స్వార్థ, మత రాజకీయాలు సమాజానికి ప్రమాదకరం
Self-Serving and Religious Politics Are Dangerous to Society
భారతదేశానికి 100 సంవత్సరాల పోరాటాల తర్వాత స్వాతంత్య్రం వచ్చింది. మన దేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగా ప్రకటించుకున్నాము.ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క ప్రభుత్వంగా ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని శపథం చేశాము. స్వాతంత్య్ర పోరాటంలో అనేకమంది యోధులు ప్రాణాలొడ్డి పోరాటాలలో పాల్గొన్నారు.
ఝాన్సీలక్ష్మీబాయి నాయకత్వంలో చేసిన తిరుగుబాటు మొదటి స్వాతంత్య్ర పోరాటంగా చరిత్రలో నమోదైంది. టిప్పుసుల్తాన్ లాంటి రాజులు, ప్రజాస్వామ్యవాదులు, దేశభక్తికి అసలైన ప్రతినిధులైన సుభాష్ చంద్రబోస్, మహాత్మాగాంధీ, జవహార్‌లాల్ నెహ్రూ, బాలగంగాధర్ తిలక్ లాంటి వారితో పాటు అల్లూరి సీతారామరాజు, భగత్‌సింగ్, రాజ్గుర్ లాంటి వీర కిశోరాల ప్రాణ త్యాగాలు, కమ్యూనిస్టులు మరియు అనేక వర్గాలు తరతమ భేదాలు లేకుండా ఒకే లక్ష్యంతో బ్రిటీష్ రాజ్యం పోవాలి, దేశానికి స్వారాజ్యం రావాలి అని పోరాటం చేశారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, పార్శీలు అనే తేడా లేకుండా మతాలకు, కులాలకు అతీతంగా దేశ స్వాతంత్య్ర పోరాటం జరిగింది. ఎట్టకేలకు 1947 ఆగస్టు 15నాడు మన దేశం బ్రిటీష్ వారి దోపిడీ, కబంధ హస్తాల నుండి ముక్తి చేయబడి స్వతంత్ర దేశంగా ఏర్పడింది.
నాటి నాయకులు నిజాయితీగా, స్వార్ద చింతన లేకుండా, అవినీతి ఆశ్రిత పక్షపాతానికి తావులేకుండా దేశం కోసం పనిచేశారు. కానీ రానురాను 70 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ సమరంలో దేశ ప్రయోజనాలు అడుగంటి స్వార్ధ ప్రయోజనాలు ప్రథమ స్థానానికి చేరాయి. ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి రాజకీయాల్లో ప్రథమ స్థానం సంపాదించింది. అవినీతి రాజ్యమేలుతుంది. ప్రవచనాలు ప్రజలకు… పైసలు రాజకీయ నాయకులకు అన్నది నిత్య సత్యంగా ఉన్నది. కష్టాలు ప్రజలకు, సుఖాలు రాజకీయ నాయకులకు అనేది వాస్తవంలో అమలవుతున్నది.
ఒకప్పుడు పార్టీ రాజకీయాల విధివిధానాలపై, సూత్రాలపై పార్టీ నాయకులు పనిచేసేవారు. రానురాను పార్టీ రాజకీయాలు వ్యక్తి రాజకీయాలుగా మారిపోయాయి. ఒకప్పుడు ఉన్న పార్టీ ప్రాధాన్యత మసకబారి వ్యక్తి ప్రాధాన్యత పెరిగి నియంతృత్వ స్థాయికి చేరుకుంటున్నాయి. పార్టీ భజనకన్నా వ్యక్తి భజన చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పటి రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఎవరూ ఊహించటం అసాధ్యం. ఇలాంటి వారంతా ఉన్న పార్టీలో టికెట్ దొరకలేదని, డబ్బు సంపాదనకు అధికార పార్టీలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, పార్టీలు మారుతున్న విషయం ప్రజలు గమనిస్తున్నారు.
నిన్నటి వరకు మత సామరస్యం, సెక్యులర్ విధానం అని గుండెలు బాదుకునేవారు. మత రాజకీయాలతో నడుస్తున్న పార్టీలలో చేరి మత ద్వేషాలు రెచ్చగొడుతూ అంతకు ముందు మతరాజకీయాలు చేస్తున్న వారికన్నా తామే అగ్రగాములమని ప్రజలు నమ్మటానికి తాపత్రయపడుతూ సమాజానికి తీరని ద్రోహం చేస్తున్నారు. సెక్యులర్ పార్టీలో ఉంటే సెక్యులరిస్టుగా, సోషలిస్టు పార్టీలో ఉంటే సోషలిస్టుగా, మతపార్టీలో ఉంటే మతోన్మాదిగా అనేకపాత్రలు నిర్వహిస్తూ సినిమా నటులను మరిపిస్తున్నారు.
తొలితరంలో పార్టీలు మారటం చాలా అరుదుగా ఉండేది. ప్రస్తుతం ఒక పార్టీలో గెలిచి పదవుల కోసం ఇతర పార్టీల్లో చేరటం అలవాటుగా మారిపోయింది. పార్టీ మార్పు చట్టాన్ని కూడా పనికిరానిదిగా చేసి అవకాశవాద రాజకీయాలను పరాకాష్టకు చేర్చుతున్నారు. ఒకప్పుడు మత రాజకీయాలను అసహ్యించుకొని వ్యతిరేకించినవారు సమాజ శ్రేయస్సు కన్నా తమ శ్రేయస్సే ముఖ్యమని భావించి మత రాజకీయ పార్టీల్లో చేరటంతో ఆ పార్టీల వారు ఆడింది ఆట, పాడింది పాటగా సాగుతున్నది. అవకాశవాద రాజకీయవాదులు చేస్తున్న విన్యాసాలకు సమాజం (ప్రజలు) మూల్యం చెల్లించుకుంటున్నది.
ఒకనాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవం పేరుతో ఢిల్లీపై తిరుగుబాటు చేస్తూ స్థాపించిన పార్టీ మరియు లోహియా ప్రవచించిన సోషలిజమే ధ్యేయంగా ఏర్పడిన పార్టీ నేడు మత రాజకీయాల పార్టీలతో ఊరేగటం స్వార్ధం మరియు అవకాశవాదం. చిన్న రాష్ట్రాలు తమ ధ్యేయమని రాజమండ్రి సమావేశంలో తీర్మానించిన పార్టీ అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌ని 4 రాష్ట్రాలుగా విభజించాలని మాయవతి కాలంలో అసెంబ్లీ తీర్మానించినప్పటికీ తర్వాత 10 సంవత్సరాకుపైగా రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న పార్టీ మాయావతి తీర్మానాన్ని అమలు చేయకపోవటం పచ్చి అవకాశవాదం.
1947లో దేశ విభజన జరిగిన సంఘటనల ప్రతిఫలాలను క్రమంగా మర్చిపోయి దేశ ప్రజలంతా మతాలకు, కులాలకు అతీతంగా భారత సమాజ నిర్మాణంలో జీవనం గడుపుతున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు మత రాజకీయవాదులు అవకాశం దొరికినప్పుడల్లా తమ నిజస్వరూపాన్ని ప్రదర్శిస్తూనే వచ్చారు. కానీ నేటి రాజకీయాల్లో మతాల పేరుతో ప్రజలను విభజిస్తూ రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాల కోసం ఇలాంటి పనికి రాని విన్యాసాలు చేయటం సమాజానికి హానికరం. మెజార్టీ, మైనార్టీ వాదనతో తమ రాజకీయాలను మరింతలోతుగా ప్రజల్లోకి చొప్పించి తమ పబ్బం గడుపుకుంటున్నారు. ఇలాంటి విధానం ప్రమాదకరం. కాశ్మీర్లో వీరు రగిలించిన మంటలు ఆరలేదు. మర్చిపోయిన ఖలిస్తాన్ నినాదం మళ్ళీ తెరమీదకు వచ్చింది. నార్త్యీస్ట్రన్ రాష్ట్రాలు సవ్యంగా లేవు.
ప్రస్తుత పరిస్థితులు సమాజ శాంతికి, సామరస్యానికి ప్రమాదంగా ఉన్నాయని మేధావులు పదే పదే చెపుతున్నా ఇలాంటి వారు వారి మాటలను పెడచెవిన పెడుతున్నారు. దేశమంటే కేవలం మట్టికాదు, సరిహద్దులు కావు, దేశమంటే ప్రజలు అనేది ఇష్టమున్నా లేకున్నా అందరూ ఒప్పుకోవాలి. దేశంలో 99శాతం శ్రమచేసుకొని బ్రతికే వారు ఉండగా కేవలం ఒక్కశాతం మాత్రం దోపిడీదారులు ఉన్నారనేది వాస్తవం. దేశంలో సంపద సృష్టించే వారే కష్టజీవులు, కార్మికులు అని తరతరాలుగా వాస్తవ విషయాలను మేధావులు చెపుతున్నప్పటికీ మన దేశ పాలకులు దోపిడీదారులకే కొమ్ముకాస్తూ 99శాతం ప్రజలకు అన్యాయం చేస్తున్నారు.
మత రాజకీయాలు చేసేవారు తాము చేసే మెజారిటీ వాదాన్ని శ్రమ విషయంలో పరిశీలిస్తే 99శాతం ప్రజలను వదిలి కేవలం ఒకశాతంతో మైనార్టీలుగా ఉన్న దోపిడీదారులకు ఎందుకు ఊడిగం చేస్తున్నారో అర్ధం చేసుకోవాలి. అలాంటి రాజకీయాలను తిప్పికొట్టాలి. రాజకీయాల నుండి స్వార్ధ, అవినీతి, మత రాజకీయాలను వెలివేయటంలో, సమాజాన్ని ప్రజాస్వామ్య దేశంగా నిర్మించటానికి ప్రజలు ప్రధానపాత్ర పోషించాలి. మన చరిత్రకు మనమే వారసులం. మన భవిష్యత్తును నిర్మించుకుందాం.
కావున పార్టీ పిరాయింపుల చట్టం మార్చి సంఖ్యతో సంబంధం లేకుండా పార్టీ ఫిరాయించిన వెంటనే పదవికి అనర్హుడి గా ప్రకటించాలి. రాజకీయ నాయకులు పదవి చేపట్టే ముందు ఆ పదవి పూర్తి అయిన తర్వాత మధ్యలో అసహేతుకంగా పెరిగిన ఆస్తులను జాతీయం చేయాలి. అలాంటి అనేకమైన మార్పులను మేధావులతో చర్చించి రాజకీయాల ప్రక్షాళన జరిపి సమాజాన్ని కాపాడాలి. అందుకోసం ప్రజలు తమ గళాన్ని వినిపించాలి.
వి.యస్.బోస్ – సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు