Skip to content
జాతీయం వార్తలు

ఆధార్ అనేది కేవలం వ్యక్తి గుర్తింపునకు సాక్ష్యం మాత్రమే..దుర్వినియోగంపై కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు..

Prajapaksham 17 Jun 2026 1 నిమిషాల పఠనం జాతీయం
ఆధార్ అనేది కేవలం వ్యక్తి గుర్తింపునకు సాక్ష్యం మాత్రమే..దుర్వినియోగంపై కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు..

Supreme Court Seeks Centre’s Reply on Aadhaar Use

వ్యక్తుల గుర్తింపు (ఐడెంటిఫికేషన్) కోసం మాత్రమే కేటాయించిన ఆధార్ కార్డును పౌరసత్వం, స్థానికత, వయస్సు ,నివాస ధ్రువీకరణ వంటి అంశాలకు రుజువుగా ఉపయోగిస్తూ దుర్వినియోగం చేస్తున్నారనే పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. దీనిపై సమగ్ర వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ,కేంద్ర ఎన్నికల సంఘానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ ,జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు జారీ చేస్తూ, ఈ పిటిషన్‌ను ఇప్పటికే కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఇలాంటి ఇతర కేసులతో జత చేసింది.

ఆధార్ చట్టం-2016లోని సెక్షన్ 9 నిబంధనల ప్రకారం.. ఆధార్ కార్డు అనేది కేవలం ఒక వ్యక్తి గుర్తింపునకు సాక్ష్యం మాత్రమే తప్ప, అది ఏ రకంగానూ పౌరసత్వానికో లేదా స్థానికతకో చట్టబద్ధమైన రుజువు కాదని పిటిషనర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సైతం 2023 ఆగస్టు 22న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని ఆయన గుర్తుచేశారు. అయినప్పటికీ, దేశంలో పాఠశాల ప్రవేశాలు, ఆస్తుల కొనుగోళ్లు, జనన ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డులు ,డ్రైవింగ్ లైసెన్సుల మంజూరు వంటి కీలక ప్రక్రియల్లో ఆధార్‌ను వయస్సు, చిరునామా రుజువుగా యథేచ్ఛగా వాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా కొత్త ఓటరు నమోదు కోసం ఉపయోగించే ‘ఫారమ్-6’ దరఖాస్తులో పుట్టిన తేదీ ,నివాస స్థలానికి రుజువుగా ఆధార్ కార్డును అంగీకరించడంపై పిటిషనర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో ఒక ఏడాది కాలంలో 182 రోజులు నివసిస్తే విదేశీయులకు కూడా ఆధార్ పొందే హక్కు లభిస్తుందని, దీనివల్ల సరిహద్దుల గుండా వచ్చే అక్రమ చొరబాటుదారులు, వలసదారులు ఈ లోపాన్ని ఆసరాగా చేసుకుంటున్నారని పేర్కొన్నారు. వారు సులభంగా ఆధార్ కార్డులు సంపాదించి, దాని ఆధారంగా ఓటరు జాబితాలో చేరిపోతూ దేశ ఎన్నికల వ్యవస్థను, భద్రతను ప్రమాదంలోకి నెడుతున్నారని వాదించారు. ఫారమ్-6 కింద ప్రస్తుతం జరుగుతున్న వెరిఫికేషన్ విధానం అత్యంత లోపభూయిష్టంగా ఉందని, దీనిపై రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ,సైబర్ నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసి తగిన సంస్కరణలు చేపట్టాలని పిటిషనర్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *