హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. ఫైర్ ఎన్వోసీ స్కాంలో 16 జూనియర్ కాలేజీలు
ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఆగడాలకు అంతులేకుండా పోతోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంలో కొన్ని కాలేజీలు ఎంతటి ఉల్లంఘనాలకు అయినా పాల్పడేందుకు వెనుకాడటం లేదు. తాజాగా అలాంటి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. . హైదరాబాద్‌లోని దాదాపు 16 జూనియర్ ప్రైవేట్ కళాశాలల్లో నకిలీ ఫైర్ ఎన్వోసీల (Fire NOC) కుంభకోణవెలుగులోకి వచ్చింది. ఇందులో విచిత్రమైన విషయం ఏమిటంటే ఏకంగా హైడ్రా కమిషనర్, ఫైర్ సర్వీసెస్ డిజి సంతకాలను సైతం ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్ఓసీలను పొందినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ వ్యవహారం చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. డెక్కన్ క్రానికల్ దినపత్రిక ఈ ఘటనపై రిపోర్ట్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే జంట నగరాల్లో ఉన్న మొత్తం 16 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు హైడ్రా కమిషనర్, ఫైర్ సర్వీసెస్ డీజీ సంతకాలను నకిలీ చేసి ఫైర్ ఎన్వోసీలను పొందిన వ్యవహారం ప్రస్తుతం సంచలనంగా మారింది. మరో 112 జూనియర్ కళాశాలల పత్రాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TSBIE) గుర్తింపు పొందాలంటే హైడ్రా కమిషనర్ ధ్రువీకరించిన ఫైర్ ఎన్వోసీ తప్పనిసరి. అయితే దీన్ని ఎలాగైనా సరే ఉల్లంఘనలకు పాల్పడి అనుమతులు పొందడానికి నకిలీ ఫైర్ ఎన్ఓసి లను ఒక ముఠా ద్వారా సృష్టించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ అవకతవకలను గుర్తించిన అనంతరం హైడ్రా అదనపు డైరెక్టర్ పాపయ్య వర్ల ఈ వ్యవహారంపై మొదట అధికారికంగా ఫిర్యాదు చేశారు. కొన్ని కాలేజీలు ప్రస్తుత హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సంతకాన్ని సైతం ఫోర్జరీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే అప్పటి ఫైర్ సర్వీసెస్ బిజీ వై నాగిరెడ్డి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసినట్లు దర్యాప్తులో తేలింది.
బర్కత్‌పురలోని ఒక జూనియర్ కళాశాల సమర్పించిన ఫైర్ ఎన్వోసీ నకిలీదని ఫిబ్రవరి చివర్లో ఫిర్యాదు రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.పరిశీలనలో సంబంధిత ఫైర్ ఎన్వోసీని హైడ్రా అధికారులు అసలు జారీ చేయలేదని నిర్ధారణ అయింది. దర్యాప్తు కోసం హైడ్రా, పోలీసులు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TSBIE), జిల్లా విద్యాశాఖ అధికారుల (DIEOs) నుంచి ప్రైవేట్ జూనియర్ కళాశాలల వివరాలు సేకరించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 80కుపైగా ఫైర్ ఎన్వోసీలను ధ్రువీకరణ కోసం పరిశీలించారు. పత్రాల పరిశీలనలో అనేక నకిలీ ఎన్వోసీలు ఉపయోగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అధికారులు తెలిపారు.
నకిలీ సంతకాలు, నకిలీ పత్రాల వినియోగం, మోసం, ప్రభుత్వ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేయడం వంటి అభియోగాలతో కళాశాలల యాజమాన్యాలపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు, నకిలీ పత్రాలు సమర్పించిన ప్రతి కళాశాల పాత్రపై సమగ్ర విచారణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు మరిన్ని కళాశాలల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, ఫైర్ ఎన్వోసీ ధ్రువీకరణ ప్రక్రియను మరింత కట్టుదిట్టం చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.