Skip to content
జాతీయం వార్తలు

దేశానికి మోదీ ఓ పెద్ద సమస్యగా మారారు.. విమర్శలు ఎక్కుపెట్టిన కాంగ్రెస్ పార్టీ..

Prajapaksham 10 Jun 2026 1 నిమిషాల పఠనం జాతీయం
దేశానికి మోదీ ఓ పెద్ద సమస్యగా మారారు.. విమర్శలు ఎక్కుపెట్టిన కాంగ్రెస్ పార్టీ..

PM Modi Overtakes Nehru's Tenure Record, Congress Hits Back

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం సుదీర్ఘ కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో, ఎన్నికైన ప్రధానులలో నిరంతరాయంగా ఎక్కువ కాలం కొనసాగిన నేతగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారనే అంశంపై రాజకీయంగా తీవ్ర చర్చ నడుస్తోంది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఘాటు విమర్శలు గుప్పించింది. మోదీ తన స్వయంప్రకటిత మైలురాయిని దాటి ఉండవచ్చు కానీ, దేశానికి మాత్రం ఆయన ఒక పెద్ద సమస్యగా పరిణమించారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ జైరాం రమేశ్‌ ఎద్దేవా చేశారు. మోదీ కేవలం దేశ పాలనకే కాకుండా, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి సారథ్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు.

భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సాధించిన విజయాలను గుర్తుచేస్తూ జైరాం రమేశ్‌ ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. 1947 ఆగస్టు 15న నెహ్రూ ఒక అద్భుతమైన మంత్రివర్గానికి అధ్యక్షత వహించి భారత ప్రధాని అయ్యారని, ఆ మంత్రివర్గం నేతృత్వంలో కేవలం ఐదేళ్లలోనే ఆధునిక భారతం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. ఆ కాలంలోనే 560కి పైగా రాచరిక సంస్థానాలను శాంతియుతంగా భారత యూనియన్‌లో విలీనం చేశారని, పటిష్టమైన భారత రాజ్యాంగాన్ని ఆమోదించారని గుర్తుచేశారు.

దేశంలో జమీందారీ వ్యవస్థ రద్దు, షెడ్యూల్డ్ కులాలు (SC), తెగలకు (ST) రిజర్వేషన్ల కల్పన, భారీ నీటిపారుదల ప్రాజెక్ట్‌ల నిర్మాణం వంటి విప్లవాత్మక నిర్ణయాలతో భారతదేశం ప్రపంచ వేదికపై ఒక శక్తిగా ఎదిగిందన్నారు. 1947-1952 మధ్య నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు నెలకొల్పిన అద్భుతమైన రికార్డులను, దేశ చరిత్రను ప్రస్తుత మోదీ ప్రభుత్వం పూర్తిగా చెరిపేయాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు.

గత ఎన్నికల ఫలితాలను ప్రస్తుత పరిణామాలతో పోలుస్తూ జైరాం రమేశ్‌ మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 1952, 1957, 1962 సార్వత్రిక ఎన్నికల్లో నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో తిరుగులేని విజయాలు సాధించిందని, కానీ 2024 ఎన్నికల్లో మోదీకి కనీస సొంత మెజారిటీ కూడా రాలేదని గుర్తుచేశారు. మోదీ మళ్లీ ప్రధాని పీఠం దక్కించుకోవడం కోసం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలకు రకరకాల తాయిళాలు ఇచ్చి, వారి మద్దతును కూడగట్టుకోవాల్సి వచ్చిందని విమర్శించారు.

మోదీ పరిపాలనలో స్వతంత్ర ఎన్నికల సంఘం, పవిత్రమైన ఓటర్ల జాబితా వంటి దేశ సర్వోన్నత ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ తీవ్ర ముప్పులో పడ్డాయని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. వరుసగా జరుగుతున్న పేపర్‌ లీక్‌ల కుంభకోణాల వల్ల దేశంలోని కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని దుయ్యబట్టింది. ప్రైవేటీకరణ ముసుగులో దేశంలోని ఎన్నో విలువైన ప్రభుత్వ రంగ ఆస్తులను, పరిశ్రమలను కొద్దిమంది కార్పొరేట్ ధనవంతుల పరం చేస్తున్నారని ఆరోపించింది. అంతేకాకుండా, చట్టసభల్లో, ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగలు, మరియు ఇతర వెనకబడిన తరగతులకు (OBC) కల్పించిన రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లను మోదీ ప్రభుత్వం లోపాయికారీగా బలహీనపరుస్తోందని జైరాం రమేశ్‌ తీవ్రస్థాయిలో విమర్శించారు.