Skip to content
తెలంగాణ వార్తలు

మెట్రో అడ్డుకోవడంలో ktr కుట్ర.. కిషన్ రెడ్డి వెనక కేటీఆర్… కేటీఆర్ కుట్రలకు కిషన్ రెడ్డి తోడు : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Prajapaksham 15 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
మెట్రో అడ్డుకోవడంలో ktr కుట్ర.. కిషన్ రెడ్డి వెనక కేటీఆర్… కేటీఆర్ కుట్రలకు కిషన్ రెడ్డి తోడు : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Telangana CM Revanth Reddy Addresses Media at Secretariat

హైదరాబాద్ సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నగర మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ, దానికి ఎదురవుతున్న అడ్డంకులపై అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. జంటనగరాలతో పాటు కూర్ (CURE) పరిధిలోని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రవాణా ప్రణాళికలు రూపొందించిందని గుర్తుచేశారు.

వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆనాటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి చొరవతో హైదరాబాద్‌కు మెట్రో ప్రాజెక్టు రాగా, రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటి దశ మెట్రో ఒప్పందాలు జరిగాయని వివరించారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం చారిత్రక కట్టడాల సాకుతో మొదటి దశ పనులను మూడేళ్ల పాటు ఆలస్యం చేసిందని మండిపడ్డారు. దీనివల్ల రూ. 15 వేల కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు వ్యయం 22 వేల కోట్లకు చేరిందని, ఈ ఆలస్యం ,కోవిడ్ ప్రభావం వల్ల ఎల్ అండ్ టీ (L&T) సంస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిందని చెప్పారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు మెట్రో విస్తరణను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లే హైదరాబాద్ మెట్రో దేశంలోనే 9వ స్థానానికి పడిపోయిందని ఆరోపించారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెట్రో ఫేజ్-2 విస్తరణ జరగాలని గట్టి నిర్ణయం తీసుకుందని, ఇందులో భాగంగా ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కలిసి నిధుల కోసం విజ్ఞప్తి చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే, ఫేజ్-1 నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థే ఫేజ్-2 కూడా నిర్మించాలనే నిబంధనను కేంద్రం తెరపైకి తెచ్చిందని, కానీ గత నష్టాల దృష్ట్యా ఆ సంస్థ దీనికి అంగీకరించలేదని చెప్పారు. రూ. 30 వేల కోట్ల ఆస్తిని సృష్టించినప్పటికీ ఏటా రూ. 400 కోట్ల నష్టం వస్తోందని, అందుకే ఫేజ్-2 నిర్మాణం కానీ, భవిష్యత్తు నిర్వహణ కానీ తాము చేపట్టలేమని ఎల్ అండ్ టీ స్పష్టంగా తిరస్కరించిందన్నారు.

ఈ సమస్యకు పరిష్కారంగా ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవడం ఒక్కటే మార్గమని కేంద్రం సూచించిందని, అందువల్ల రూ. 30 వేల కోట్ల విలువైన మెట్రో ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ. 15 వేల కోట్లకే కొనుగోలు చేసిందని వెల్లడించారు. ఎల్ అండ్ టీ సంస్థ బ్యాంకుల నుంచి 8.25 శాతం వడ్డీకి తీసుకున్న రూ. 13,600 కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు.

గతంలో కేసీఆర్ ప్రభుత్వానికి ఎలాంటి గ్యారెంటీ లేకుండా, మూడో కంటికి తెలియకుండా పిఎఫ్‌సి (PFC), ఆర్ఈసి (REC) ద్వారా 9 నుండి 11.5 శాతం భారీ వడ్డీలతో రూ. 3.15 lakh కోట్ల అప్పులు ఇప్పించిన కేంద్రం, ఇప్పుడు తమ ప్రభుత్వానికి ఐఆర్‌ఎఫ్‌సీ (IRFC) ద్వారా తక్కువ వడ్డీకి రుణం ఇచ్చేందుకు అడ్డుపడుతోందని సీఎం విమర్శించారు. తాము జపాన్ సంస్థతో మాట్లాడి కేవలం 4 శాతం వడ్డీకే రూ. 13,600 కోట్ల రుణం తీసుకొచ్చామని, జపాన్ సంస్థ ఇప్పటికే ఆ నిధులను ఐఆర్‌ఎఫ్‌సీకి విడుదల చేసిందని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ. 1,400 కోట్లు చెల్లించి, ఆర్‌బీఐని ఒప్పించిన లేఖను సమర్పించినప్పటికీ, ఆ నిధులను రాష్ట్రానికి బదిలీ కాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి నేరుగా ఆరోపించారు. మే 20, 21 తేదీల్లో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్వినీ వైష్ణవ్‌లను కలిసి లోన్ ఇవ్వద్దని కోరారని, గతంలో వరంగల్ ఎయిర్‌పోర్ట్ పనులను కూడా ఆయన ఇలాగే మందగించేలా చేశారని మండిపడ్డారు. ఐఆర్‌ఎఫ్‌సీలో నిలిచిపోయిన ఆ డబ్బుకు వడ్డీ ఎవరు కడతారో సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కిషన్ రెడ్డిపై తమకు వ్యక్తిగతంగా గౌరవం ఉన్నప్పటికీ, తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై తీవ్ర అసహనం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్, వైజాగ్ వంటి ప్రాంతాలకు మెట్రోలు మంజూరు చేస్తూ తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని, కిషన్ రెడ్డి వెనక ఉండి కేటీఆర్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. 122 కిలోమీటర్ల మేర చేపట్టే మెట్రో రెండో దశలో కేంద్రం భాగస్వామి అవుతుందా లేదా అనేది కిషన్ రెడ్డి తేల్చాలని, ఒకవేళ కేంద్రం భాగస్వామ్యం కష్టమనుకుంటే తక్షణమే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కేంద్రం 50 శాతం నిధులు ఇవ్వకపోయినా పర్వాలేదని, ఎన్ఓసీ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా పూర్తి నిధులు భరించి మెట్రో ఫేజ్-2 పూర్తి చేసుకుంటుందని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం తాను ఈ విషయాలు మాట్లాడటం లేదని, మెట్రో మొదటి దశను పూర్తిగా స్వాధీనం చేసుకుని, రెండో దశను విజయవంతంగా పూర్తి చేయడమే తమ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *