Telangana New Ration Cards: కొత్త లామినేటెడ్ రేషన్ కార్డులు పంద్రాగస్టు నుంచి పంపిణీ
Telangana New Ration Cards
సంగారెడ్డిలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల మందికి అందించనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటన
రాష్ట్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల కొత్త లామినేటెడ్ రేషన్ కార్డులను అందించనుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి గురువారం అధికారిక మెమో జారీ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డుల పంపిణీని చేపడుతోందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కొత్తగా అర్హత పొందిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పారు.
సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రస్థాయిలో ప్రారంభోత్సవం నిర్వహించనుండగా, అదే సమయంలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) సమన్వయంతో జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆదేశించారు.
స్వాతంత్ర్య దినోత్సవ అధికారిక కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు.
లబ్ధిదారుల జాబితాల ఖరారు నుంచి కార్డుల ముద్రణ, రవాణా, పంపిణీ కేంద్రాల ఏర్పాట్లు, ప్రజా సౌకర్యాలు, మీడియా ప్రచారం, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ వరకు అన్ని ఏర్పాట్లను సమగ్రంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.
పేద కుటుంబాల ఆహార భద్రతను మరింత బలోపేతం చేస్తూ, ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రయోజనాలను కొత్తగా అర్హత పొందిన ప్రతి కుటుంబానికి చేరవేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం సంక్షేమ పాలనలో ఇది మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన అన్నారు.