చైనా సంస్కృతికి నిలువుటద్దం టోక్యో స్పైస్
Tokyo Spies Is a True Reflection of Chinese Culture
నైజీరియాకు చెందిన ప్రముఖ రచయిత, చిత్రకారుడు, సంగీతకారుడు, సాంస్కృతిక ఆలోచనాకారుడు ఒన్యేకా న్వెల్యూ తాజాగా రచించిన ‘టోక్యో స్పైస్” నవల ప్రపంచవ్యాప్తంగా సాహిత్య వర్గాల్లో చర్చనీయాంశమైంది. చైనా సంస్కృతికి అద్దం పడుతున్న ఈ నవల హక్కులను జపాన్‌లోని ఒక ప్రచురణ సంస్థ సుమారు 85 మిలియన్ యెన్‌ల భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు వార్తలు రావడంతో దీనిపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ నవల కథ 1887 సంవత్సరంలో జరుగుతుంది. ఆఫ్రికన్ రచయిత న్వెల్యూ జపాన్ చరిత్ర, చైనా సంస్కృతి, కళ, కుటుంబ బాధ్యతలు. నైతిక విలువలను మిళితం చేస్తూ ఈ కథను రూపొందించడం విశేషం. ఇది జపాన్ నేపథ్యంతో ఆయన ప్రణాళిక చేసిన ఆరు నవలల సిరీస్‌లో మొదటి భాగం. కథానాయకుడు ‘జెంజిరో ఇటో’, టోక్యో ఇంపీరియల్ యూనివర్సిటీలో కాలిగ్రఫీ (అందమైన చేతిరాత కళ) నేర్చుకుంటున్న యువకుడు. ఒక రోజు తన కుటుంబ సభ్యులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని తెలుసుకుంటాడు. అయితే కుటుంబం వద్దకు తిరిగి వెళ్లకుండా, కళను అభ్యసించాలనే నెపంతో చైనాలోని టియాంజిన్ నగరానికి పారిపోతాడు. అక్కడ అతను ‘లిన్ రుయో’ ‘మేయి’ అనే ఇద్దరు మహిళలతో పరిచయం పెంచుకుంటాడు. వారి సాన్నిహిత్యంలో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ప్రయత్నిస్తాడు. అయితే అతను నిర్మించుకున్న జీవితం ఒక అబద్ధం మీద ఆధారపడినది. కాలక్రమంలో ఆ విషయం బయటపడుతుంది. ఫలితంగా అతను తన ఇల్లు, కళ, ప్రేమలు, గౌరవం , భవిష్యత్తు అన్నింటినీ కోల్పోతాడు. వీధుల్లో జీవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నవలలో ‘కాలిగ్రఫీ కళ’ కేవలం ఒక కళారూపంగా కాకుండా, నిజాయితీ, సిగ్గు, ఆత్మపరిశీలనలకు ప్రతీకగా నిలుస్తుంది. జెంజిరో తన వైఫల్యాలను ఎదుర్కొంటూ, చైనా, జపాన్ సంప్రదాయాలను కలిపిన కొత్త కాలిగ్రఫీ శైలిని సృష్టిస్తాడు. అది అతని ప్రతిభను ప్రదర్శించడానికి కాదు… తన తప్పులను అంగీకరించి, వినయంతో జీవించడానికి చేసిన ప్రయత్నానికి చిహ్నంగా నిలుస్తుంది. చివరికి ఒక బాధాకరమైన ఉత్తరం అతనిని తిరిగి జపాన్‌కు తీసుకువస్తుంది. అక్కడ అతను వదిలివచ్చిన కుటుంబాన్ని, తనలో దాచుకున్న అపరాధ భావనను, తన అసలు వ్యక్తిత్వాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ‘నిజం నుండి పారిపోవడానికి ఉపయోగించిన కళ, చివరికి మనిషిని విముక్తి చేయగలదా?’ అనే గంభీరమైన ప్రశ్నను ఈ నవల పాఠకుల ముందుంచుతుంది. ఒన్యేకా న్వెల్యూ భారతదేశంతో కూడా అనుబంధం కలిగిన రచయిత. ఆయన మణిపూర్ విశ్వవిద్యాలయంలో ఆఫ్రికన్ సాహిత్య అధ్యాపకుడిగా పనిచేశారు. ప్రస్తుతం భారతదేశంలోని ఆఫ్రికన్ సెంటర్‌తో అనుబంధంగా ఉన్నారు. జపాన్‌లోని ఒసాకాలో కాలిగ్రఫీ నేర్చుకుంటున్న ఆయన అనుభవం కూడా ఈ నవలకు మరింత ప్రామాణికతను, కళాత్మకతను అందించింది. ‘టోక్యో స్పుసై‘ సాహిత్యం, చరిత్ర, కళ, మానవ మనస్తత్వాన్ని కలిపిన ఒక ఆలోచనాత్మక రచనగా నిలుస్తుంది.