దీదీకి మరో బిగ్ షాక్.. రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసిన సుష్మితా దేవ్..వెంటనే హిమంత శర్మతో భేటీ..
TMC's Sushmita Dev Meets Himanta Sarma After Resigning as Rajya Sabha MP
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీపై పట్టు క్రమంగా చేజారుతోంది. బెంగాల్ అసెంబ్లీలో తిరుగుబాటు నాయకురాలు రీటబ్రత బెనర్జీకి 61 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలవడంతో ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్న టీఎంసీకి, ఇప్పుడు పార్లమెంటు వేదికగా వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరుగా పార్టీ సీనియర్ నేతలు మమతా వర్గానికి గుడ్‌బై చెబుతుండటంతో తృణమూల్ కాంగ్రెస్ జాతీయ రాజకీయాల్లో తీవ్ర రక్షణలో పడింది.
గత 13 ఏళ్లుగా టీఎంసీ రాజ్యసభ చీఫ్ విప్‌గా కొనసాగుతూ, మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న సుఖేందు శేఖర్ రాయ్ వారం రోజుల క్రితమే తన పదవులకు రాజీనామా చేసి తిరుగుబాటు శంఖారావం పూరించారు. రాజ్యసభ సభ్యత్వంతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన స్వస్తి పలికారు. మమతా బెనర్జీకి రాసిన ఘాటైన రాజీనామా లేఖలో బెంగాల్ ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
బెంగాల్లో విచ్చలవిడిగా పెరిగిపోయిన అవినీతిని, మహిళలపై జరుగుతున్న తీవ్ర అణచివేతను, ప్రభుత్వ సంపూర్ణ వైఫల్యాన్ని బెంగాల్ ప్రజలు పూర్తిగా తిరస్కరించారని ఆయన పేర్కొన్నారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, పరిశ్రమలు, ఉపాధి కల్పనతో పాటు శాంతిబద్రతల విషయంలో రాష్ట్రంలో తీవ్ర అరాచకం నెలకొందని దుయ్యబట్టారు. ఇదే సమయంలో బీజేపీపై ప్రశంసలు కురిపిస్తూ, బెంగాల్ చరిత్రలో తొలిసారిగా ఓటర్లు భారతీయ జనతా పార్టీకి భారీ విజయాన్ని అందించారని కొనియాడారు. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం తన హామీలకు అనుగుణంగా బెంగాల్ సమగ్ర అభివృద్ధి, పునర్నిర్మాణం కోసం అప్పుడే పని ప్రారంభించిందని ప్రశంసించారు.
సుఖేందు శేఖర్ రాయ్ విసిరిన షాక్ నుండి తేరుకోకముందే, తాజాగా మరో కీలక నేత సుష్మితా దేవ్ రాజ్యసభ సభ్యత్వానికి, టీఎంసీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి మమతా బెనర్జీకి గట్టి షాక్ ఇచ్చారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాల్సిందిగా కోరుతూ ఆమె రాజ్యసభ ఛైర్మన్ సి.పి. రాధాకృష్ణన్‌కు అధికారికంగా లేఖ రాశారు. గతంలో అస్సాంలోని సిల్చార్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభ ఎంపీగా పనిచేసిన సుష్మితా దేవ్, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అనంతరం 2021లో కాంగ్రెస్‌ను వీడి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో చేరిన కొద్ది రోజుల్లోనే ఆమె మమతా బెనర్జీకి దగ్గరై, జాతీయ అధికార ప్రతినిధిగా ఎదిగారు. ఆ తర్వాత పార్టీ అధినాయకత్వం ఆమెను రాజ్యసభకు కూడా పంపింది.
రాజ్యసభకు రాజీనామా చేసిన వెంటనే సుష్మితా దేవ్ ఢిల్లీలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మతో అత్యవసరంగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోంది. నమ్మదగిన వర్గాల సమాచారం ప్రకారం, ఆమె త్వరలోనే అధికారికంగా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రస్తుతం అస్సాంలోని ఒక లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉండటంతో, బీజేపీ అభ్యర్థిగా అక్కడి నుండి సుష్మితా దేవ్ బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వరుస పరిణామాలతో పశ్చిమ బెంగాల్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలలో కూడా టీఎంసీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది.