టెలిగ్రామ్‌కు ఝలక్.. కేంద్రం విధించిన తాత్కాలిక నిషేధాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు
Delhi HC Backs Government Decision to Restrict Telegram Before NEET-UG Retest
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్షల వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయానికి ఢిల్లీ హైకోర్టులో గట్టి మద్దతు లభించింది. నీట్ రీ-ఎగ్జామ్‌ను పురస్కరించుకుని టెలిగ్రామ్ యాప్‌ను తాత్కాలికంగా బ్యాన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. దేశంలో అత్యవసర పరిస్థితులు, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఈ వ్యవహారానికి సంబంధించిన కేసులో జస్టిస్ తేజస్ కరియా తన కీలక తీర్పును వెలువరిస్తూ.. సమాచార సాంకేతిక (ఐటీ) చట్టంలోని సెక్షన్ 69ఏ కింద ప్రభుత్వం టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌ను బ్లాక్ చేయడాన్ని సమర్థించారు. ప్రభుత్వం ఈ నిషేధానికి వెల్లడించిన కారణాలు అత్యంత సంతృప్తికరంగా ఉన్నాయని, పరీక్షల నిర్వహణలో తలెత్తే అక్రమాలను అరికట్టేందుకు ఇవి రక్షణాత్మక చర్యల్లో భాగమేనని ఆయన పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అనాలోచితంగా లేవని, చట్టపరిధిలోనే ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు కోర్టు అభిప్రాయపడింది.
ఈ నిషేధానికి దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తే, కొన్ని ముఠాలు నీట్ పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్ చేసి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆధారాలు లభించాయి. ముఖ్యంగా ఈ లీకైన పేపర్లను, సమాచారాన్ని విస్తృతంగా షేర్ చేయడానికి టెలిగ్రామ్ యాప్‌ను ఒక ప్రధాన వేదికగా వాడుకున్నట్లు కోర్టు గుర్తించింది. ఈ నేపథ్యంలోనే జూన్ 21న జరగబోయే నీట్ రీ-ఎగ్జామ్‌ను పారదర్శకంగా నిర్వహించడం కోసం, టెలిగ్రామ్ యాప్‌ను జూన్ 22వ తేదీ వరకు తాత్కాలికంగా బ్లాక్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు, పాత మెసేజ్‌లను ఎడిట్ చేసి తప్పుడు లీకేజీ ఆధారాలను సృష్టించకుండా అడ్డుకట్ట వేసేందుకు వీలుగా.. జూన్ 30వ తేదీ వరకు ఆ యాప్‌లో ‘మెసేజ్ ఎడిటింగ్’ ఫీచర్‌ను కూడా కేంద్రం డిజైబుల్ చేసింది.
అయితే, ఈ తాత్కాలిక నిషేధాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ యాప్ యాజమాన్యం అంతకుముందు కోర్టును ఆశ్రయించింది. దేశంలో ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లన్నీ ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా పనిచేస్తుండగా, కేవలం తమ యాప్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఎందుకు నిషేధించారంటూ వారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తప్పుపట్టారు. కానీ, పరీక్షల పవిత్రతను కాపాడటం ,కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తును రక్షించడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని భావించిన ఢిల్లీ హైకోర్టు, టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు ప్రశాంతంగా, ఎలాంటి అక్రమాలు జరగకుండా ముగియాలంటే ఈ తాత్కాలిక బ్యాన్ తప్పనిసరని కోర్టు తేల్చి చెప్పింది.