Moosi River Front: మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు
తొలిదశ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సియా
200 హెక్టార్ల పరిధిలో అభివృద్ధి పనులు
100 అడుగుల రోడ్లు, వ్యూయింగ్ డెక్స్, పార్కుల ఏర్పాటు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ధి (మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్) ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. నగర అభివృద్ధిలో నూతన ఒరవడిగా ప్రభుత్వం భావిస్తున్న ఈ ప్రాజెక్టు మొదటి దశ (ఫేజ్-1)కు పర్యావరణ అనుమతి లభించింది. తెలంగాణ రాష్ట్ర పర్యావరణ ప్రభావ మదింపు ప్రాధికార సంస్థ (సియా) ఆగస్టు 5న ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టు కేటగిరీ కింద ఈ ప్రాజెక్టుకు ముందస్తు పర్యావరణ అనుమతి మంజూరు చేసింది.
రెండు విభాగాలుగా ఫేజ్-1
ఫేజ్-1లో రెండు ఉప విభాగాలు ఉన్నాయి. హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 9.2 కిలోమీటర్ల మేర విస్తరించిన ఫేజ్-1ఎ, ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 11.3 కిలోమీటర్ల మేర విస్తరించిన ఫేజ్-1బి ఇందులో భాగంగా ఉన్నాయి. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను సియాకు సమర్పించింది. వీటిలో నదీ శిక్షణ పనులు, వరద నియంత్రణ చర్యలు, మురుగునీటి పారుదల, కాలుష్య నివారణ మౌలిక సదుపాయాలు, నదీ తీర స్థిరీకరణ, పర్యావరణ పునరుద్ధరణ, రివర్ ఫ్రంట్ రోడ్లు, ప్రొమెనేడ్లు, బహిరంగ ప్రదేశాలు, యుటిలిటీ మౌలిక సదుపాయాల ప్రణాళికలు ఉన్నాయి.
రహదారులు, పచ్చదనానికి పెద్దపీట
మొబిలిటీ మౌలిక సదుపాయాల్లో భాగంగా 30 మీటర్ల (100 అడుగుల) రోడ్లు, సర్వీస్ రోడ్లు, పాదచారుల మార్గాలు, సైక్లింగ్ ట్రాక్‌లు, నదిపై వంతెనలు, యుటిలిటీ కారిడార్లు ప్రతిపాదించారు. బహుళ అంతస్తుల ప్రొమెనేడ్లు, పార్కులు, పబ్లిక్ ప్లాజాలు, వ్యూయింగ్ డెక్‌లు, సాంస్కృతిక ప్రదేశాలు పబ్లిక్ రియల్మ్ డెవలప్మెంట్లో భాగంగా ఉండగా, రిపేరియన్ ఆవాస పునరుద్ధరణ, స్థానిక మొక్కల పెంపకం, చిత్తడి నేలల అభివృద్ధి, హరిత కారిడార్లు, జీవవైవిధ్య పెంపుదల, వాతావరణ అనుకూల ప్రకృతి దృశ్యాలు పర్యావరణ పునరుద్ధరణలో భాగంగా ఉన్నాయి.
మొత్తం 200 హెక్టార్ల అభివృద్ధి ప్రాంతంలో అత్యధికంగా 64 హెక్టార్లకు పైగా రోడ్ల నిర్మాణానికి కేటాయించారు. హరిత ప్రదేశాలకు దాదాపు 56 హెక్టార్లు, కరకట్ట, నదీ రక్షణ చర్యలకు 52 హెక్టార్లకు పైగా, యుటిలిటీలకు 22 హెక్టార్లకు పైగా కేటాయించగా, నిర్మిత ప్రాంతం కేవలం రెండు హెక్టార్లకే పరిమితమైంది. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా 32,000 చదరపు మీటర్ల స్థలాన్ని చూపారు.
భూసేకరణ, నిర్వాసితుల వివరాలు
200 హెక్టార్లలో 64 హెక్టార్లకు పైగా ప్రభుత్వ భూమి, దాదాపు 59 హెక్టార్లు పట్టా భూమి, 51 హెక్టార్లు నదీ ప్రాంతం కాగా, 12 హెక్టార్లకు పైగా రక్షణ శాఖ భూమి ఉంది. ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతంలో సుమారు 639 శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలను గుర్తించినట్లు ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. వీటిని 2013 నాటి భూసేకరణ, పునరావాసం చట్టం (సరసమైన పరిహారం, పారదర్శకత) ప్రకారం సేకరిస్తారు. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 2,660 చెట్లు ప్రభావితం కానున్నాయి.
ఈ ప్రాజెక్టు తొలి దశను రెండు భాగాలుగా చేపడుతున్నారు.
ఫేజ్-1ఎ : హిమాయత్ సాగర్ నుండి బాపూఘాట్ వరకు 9.2 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తారు.
ఫేజ్-1బి : ఉస్మాన్‌సాగర్ నుండి బాపూఘాట్ వరకు 11.3 కిలోమీటర్ల మేర పనులు నిర్వహిస్తారు.