Skip to content
తెలంగాణ వార్తలు

రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తున్నాం: భట్టి విక్రమార్క

Prajapaksham 09 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తున్నాం: భట్టి విక్రమార్క

We Are Procuring Every Single Grain of Paddy From Farmers: Bhatti Vikramarka

తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తోందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల తడిచిన ధాన్యాన్ని సైతం కనీస మద్దతు ధర (MSP) కల్పించి కొనుగోలు చేసిన ఘన చరిత్ర కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన అన్నారు. జనగామ జిల్లాలో పర్యటించిన ఆయన పలు ప్రతిష్టాత్మక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 72 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించి, దానికి సంబంధించిన రూ. 14 వేల కోట్లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిందని వివరించారు. గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటోందని, ఇందులో భాగంగానే రైతులకు ఇప్పటికే రూ. 22 వేల కోట్ల రుణమాఫీని విజయవంతంగా పూర్తి చేశామని గుర్తుచేశారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఇంతలా కృషి చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణపై వివక్ష చూపుతోందని డిప్యూటీ సీఎం ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని కేంద్రం ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించిన ఆయన, వరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం సేకరించిన మొక్కజొన్నను కూడా కేంద్ర ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని సామాన్యులకు, రైతులకు నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా అందించేందుకు ప్రభుత్వం భారీగా ఆర్థిక భారాన్ని భరిస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు.

రాష్ట్రంలోని 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు అందిస్తున్న ఉచిత విద్యుత్ బిల్లుల భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ, అందుకు సంబంధించిన రూ. 14,000 కోట్లను డిస్కమ్‌లకు చెల్లిస్తోందని, అలాగే గృహ జ్యోతి పథకం కింద 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం కోసం మరో రూ. 5,000 కోట్లు కేటాయించిందని వివరించారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం జిల్లాకు ఎంతో కీలకమైన దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని భట్టి విక్రమార్క విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాదుల ప్రాజెక్టుకు అవసరమైన నిధులను ప్రత్యేకంగా మంజూరు చేసిందని, దీనివల్ల ప్రస్తుతం పనులు చాలా వేగంగా సాగుతున్నాయని చెప్పారు. త్వరగతిన ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి జనగామ, పరిసర ప్రాంతాల రైతాంగానికి సాగునీరు అందించి తీరుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *