శక్తివంతమైన ఓటు ఆయుదాన్ని కాపాడుకుందాం: MLA కూనంనేని సాంబశివరావు
Let us safeguard the powerful weapon of the vote: MLA Kunamneni Sambasiva Rao
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ ఏ కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్, బషీర్ బాగ్ దేశోద్దారక భవన్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ ఏ కూనంనేని సాంబశివ రావు అధ్యక్షతన సోమవారం ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (సర్) రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. ఎన్నికల వ్యవస్థను,ఓటరు హక్కులను కాపాడేందుకు సిపిఐ నిరంతరం కృషి చేస్తుందని, ఇందులో భాగంగానే మేధావులు,చట్ట నిపుణులతో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సులో వచ్చిన సూచనల ఆధారంగా రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను,ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని వెల్లడించారు. ఓటర్లను తొలగించడం ద్వారా ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ విధానాలపై కేవలం నాయకులకు మాత్రమే కాకుండా గ్రామ స్థాయిలోని సాధారణ ప్రజలకు, కార్యకర్తలకు పూర్తి అవగాహన ఉండాలని స్పష్టం చేశారు. బూత్ స్థాయి ఏజెంట్లు చురుగ్గా వ్యవహరిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే విధంగా తప్పులు లేని జాబితా రూపొందేలా నిరంతరం పర్యవేక్షించాలని ఆయన సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, పౌరుల స్వేచ్ఛ కోసం సిపిఐ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. మేధావులు, చట్ట నిపుణులు అందించిన సూచనలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, ప్రజల హక్కులకు భంగం కలిగించే ఎలాంటి చర్యలనైనా తాము తీవ్రంగా నిరసిస్తామన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) దేశ భవితవ్యాన్ని నిర్ణయించే ప్రక్రియ అని అన్నారు. ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ సక్రమంగా జరగకపోతే సామాన్య ప్రజల, అర్హులైన పౌరుల ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తారని, ఓటు వేసేందుకు తమ ప్రాంతాలకు తిరిగి వస్తారని, అలాంటి వారికి సొంత ఊరు వెళ్లి ఓటు నమోదు చేసుకునేందుకు దారి ఖర్చులు ఎవరిస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం సాఫ్ట్ ఉద్యోగులు, వలసకూలీలు ఇలా చాలా మంది ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిన వారి పరిస్థితిపైన స్పష్టత లేదన్నారు. ఎక్కువ శాతం ఓట్లు పోయేవి పేదలవే అని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ 60 శాతం దాటడం లేదని,చదువుకొని వారే ఓట్లు వేస్తారని, చదువుకున్న వారు మాత్రం ఓటు వేసేందుకు ముందుకు రావడం లేదని కూనంనేని సాంబశివరావు అన్నారు.