి, సంస్కృతి, వైద్యం, ఆహారం, ఆధ్యాత్మికత కోసం అడవులపై ఆధారపడుతూనే వాటిని రక్షించుకున్నాయి. అయినప్పటికీ, అనేక అభివృద్ధి విధానాలు ప్రాథమికంగా అడవులను వెలికితీయాల్సిన ఆర్థిక వనరులుగానే పరిగణిస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి భారీ మైనింగ్‌ ప్రాజెక్టులు, ఆనకట్టలు, పారిశ్రామిక కారిడార్లు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు& లక్షలాది గిరిజన ప్రజల స్థానభ్రంశానికి దారితీశాయి. పర్యావరణ క్షీణతను నివారించిన గిరిజన వర్గాలపైనే అభివృద్ధి భారం అసమానంగా పడింది.
సమకాలీన ఆర్థిక విధానాలు అటవీ వనరులను బడా కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం తరలించడాన్ని సులభతరం చేస్తున్నాయనేది వాస్తవం. స్థానిక ప్రతిఘటన ఉన్నప్పటికీ, అనేక గిరిజన ప్రాంతాలలో గనుల తవ్వకం, పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం అటవీ భూముల కేటాయింపు కొనసాగుతోంది. దీని ఫలితంగా ఒక విషాదకరమైన వైరుధ్యం ఏర్పడింది. చారిత్రాత్మకంగా అడవులను పరిరక్షించిన వర్గాలను అభివృద్ధి పేరుతో తరచుగా వారి భూముల నుండి వెళ్లగొడుతున్నారు. అదే సమయంలో, పర్యావరణ క్షీణతకు గణనీయంగా దోహదపడే పరిశ్రమలు, అవే భూములను పొందుతున్నాయి.
ఆధునిక భారతదేశంలో గిరిజన హక్కులకు లభించిన అత్యంత ముఖ్యమైన విజయాలలో ఒకటి అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఎ) 2006 ఆమోదం. ఈ చట్టం, భూమి, అటవీ ఉత్పత్తులు, సామాజిక వనరులపై గిరిజన వర్గాల హక్కులను గుర్తించడం ద్వారా, వారికి వ్యతిరేకం గా జరిగిన చారిత్రక అన్యాయాలను సరిదిద్దడానికి ప్రయత్నించింది. అఖిల భారత ఆదివాసీ మహాసభ, ఇతర ప్రజాస్వామ్య ఉద్యమాలు, ప్రగతిశీల రాజకీయ శక్తుల నిరంతర పోరాటాల ద్వారా ఈ చట్టం ఆమోదం పొందడం సాధ్యమైంది.

అటవీ హక్కులకు మద్దతు కూడగట్టడంలో, కనీస ఉమ్మడి కార్యక్రమం ద్వారా ఈ చట్టాన్ని అమలు చేయాల ని యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయన్స్‌ (యుపిఎ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) సహా వామపక్ష పార్టీలు కీలక పాత్ర పోషించాయి. ఆదివాసులను అడవులను ఆక్రమించేవారిగా చూడటం నుండి, వారిని అటవీ పర్యావరణ వ్యవస్థలకు చట్టబద్ధమైన సంరక్షకులుగా గుర్తించే దిశగా అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఎ) ఒక మార్పును సూచించింది. అయితే, అటవీ హక్కుల చట్టం అమలు అస్థిరంగానే ఉంది. పరిపాలనాపరమైన అడ్డంకులు, హక్కు తిరస్కరణ, కొనసాగుతున్న భూ వివాదాల కారణంగా అనేక వర్గాలు ఈ చట్టం ద్వారా పూర్తి ప్రయోజనం పొందలేకపోయాయి.
నేడు గిరిజన హక్కులను ప్రభావితం చేస్తున్న అత్యంత వివాదాస్పద సమస్యలలో ఒకటి, సంరక్షిత ప్రాంతాలు (ప్రొటెక్టెడ్‌ ఏరియాస్‌), పులి సంరక్షణ కేంద్రాల విస్తరణ. కానీ వాస్తవం ఏమిటంటే, అడవులలో పులులుతో పాటు గిరిజనులు మాత్రమే అక్కడ నివసించేవారు. కొందరు దురాశపరుల జోక్యం తర్వాతే వాటిని వేటాడటం మొదలైంది. దాంతో వాటి జనాభా పడిపోయింది. అనేక సందర్భాల్లో పులి సంరక్షణ కేంద్రాలలో లేదా వాటి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు వేరే చోటికి తరలివెళ్లాలని ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సంరక్షణ విధానాలు తరచుగా మానవ ఉనికిని, వన్యప్రాణుల రక్షణను పరస్పరం సంబంధం లేనివిగా పరిగణిస్తాయని విమర్శకులు వాదిస్తున్నారు.
అడవులను కాపాడుతున్న గిరిజనులు
తరతరాలుగా గిరిజన సమాజాలు సంరక్షిస్తున్న కారణంగానే అనేక పులి ఆవాసాలు మనుగడ సాగించాయి. సాంప్రదాయ అటవీ నిర్వహణ పద్ధతులు పవిత్రమైన తోటల రక్షణకు, నియంత్రిత కోత పద్ధతు లు, సమూహ సంరక్షణ జీవవైవిధ్య పరిరక్షణకు గణనీయంగా దోహదపడ్డాయి. గిరిజన సమాజాలను సంరక్షణ విధానం భాగస్వాములుగా గుర్తించాలే తప్ప, వారిని మినహాయించకూడదు. స్థానిక సమాజాలకు సురక్షితమైన హక్కులు, పరిపాలనలో అర్థవంతమైన భాగస్వామ్యం ఉన్నప్పుడు అడవులు మనుగడ సాగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
గిరిజన వర్గాలకు సురక్షితమైన భూ హక్కులు, సక్రమంగా పనిచేసే స్థానిక ఆర్థిక వ్యవస్థలు, విద్య, ఆరోగ్య సంరక్షణ, ప్రజాస్వామ్య స్వయం-పరిపాలన లభించినప్పుడు, వారు దుర్భరమైన వలసలకు గురికాకుండా అభివృద్ధిని సాధిస్తారు. గిరిజనులను ఉన్నత రాజ్యాంగ పదవుల్లో నియమించటాన్ని వారి సాధికారతకు నిదర్శనంగా ఆర్‌ఎస్‌ఎస్‌ బిజెపి ఆధ్వర్యంలోని ప్రస్తుత రాజకీయ వ్యవస్థ తరచుగా చూపిస్తుంది. కానీ నిజమైన సాధికారతను కేవలం ప్రతీకాత్మక నియామకాలకు పరిమితం చేయలేము.

గిరిజన వర్గాల పట్ల నిబద్ధతకు నిజమైన కొలమానం వారి భూములు రక్షించబడుతున్నాయా, వారి అడవులు చెక్కుచెదరకుండా ఉన్నాయా, వారి భాషలు మనుగడ సాగిస్తున్నాయా, వారి మత సంప్రదాయాలను గౌరవిస్తున్నారా, వారి రాజ్యాంగ హక్కులు అమలు చేయబడుతున్నాయా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. భారతదేశ అడవుల భవిష్యత్తు వాటి జీవవైవిధ్యం, పర్యావరణ సుస్థిరత గిరిజన వర్గాలతో గాఢంగా ముడిపడి ఉంది.
శతాబ్దాలుగా ఆదివాసులు అడవులకు వ్యతిరేకంగా కాకుండా వాటితో మమేకమై జీవించారు. వారి ఆధ్యాత్మిక సంప్రదాయాలు ఆధిపత్యానికి బదులుగా సహకారాన్ని బోధిస్తాయి. వారి జ్ఞాన వ్యవస్థలు ప్రకృతితో సుస్థిర సంబంధాలను కలిగి ఉంటాయి. అదే సమయంలో కొత్త అభివృద్ధి నమూనాలు వారితో మనుగడకు ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి గిరిజన వర్గాలను గౌరవించడమంటే కేవలం రాజకీయ సభలలో వారిని కీర్తించటానికి మించినది. దీని అర్థం వారి మతాన్ని గుర్తించడం, వారి భూములను రక్షించడం, వారి అడవులను కాపాడటం, ప్రత్యేక ప్రజలుగా ఉనికిలో ఉండే వారి హక్కును పరిరక్షించడం. ప్రత్యేక మత హోదా కోసం చేసే డిమాండ్‌& అంతిమంగా, రాజ్యాంగ గౌరవం, సాంస్కృతిక హుందాతనం, చారిత్రక న్యాయానికి అర్హమైన విశిష్ట గుర్తింపులను దేశ మూలవాసులు కలిగి ఉన్నారని గుర్తిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *