Skip to content
ప్రపంచం వార్తలు

Pakistan Imran Khan: పాకిస్థాన్ లో అలజడి… ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల నిరసన ప్రదర్శనలు

Prajapaksham 07 Aug 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
Pakistan Imran Khan: పాకిస్థాన్ లో అలజడి… ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల నిరసన ప్రదర్శనలు

Pakistan Imran Khan: పాకిస్థాన్ లో అలజడి... ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల నిరసన ప్రదర్శనలు

పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇమ్రాన్‌ను అరెస్టు చేసి, జైలుకు తరలించి మూడు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పీటీఐ ఇచ్చిన పిలుపు మేరకు వేలాది మంది కార్యకర్తలు, నాయకులు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు.

పీటీఐ అధికారంలో ఉన్న ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా రాజధాని పెషావర్ నగరం ఈ నిరసనలకు ప్రధాన కేంద్రంగా మారింది. లాహోర్, మియాన్‌వాలీ, రావల్పిండి వంటి ప్రాంతాల్లోనూ ప్రదర్శనలు జరిగాయి. భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు లాఠీచార్జి చేసి ప్రదర్శనకారులను చెదరగొట్టారు. వందమందికిపైగా కార్యకర్తలు, నాయకులను అరెస్టు చేశారు.

లాహోర్‌లోని మాల్ రోడ్‌లో జరిగిన నిరసనల్లో ఐదుగురు ఎంపీలతో సహా 25 మందికి పైగా అరెస్టయ్యారు. కరాచీలోని సర్దార్ టౌన్ ప్రాంతంలో ప్రదర్శనకారులను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. 10 మందికి పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.

వార్తలను సేకరిస్తున్న పలువురు జర్నలిస్టులపై కూడా పోలీసులు దాడులకు తెగబడటంతో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడుల పట్ల మీడియా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఇదిలావుంటే, తమ సోదరుడి విడుదల కోసం ప్రజా ఉద్యమం ప్రారంభమైందని, త్వరలోనే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఇమ్రాన్ సోదరి అలీమా ఖాన్ తెలిపారు. జైలులో ఇమ్రాన్‌కు సరైన వైద్య సదుపాయాలు అందించడం లేదని, ఆయన కంటిచూపు కూడా మందగించిందని మాజీ కేంద్ర మంత్రి మూనిస్ ఎలాహి ఆరోపించారు.

ఇమ్రాన్ స్వేచ్ఛను హరించినంత మాత్రాన ఆయన దృఢ సంకల్పాన్ని లేదా ధైర్యాన్ని దెబ్బతీయలేరని పీటీఐ నాయకుడు షెహర్యార్ అఫ్రిది వ్యాఖ్యానించారు.

అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ ఘటనలపై స్పందిస్తూ, గడచిన మూడేళ్లుగా ఇమ్రాన్‌కు న్యాయబద్ధమైన విచారణ పొందే హక్కును పాకిస్తాన్ ప్రభుత్వం నిరాకరిస్తోందని పేర్కొంది. ఆయనను సుదీర్ఘకాలంగా ఏకాంత నిర్బంధంలో ఉంచారని, సరైన వైద్యం అందించడం లేదని తెలిపింది.

కుటుంబ సభ్యుల కలయికను నిరాకరించడం దురదృష్టకరమని విమర్శించింది. గత ఎనిమిది నెలలుగా ఆయన కుటుంబ సభ్యులను కలవడానికి అనుమతి ఇవ్వలేదని, డిసెంబర్ 2025 నుండి ఇమ్రాన్ దంపతులకు న్యాయవాదుల సంప్రదింపులను కూడా నిరాకరించారని ఆరోపించింది. రాజకీయ లబ్ధి కోసమే ఇమ్రాన్‌పై కేసులు మోపినట్టు పీటీఐ ఆరోపిస్తుండగా, షెహ్‌బాజ్ షరీఫ్ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది.

ట్యాగ్‌లు: Pakistan World News