రైలులో ఎక్కువ లగేజీ తీసుకెళ్తున్నారా? భారత రైల్వే కొత్త రూల్స్ తెలుసుకోండి
IRCTC
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్. కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారు ఇకపై IRCTC ద్వారా అదనపు లగేజీని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. లగేజీ పరిమితులు, చార్జీలు, పూర్తి వివరాలు తెలుసుకోండి.
Railway Luggage Rules: భారతీయ రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ మరో కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై రైళ్లలో అదనపు లగేజీని తీసుకెళ్లాలనుకునే ప్రయాణికులు స్టేషన్‌లోని పార్శిల్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ఐఆర్‌సీటీసీ (IRCTC) వేదికగా ఆన్‌లైన్‌లోనే లగేజీని బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ కొత్త విధానం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
ఇప్పటి వరకు ఉచిత పరిమితికి మించిన లగేజీ ఉన్న ప్రయాణికులు తప్పనిసరిగా రైల్వే స్టేషన్‌లోని పార్శిల్ కార్యాలయాన్ని సంప్రదించి బుకింగ్ చేయాల్సి వచ్చేది. కొత్త విధానంతో టికెట్ బుక్ చేసే సమయంలోనే అదనపు లగేజీ వివరాలను నమోదు చేసి.. ఆన్‌లైన్‌లోనే బుకింగ్ పూర్తి చేసుకునే వెసులుబాటు లభించనుంది. దీనివల్ల ప్రయాణికుల సమయం ఆదా కావడంతో పాటు బుకింగ్ ప్రక్రియ మరింత సులభతరం కానుంది.
ఈ సదుపాయం కేవలం కన్ఫర్మ్ రిజర్వేషన్ టికెట్ ఉన్న ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే వారు ప్రయాణించే రిజర్వ్డ్ కోచ్‌లో తీసుకెళ్లే అదనపు లగేజీకే ఈ సేవ అందుబాటులో ఉంటుంది. టికెట్ బుక్ చేసే సమయంలోనే ఉచిత పరిమితికి మించిన సామాను వివరాలను నమోదు చేస్తే, ఆయా తరగతులకు అనుగుణంగా ఉచిత లగేజీ పరిమితి, గరిష్ఠంగా అనుమతించే బరువు, అదనపు చార్జీలు, నిషేధిత వస్తువులు, జరిమానా నిబంధనలను సిస్టమ్ చూపిస్తుంది.
తరగతుల వారీగా ఉచిత లగేజీ పరిమితి
ఏసీ ఫస్ట్ క్లాస్: 70 కిలోలు ఉచితం, గరిష్ఠంగా 150 కిలోల వరకు అనుమతి.
ఫస్ట్ క్లాస్ / ఏసీ 2-టైర్: 50 కిలోలు ఉచితం, గరిష్ఠంగా 100 కిలోలు.
స్లీపర్ క్లాస్: 40 కిలోలు ఉచితం, గరిష్ఠంగా 80 కిలోలు.
సెకండ్ క్లాస్: 35 కిలోలు ఉచితం, గరిష్ఠంగా 70 కిలోలు.
ఏసీ 3-టైర్, ఏసీ 3 ఎకానమీ, ఏసీ చైర్ కార్: ఉచిత పరిమితి 40 కిలోలే. ఈ తరగతుల్లో అదనపు లగేజీ బుకింగ్ సదుపాయం ఉండదు.
లగేజీ పరిమాణం, చార్జీలు
రైల్వే శాఖ లగేజీ బ్యాగుల పరిమాణాలనూ నిర్దేశించింది. ఏసీ 3-టైర్, ఏసీ 3 ఎకానమీ, ఏసీ చైర్ కార్ కోచ్‌లలో బ్యాగ్ గరిష్ఠ పరిమాణం 55 × 45 × 22.5 సెం.మీ.కాగా, ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ 2-టైర్, స్లీపర్, సెకండ్ క్లాస్ కోచ్‌లలో 100 × 60 × 25 సెం.మీ. వరకు అనుమతిస్తారు. అదనపు లగేజీపై సాధారణ లగేజీ రేటుకు 1.5 రెట్లు చార్జీ వసూలు చేయనుండగా, కనీస చార్జీ రూ.30గా నిర్ణయించారు.
ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేసుకోవాలి?
ప్రయాణికులు ఇండియన్ రైల్వేస్ పార్శిల్ పోర్టల్ లేదా ఐఆర్‌సీటీసీ ద్వారా లాగిన్ అయి, ప్రయాణ వివరాలు నమోదు చేయాలి. అనంతరం ఫార్వార్డింగ్ నోట్‌ను పూరించి అంచనా చార్జీలను పరిశీలించాలి. దరఖాస్తు సమర్పించిన తర్వాత దాని ప్రింట్‌తో పాటు లగేజీని బయలుదేరే స్టేషన్‌లోని పార్శిల్ కార్యాలయంలో అప్పగించాలి. అక్కడ బరువు నిర్ధారించిన తర్వాత తుది చార్జీలు వసూలు చేసి రైల్వే రసీదు (RR) జారీ చేస్తారు. అనంతరం ట్రాక్ అండ్ ట్రేస్ సదుపాయం ద్వారా లగేజీ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. గమ్యస్థానానికి చేరిన తర్వాత ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందించనున్నారు.
ఈ కొత్త విధానంతో అదనపు లగేజీ బుకింగ్ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగవంతంగా మారుతుందని, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో ఇది కీలక అడుగుగా నిలుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు.
- Varalakshmi Vratham 2026 Wishes Images: వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షల ఫోటోలు, HD Images, WhatsApp Status Photos మీకోసం..
- Nidhhi Agerwal ED: ఈడీ విచారణకు హాజరైన సినీ నటి నిధి అగర్వాల్…బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో 4 గంటల పాటు ప్రశ్నల వర్షం…
- Viral Video: మహబూబాబాద్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల క్రూరంగా వ్యవహరించిన పోలీసు అధికారి…ఉద్రిక్తంగా మారిన జీవో 97 నిరసన..
- Konda Sushmita: సీఎం రేవంత్ రెడ్డిపై సుస్మిత ఘాటు వ్యాఖ్యలు.. కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్.. ఏం జరిగిందంటే..
- ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. పదో తరగతి విద్యార్థులే డబ్బుల కోసం దారుణంగా..