మోదీ అమెరికాకు సేవకుడిలా వ్యవహరిస్తున్నారు.. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు
Rahul Gandhi Targets Modi Government on Foreign Relations
ఒమన్ తీరంలో భారత నావికులు మరణించిన ఘటనపై అంతర్జాతీయంగా, దేశీయంగా రాజకీయ సెగలు రేగుతున్నాయి. ఈ దురదృష్టకర సంఘటనపై అమెరికా కనీసం విచారం వ్యక్తం చేయకపోగా, భారతదేశాన్ని ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేయడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు భారతీయ నావికుల ప్రాణాలు పోయినా కనీసం క్షమాపణలు కూడా చెప్పని అమెరికా.. తమ సైనిక ఆదేశాలను తక్షణమే పాటించాలని, ఎలాంటి ఉల్లంఘనలను సహించేది లేదని బెదిరింపు ధోరణిలో మాట్లాడటం సరికాదన్నారు.
సార్వభౌమాధికారం ఉన్న ఏ దేశమైనా ఇలాంటి హెచ్చరికలను, అవమానకరమైన భాషను సహిస్తుందా అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఒక విధేయుడైన సేవకుడిలా అమెరికా చెప్పిన ఆదేశాలన్నింటినీ గుడ్డిగా పాటిస్తున్నారని రాహుల్ గాంధీ తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా విమర్శించారు. అగ్రరాజ్యాల ముందు మోకరిల్లి, రాజీపడే వ్యక్తి భారతదేశ గౌరవాన్ని ఎంతమాత్రం కాపాడలేరని, ప్రస్తుత ప్రధాని లోపభూయిష్టమైన పాలనలో భారతీయుడిగా ఉండటం అంటే ఒక దయనీయమైన దుస్థితిని ఎదుర్కోవడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శల శరపరంపర కురిపించారు. భారతీయ నావికులు చనిపోయి మూడు రోజులు గడుస్తున్నా, ప్రధాని మోదీ నుంచి కనీసం ఒక చిన్న సంతాప సందేశం కానీ, బహిరంగ ప్రకటన కానీ రాకపోవడం అత్యంత విచారకరమని దుయ్యబట్టారు. దేశ ప్రతిష్ఠను, సార్వభౌమాధికారాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఏ స్థాయికి దిగజార్చిందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యాలు అవసరం లేదని ఖర్గే ఎద్దేవా చేశారు.
దేశ జాతీయ ప్రయోజనాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రోజువారీగా విదేశాల వద్ద తాకట్టు పెడుతోందని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో ఇలాంటి దారుణమైన నిజాలు దాగి ఉంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం వాటన్నింటినీ కప్పిపుచ్చుతూ కేవలం ‘విశ్వగురు’ అనే జబ్బలు చరుచుకునే ప్రచారాలతో కాలం వెళ్లదీస్తోందని ఖర్గే తన ఎక్స్ పోస్ట్‌లో మండిపడ్డారు. ఈ ఘటనపై కేంద్రం తక్షణమే స్పందించి గట్టి కౌంటర్ ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.