Skip to content
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌లో భారీ వర్షం, ట్రాఫిక్ జామ్‌తో ప్రజలకు ఇబ్బందులు.. తెలంగాణకు వచ్చే 3 రోజులు భారీ వర్షాల అలర్ట్..

Prajapaksham 09 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
హైదరాబాద్‌లో భారీ వర్షం, ట్రాఫిక్ జామ్‌తో ప్రజలకు ఇబ్బందులు.. తెలంగాణకు వచ్చే 3 రోజులు భారీ వర్షాల అలర్ట్..

Heavy Rain in Hyderabad Triggers Traffic Jams Across the City

తెలంగాణ వ్యాప్తంగా రాబోయే రెండు రోజుల పాటు వాతావరణం మరింత ఆందోళనకరంగా మారనుంది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే బుధవారం నాడు వికారాబాద్, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వీటితో పాటు ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ, హైదరాబాద్‌ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కామారెడ్డిలో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉంది.

మరోవైపు హైదరాబాద్ మహానగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఉరుములు, మెరుపులతో కూడిన ప్రచండమైన భారీ వర్షం కురిసింది. ఈ ఈదురుగాలుల బీభత్సానికి నగరవ్యాప్తంగా పాతబస్తీ, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, మియాపూర్ వంటి ప్రధాన ప్రాంతాలు జలమయమయ్యాయి. పాతబస్తీలోని బండ్లగూడలో భారీ వర్షం కారణంగా విద్యుత్ తీగలు తెగి రోడ్డుపై పడటంతో, వాటిని గమనించని జాఫర్ (25), అబూ (16) అనే ఇద్దరు యువకులు కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. అలాగే పాతబస్తీలోని ఛత్తాబజార్‌లో ఒక చిన్న కమాన్‌ రోడ్డుపై కూలిపోయింది, అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో తృటిలో పెద్ద ప్రాణనష్టం తప్పింది. ముషీరాబాద్ పరిసర ప్రాంతాలలో బలమైన గాలుల వల్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.

నగరంలో వర్షపాత గణాంకాలను పరిశీలిస్తే, అత్యధికంగా బన్సీలాల్‌పేటలో 8.7 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, విఠల్‌ వాడీలో 7.8 సెం.మీ, హిమాయత్‌నగర్‌లో 7.8 సెం.మీ, ,విద్యానగర్‌లో 7.3 సెం.మీ చొప్పున భారీ వర్షం పడింది. ఈ జోరు వానల వల్ల హిమాయత్‌నగర్, మాదాపూర్‌ పర్వత్‌నగర్‌ చౌరస్తా, మియాపూర్‌ జేపీ నగర్, ,రాజేంద్రనగర్‌లోని పాతకర్నూలు రహదారులపై భారీగా వరదనీరు చేరింది. మోకాళ్ళ లోతు నీరు నిలిచిపోవడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ఐటీ కారిడార్‌తో సహా ప్రధాన రహదారులన్నీ కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌తో స్తంభించిపోయాయి.

వర్షం ,ఈదురుగాలుల తీవ్రతకు నగరవ్యాప్తంగా కొండాపూర్, గచ్చిబౌలి, షేక్‌పేట్, మాదాపూర్, బాగ్‌లింగంపల్లి సాయిబాబా ఆలయ పరిసరాలతో పాటు దాదాపు 80 చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. రాంనగర్‌ వీఎస్టీ రోడ్డు ,హైదర్‌గూడలో భారీ చెట్లు రహదారులపై విరిగిపడటంతో రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. ఈ అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో హైడ్రా (HYDRA) కమిషనర్ రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ట్యాంక్‌బండ్‌పై నిలిచిన వరద నీటి మళ్లింపును, కూలిన చెట్ల తొలగింపు చర్యలను ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. హైడ్రా డీఆర్‌ఎఫ్‌ (DRF) బృందాలు భారీ మోటార్ల సహాయంతో రహదారులపై ఉన్న వరదనీటిని నాలాల్లోకి మళ్లిస్తూ, కూలిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ట్రాఫిక్ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *